హైదరాబాద్ : మహారాష్ట్రతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకునేది చారిత్రక ఒప్పందం కాదని... మహాద్రోహం అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు భట్టి విక్రమార్కతోపాటు సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.
రీడిజైనింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. 50 వేల కోట్లు పెంచారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ చేప్తున్న ఆయకట్టుకు... నీటి లభ్యతకు పొంతనే లేదని పొన్నాల స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందంపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పొన్నాల సవాల్ విసిరారు.
కేసీఆర్ వైఖరితో బంగారు తెలంగాణ కాస్త... భ్రష్టు పట్టిన తెలంగాణ అయ్యే ప్రమాదం ఉందని కె. జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ. కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని కేసీఆర్పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ చేసుకునే ఒప్పందం మహాపాపం, మహా నష్టం అని భట్టి అభివర్ణించారు.