Amethi: స్మృతి వర్సెస్‌ కిశోరీ | Sakshi
Sakshi News home page

Amethi Lok Sabha: స్మృతి వర్సెస్‌ కిశోరీ

Published Wed, May 15 2024 9:47 AM

Smriti Irani Vs Kishori lal At Amethi Lok Sabha

అమేథీలో మారిన ఎన్నికల చిత్రం 

గెలుపుపై ధీమాతో సిట్టింగ్‌ ఎంపీ  

స్మృతి తనకు పోటీయే కాదంటున్న శర్మ  

అమేథీ. ఉత్తరప్రదేశ్‌లోని ఈ లోక్‌సభ స్థానం గాంధీ కుటుంబానికి పెట్టని కోట.. కాంగ్రెస్‌కు కంచుకోట. అలాంటి దీర్ఘకాల రాజకీయ వారసత్వానికి 2019లో బీజేపీ గట్టి షాకే ఇచి్చంది. ఏకంగా గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీనే ఓడించి కాంగ్రెస్‌ కుంభస్థలం మీద కొట్టింది. పార్టీ తరఫున నెగ్గి జెయింట్‌ కిల్లర్‌గా అవతరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌కు బదులు గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీలాల్‌ శర్మ బరిలోకి దిగారు. ఓటమి భయంతోనే అమేథీని వదిలి రాయ్‌బరేలీకి మారారంటూ సోషల్‌ మీడియాలో రాహుల్‌ ఒక రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ నెల 20న ఐదో విడతలో పోలింగ్‌ జరగనున్న అమేథీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

గాందీల అనుబంధం 
అమేథీ లోక్‌సభ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. నాటినుంచీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 1977 ఎన్నికల్లో మాత్రం ఎమర్జెన్సీ ప్రభావంతో జనతా పారీ్టకి చెందిన రవీంద్ర ప్రతాప్‌ సింగ్‌ గెలుపొందారు. ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్‌ గాం«దీని 75,000కు పైగా ఓట్లతో ఓడించారు. 1980 ఎన్నికల్లో సంజయ్‌ పుంజుకుని రవీంద్ర ప్రతాప్‌ సింగ్‌ను 1,28,545 తేడాతో ఓడించారు. అదే ఏడాది జూన్‌లో సంజయ్‌ విమాన ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్‌ గాంధీ 2,37,696 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్‌పై సంజయ్‌ భార్య మేనకా గాంధీ స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. 

రాజీవ్‌ దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయన తరపున భార్య సోనియాగాంధీ తొలిసారి ఎన్నికల ప్రచార బరిలో దిగారు. తలపై చీరకొంగు, నుదుటన బొట్టు, చేతికి ఎర్రటి గాజులు, స్వచ్ఛమైన హిందీతో సామాన్యులను బాగానే ఆకట్టుకున్నారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకున్నా ఇటు పార్టీ నాయకులకు, అటు ప్రజలకు చేరువయ్యారు. ప్రధానిగా రాజీవ్‌ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోరన్న ప్రచారం జరిగినా అమేథీ ప్రజలు ఆయనవైపే నిలిచారు. మేనకపై ఏకంగా 3.14 లక్షల మెజారిటీతో రాజీవ్‌ ఘనవిజయం సాధించారు. అమేథీలో నేటికీ అదే రికార్డు మెజారిటీ. రాజీవ్‌ మరణించేదాకా అమేథీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. తరవాత ఆయన స్థానంలో గాంధీ కుటుంబ సన్నిహితుడు సతీశ్‌ శర్మ విజయం సాధించి పీవీ కేబినెట్‌లో పెట్రోలియం మంత్రిగా కూడా చేశారు. 

బీజేపీ ఎంట్రీ...  
1998లోనే బీజేపీ అమేథీలో పాగా వేసింది. సతీశ్‌ శర్మ రెండుసార్లు గెలిచిన తర్వాత 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్‌ సింగ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. 1999లో సోనియా అమేథీ నుంచే గెలిచి ఎన్నికల అరంగేట్రం చేశారు. తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ రాహుల్‌ గెలిచారు. 2019 దాకా దశాబ్దన్నర పాటు ఆయన హవాయే సాగింది. 2014 ఎన్నికల్లో రాహుల్‌ చేతిలో ఓడిన స్మృతి వ్యూహాత్మకంగా నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టారు. దీనికి మోదీ మేనియా తోడై 2019లో రాహుల్‌ను స్మృతీ ఓడించగలిగారు. 

ఎస్పీ పూర్తి మద్దతు 
అమేథీలో కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ బరిలో దిగుతారా, లేదా అన్నదానిపై చిట్టచివరి నిమిషం దాకా ఉత్కంఠే కొనసాగింది. ఒకానొక దశలో అమేథీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరిగింది. ఎట్టకేలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజున రాహుల్‌ రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగడం ఖాయమైంది. అ మేథీ నుంచి పార్టీ సీనియర్‌ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిశోరీ లాల్‌ శర్మను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శర్మ అందరికీ సుపరిచితుడు.

 దీనికి తోడు ఇండియా కూటమి భాగస్వామి సమాజ్‌వాదీ ఈసారి కాంగ్రెస్‌కు అన్నివిధాలా దన్నుగా నిలుస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్‌ విజయం కోసం రెండు పారీ్టల కార్యకర్తలు కలసికట్టుగా పని చేస్తున్నారు. కుల సమీకరణాలు కూడా పని చేస్తున్నాయి. ఈ సారి యాదవులంతా ఒక్కతా టిపైకి వచ్చారు. అఖిలేశ్‌ చెప్పినవైపే తమ ఓటంటున్నారు. ఈ సానుకూలత సాయంతో కాంగ్రెస్‌ తన కంచు కోటను తిరిగి కైవసం చేసుకుంటుందా, స్మృతీయే మళ్లీ గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఓటర్లు.. ఓట్ల శాతం..
అమేథీ లోక్‌సభ స్థానం పరిధిలో జిల్లాలోని అమేథీ, తిలోయి, జగదీశ్‌పూర్, గౌరీగంజ్, రాయ్‌బరేలి జిల్లాలోని సలోన్‌ అసెంబ్లీ స్థానాలున్నాయి. నియెజకవర్గ జనాభా 20 లక్షల పై చిలుకు. 1999, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ అత్యధిక ఓట్ల శాతంతో గెలిచింది. 2014లో బొటా»ొటిగా గట్టెక్కింది. 2019లో 49.7 శాతం ఓట్లతో బీజేపీ గెలిచింది. స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో రాహుల్‌ను ఓడించారు. అమేథీలో ఏకంగా 96 శాతం ఓటర్లు గ్రామీణులే!

స్మృతి టెంపుల్‌ రన్‌...
ఇక ఈసారి స్మృతి ఇరానీ ఆరునెలల ముందునుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అమేథీలో అత్యధిక సంఖ్యాకులైన గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు నవరాత్రి సందర్భంగా ఆలయాలు సందర్శించారు. అమేథీలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 42 దేవాలయాలకు తన ఫొటోతో కూడిన బహుమతి ప్యాక్‌లను పంపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉంటూ అమేథీకి ప్రాతినిధ్యం వహించబోనంటూ గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇటీవలే అమేథీలో ఇల్లు కొని గృహ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నారు. నెహ్రూ–గాంధీ కుటుంబం వల్లే నియోజకవర్గం ఇంతకాలం వెనుకబడి ఉందంటూ ప్రత్యరి్థపై మాటల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ అయితే రాహుల్‌ తమకు భయపడే అమేథీ వదిలి రాయబరేలీ పారిపోయారంటూ ప్రచారం చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement