వాళ్ల మైండ్స్ రీడిజైన్ చేయాలి: కేటీఆర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగానికి కేంద్రం సాయం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవానికి రావాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఆహ్వానించారు. కేటీఆర్తో పాటు టీఆర్‌ఎన్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు త్వరలో రాష్ట్రానికి వస్తానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, అపరిపక్వతతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ, హరియాణకు భౌగోళిక పరిస్థితుల్లో తేడా ఉందన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏళ్లు పాలించి ఏమీ చేయని అసమర్థులు కాంగ్రెస్ నేతలు అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుల మైండ్లను రీడిజైన్ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్పై అసెంబ్లీ సమావేశాల్లో తోక ముడిచి, ఇప్పుడు మీడియా కోసం ప్రాజెక్టుల యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రైవేట్ బిల్లుకు మద్దతిస్తామనలేదు
రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేటు బిల్లుకు తాను మద్దతిస్తానని అనలేదని కేటీఆర్ తెలిపారు. హైకోర్టు విభజనపై ఎవరైనా బిల్లు పెడితే మద్ధతిస్తానని మాత్రమే చెప్పానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ఎలా సాధించారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో 36 పార్టీలను ఒప్పించి ఏకాభిప్రాయం ద్వారా తెలంగాణ సాధించామని చెప్పుకొచ్చారు. ప్రైవేటు బిల్లుతో ఏమీ ఒరగదన్నారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి, ఇంగితజ్ఞానం ఉంటే అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇలాంటి గిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెట్టగలం అనుకుంటే అది వారి అవివేకం అని విమర్శించారు.