సాక్షి, మహారాష్ట్ర: బీఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాందేడ్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందన్నారు. ‘‘ప్రధానులు మారినా, పార్టీలు మారినా దేశంలో మార్పు రాలేదు. దేశంలో మార్పు తీసురావడానికే జాతీయ రాజకీయాల్లోకి వచ్చాం. ప్రస్తుతం నేతలు మాటలకే పరిమితం అవుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘దేశంలో పూర్తిస్థాయిలో కరెంటు, సాగు, తాగునీరు అందడం లేదు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. రైతుల ఆత్మహత్యకు కారణం ఎవరు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు. భారతదేశం మేధావుల దేశం. భారత్ పేద దేశం కానేకాదు. చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికా కంటే బలంగా మారుతాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు రాకూడదు. పండించిన పంటకు రైతులే ధరలు నిర్ణయించాలి. అప్పుడే రైతు రాజ్యం సాధ్యమవుతుంది. చైనా కంటే మన దగ్గరే సాగుభూమి అధికంగా ఉంది. దేశంలో వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి’’ అని సీఎం అన్నారు.
‘‘భారత్‌లో నాయకులు గెలవడం కాదు.. రైతులు గెలవాలి. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనేదే బీఆర్‌ఎస్ తొలి నినాదం. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిపోయింది. మాంజా నుంచి జాతీయ జెండా వరకు చైనా నుంచే దిగుమతి అవుతుంది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలి. దేశం వెనుకబాటు తనానికి కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఒకరు అంబానీ అంటే.. మరొకరు అదానీ అంటారు’’ అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
చదవండి: TS: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?
‘‘తెలంగాణలో రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొంటోంది. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు. దేశంలో ప్రతి ఎకరాకు నీరందించేందుకు పుష్కలమైన నీరుంది. కేంద్రం ట్రైబ్యునల్ వేసి చేతులు దులిపేసుకుంటోంది. రిజర్వాయర్ కట్టాలంటే అనుమతుల పేరుతో కాలయాపన, ట్రైబ్యునల్‌లో వివాదాలు 30,40 ఏళ్లు కొనసాగుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో కరెంటు కష్టాలు ఉండేవి. కానీ ఇప్పుడు నీటి, కరెంటు సమస్యలు లేవు. రైతులు 50 మోటార్లు పెట్టుకున్నా అడ్డు చెప్పడం లేదు’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘ప్రమాదంలో చనిపోతే రైతు బీమా అందిస్తున్నాం. జెండా రంగులను చూసి జనం మోసపోతున్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో అద్భుతాలు చేసి చూపిస్తాం. ఫసల్ బీమా యోజన అంతా ఒక బూటకం’’ అని కేసీఆర్ మండిపడ్డారు.
ముందుగా, హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. ప్రత్యేక కాన్వాయ్‌లో సభావేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలకు బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment