CM KCR: టార్గెట్‌ మహారాష్ట్ర! | KCR Says BRS contests all elections including local bodies | Sakshi
Sakshi News home page

CM KCR: టార్గెట్‌ మహారాష్ట్ర!

Published Sun, Apr 2 2023 2:48 AM | Last Updated on Sun, Apr 2 2023 11:03 AM

KCR Says BRS contests all elections including local bodies - Sakshi

రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు ఇలా అన్ని రకాలుగా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ తరహాలో మహారాష్ట్ర, కేంద్రం ఎందుకు పనిచేయడం లేదు? దేశ రైతాంగానికి సాగునీరు, కరెంటు, పెట్టుబడి సాయం లేవు. అందుకే అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం..
 – సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌­ఎస్‌) తదుపరి టార్గెట్‌ మహారాష్ట్రేనని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్ప­ష్టం చేశారు. మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి, బీఆర్‌ఎస్‌ విజయానికి తోడ్పడేలా కమిటీలు వేస్తా­మ­ని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతుల్లో ఐక్యత రావాలని, వారి చేతిలో ఉన్న ఓటు­ను అస్త్రంగా ఉపయోగించుకుని రైతురాజ్యం తెచ్చు­కో­­వాలని పిలుపునిచ్చారు.

శనివారం తెలంగాణ భవ­న్‌­లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ (రైతు సంఘం) నేత శరద్‌ జోషి ప్రణీత్‌తోపాటు పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో షెట్కారీ కామ్‌గార్‌ పార్టీ మహారాష్ట్రలో 76 సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు 200 సీట్లు గెలుస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘నా 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, సమస్యలు, ఆటుపోట్లను చూశా.. దేశంలోని రైతుల కష్టం చూసి రైతుల పోరాటం న్యాయమైనదనే భావనతో జాతీయ రైతుల సమస్యలను తలకెత్తుకున్నా. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే అసంభవమనేది ఉండదు. ప్రతి తాళానికీ తాళం చెవి ఉన్నట్టుగానే ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. రోడ్ల మీద ఆందోళనలు, పోరాటాలు చేసి లాఠీలు, తూటాలు తినాల్సిన పనిలేదు. గట్టి సంకల్పంతో, చిత్తశుద్ధితో ముందుకువెళితే చాలు. మనం కచ్చితంగా గెలిచి తీరుతాం. 

ప్రధాని దిగి వచ్చారు.. 
రైతు సమస్యల పరిష్కారానికి 1935 నుంచి నేటి దాకా రైతు పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. 13 నెలల పాటు ఢిల్లీ రోడ్లమీద రైతులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు, తీవ్రవాదులు అని ముద్రవేíసినా రైతులు చెక్కుచెదరలేదు. పోరాటంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పంజాబ్, యూపీ ఎన్నికల కోసం ప్రధాని దిగివచ్చి రైతులకు క్షమాపణలు చెప్పారు. 

వ్యవసాయ సుస్థిరతతో తగ్గిన ఆత్మహత్యలు 
తెలంగాణ ఏర్పాటుకు ముందుకు ఇక్కడ మహారాష్ట్ర కన్నా పరిస్థితులు ఘోరంగా ఉండేవి. ఇక్కడ వ్యవసాయ సుస్థిరత సాధించడంతో ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణవ్యాప్తంగా రిజర్వాయర్లతోపాటు ఇక్కడి అభివృద్ధిని ఒకటి రెండు రోజులు ఉండి పరిశీలించండి. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు నడి వేసవిలోనూ తెలంగాణ చెరువులు, కాలువల్లో నిండుగా నీరుంది. హిమాలయాల కంటే ఎత్తైన సంకల్పం వల్లే ఇక్కడ నీళ్లు పారుతున్నాయి. 

14 మంది ప్రధానులు మారినా.. 
దేశంలో సహజ సంపదలకు కొదవలేకున్నా భారత్‌ వెనుకబడింది. 14 మంది ప్రధానులు మారినా మన దేశ తలరాత మారలేదు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? తెలంగాణ బడ్జెట్‌ కన్నా మహారాష్ట్ర బడ్జెట్‌ పెద్దది. మరి ఆ రాష్ట్ర సర్కార్‌ ఎందుకు రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం లేదు. అంటే దీని వెనుక ఏదో ఉంది (దాల్‌ మే కుచ్‌ కాలా హై) అని అర్థమవుతోంది.

రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు ఇలా అన్ని రకాలుగా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ తరహాలో మహారాష్ట్ర, కేంద్రం ఎందుకు పనిచేయడం లేదు? దేశ రైతాంగానికి సాగునీరు, కరెంటు, పెట్టుబడి సాయం లేవు. అందుకే అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ బీబీ పాటిల్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ కిసాన్‌ విభాగం అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌ చడోని తదితరులు పాల్గొన్నారు. 

భారీ ర్యాలీగా వచ్చిన నేతలు 
శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ నేత శరద్‌ జోషి ప్రణీత్‌తో పాటు పలువురు నేతలు భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వీరికి కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ యువజన అధ్యక్షుడు సుధీర్‌ బిందు, కైలాష్‌ తవార్, శరద్‌ మర్కాడ్, సువర్ణ కాఠే, రాంజీవన్‌ బోండార్, నారాయణ్‌ విభూదే, బిజి కాకా, అనిల్‌ రజంకార్, పవన్‌ కర్వార్, భగవత్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు. వీరితో పాటు చంద్రపూర్‌ జిల్లాకు చెందిన యువజన నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. 

పార్టీని బలోపేతం చేసుకుందాం 
భారత్‌ రాష్ట్ర సమితిలో చేరడానికి తెలంగాణ భవన్‌కు వచ్చి­న మహారాష్ట్ర నాయకులతో ముఖ్యమంత్రి  కేసీఆర్‌ కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ తదుపరి టార్గెట్‌ మహారాష్ట్రేనని.. అక్కడ జరిగే అన్ని ఎన్నికల్లో గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే విదర్భలో భారీ బహిరంగసభ నిర్వహిద్దామన్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రయత్నాలు చేయాలని నేతలకు సూచించారు.

మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతోపాటు బీఆర్‌ఎస్‌ గెలుపునకు బాటలు వేసేలా కమిటీలు వేస్తామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు చాలా మంది నాయకులు వస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతుల నాయకత్వంతోనే ముందుకెళ్లనున్నామని.. రైతుల పోరాటంలో మహారాష్ట్రలో ముఖ్య భూమిక పోషించాలని నేతలకు సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement