‘విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’
హైదరాబాద్: తెలంగాణలో ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి వీడాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లాకో మాట మాట్లాడుతూ ప్రాజెక్ట్ ల నిర్మాణాలు అడ్డుకుంటూ సీఎం కేసీఆర్ మీదనే విమ్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాలను కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి కోర్టులో స్టే తెచ్చి నిలివేయించి , మళ్లీ రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలు చేస్తారా అని ప్రశ్నించారు. మీరు కట్టని, ముట్టని ప్రాజెక్ట్ లు పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.
నాయకులు లేక కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం మీద విమర్శలు చేస్తే ఖబర్దార్ అన్నారు. మీరు 50 ఏళ్ళ కాలంలో చేయని పనుల్లో తమ ప్రభుత్వం చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయకు రూ. 378 కోట్ల నిధులు, మిషన్ కాకతీయకు రూ. 2000 కోట్లు కేటాయించడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, ఎవరు ఎన్ని అడ్డంకులు తెచ్చినా లక్షల ఎకరాలకు సాగు నీరు , తాగు నీరు అందిస్తారని తెలిపారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులవి తప్పుడు యాత్రలని, రామ్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.