ప్రాజెక్టులు అక్రమమని తీర్మానం చేస్తారా?
టీటీడీపీ నాయకులకు హోంమంత్రి నాయిని ప్రశ్న
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తిరుపతి సభలో తెలంగాణ ప్రాజెక్టులు అక్రమం అని తీర్మానం చేసిన టీటీడీపీ నాయకుల్లారా.. మీరు తెలంగాణ ప్రాంతంలో తిరుగుతారా’ అంటూ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి బచ్చగాడు.. ఆయనతోని ఏమైతదని, ఆరు నూరైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి తీరుతారన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియాన్ని ఆదివారం ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు.
మ్యూజియంలో ప్రదర్శించిన జైలు రికార్డులు, అప్పట్లో ఖైదీలను శిక్షించే పరికరాలను, ఖైదీలు వాడిన వస్తువులను ఆయన పరిశీలించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. శాంతిమార్గంలో ఆనాడు గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తే.. అదే మార్గంలో కేసీఆర్ తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులనే తాము రీ డిజైన్ చేసి కడుతున్నామని మంత్రి నాయిని తెలిపారు. దక్షిణ తెలంగాణలో డిండి, ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులు కొత్తవి కావన్నారు. తెలంగాణ వాదులంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, వాళ్లను కాపాడుకోవడం చేతగాని కాంగ్రెస్ నాయకులకు తమను విమర్శించే హక్కు ఎక్కడిదన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చి దిద్దితున్నామని చెప్పారు.