సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై.. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యతపై సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయ లబ్ధి కోసం ప్రజాభివృద్ధి కార్యక్రమాలపై విషం చిమ్మడం కాంగ్రెస్‌కు రివాజుగా మారిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కాదని, ఆయనకు ప్రాజెక్టులపై సరైన సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడారని విమర్శించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని, గతంలో అడవుల మధ్యలో నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. అటవీ పరిరక్షణ చట్టాలకు లోబడి అడవుల బయటి నుంచి సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని, అందుకే పర్యావరణ, అటవీ అనుమతులు వెంట వెంటనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం సమంజసం కాదని, డిజైన్ మార్చడం వల్ల ఖమ్మం జిల్లాలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం లభించిందని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి.. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటుందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఎవరేం చేశారో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు సంబంధించి రాహుల్‌గాంధీకి ఆ పార్టీ నేతలు సమగ్ర సమాచారం ఇవ్వకుండా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. రాహుల్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment