కాంధార్ లోహ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని జిల్లా పరిషత్‌లలో బీఆర్‌ఎస్ పోటీచేసి గులాబీ జెండాను ఎగురవేస్తుంది. గ్రామాల్లో మీ బలాన్ని చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇంతకుముందు తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని 80 గ్రామాల సర్పంచులు తీర్మానం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోయింది. ఎంతో సంపద ఉన్న మహారాష్ట్రను పది పదిహేనేళ్లలో శక్తివంతమైన రాష్ట్రంగా మార్చవచ్చు.
– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో జాతివాదం, మతవాదాన్ని విడిచిపెట్టి.. రైతువాదాన్ని చేపట్టాలని.. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు, రైతులకు న్యాయం జరగలేదని.. రైతు సర్కారు వచ్చినప్పుడే మన సమస్యలు తీరుతాయని చెప్పారు. మహారాష్ట్రలో తన సభకు జనం రాకుండా కొందరు ప్రయత్నాలు చేశారని, రైతులు తుపాన్‌లా విజృంభించినప్పుడు అలాంటి కుట్రలు పనిచేయవని స్పష్టం చేశారు.
తనతో కలసి ఉద్యమించేందుకు రావాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత తనదని చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలోని కాంధార్ లోహలో ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘మీరు తెలంగాణలో పనిచేయండి, ఇక్కడేం పని అని నన్ను అడుగుతున్నారు. నేను భారత పౌరుడిని. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నాకు పని ఉంది. గతంలో నాందేడ్ పర్యటనకు వచ్చినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ మీకేం పని అని ప్రశ్నించారు.
రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత సాగునీరు, ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు వంటివి అమలు చేసేంత వరకు మహారాష్ట్రలో రైతులతో కలిసి నా పోరాటం కొనసాగుతుంది.
తెలంగాణ తరహాలో ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షల సాయం అందజేసే దళితబంధు పథకం అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డపై అమలయ్యేంత వరకు వస్తూనే ఉంటా. నాందేడ్ ప్రజల ప్రేమ నన్ను ప్రతీసారి ఇక్కడికి వచ్చేలా చేస్తోంది. చంద్రాపూర్, షోలాపూర్, పశ్చిమ మహారాష్ట్రతోపాటు మరెన్నో చోట్లకు రావాలంటూ నాకు వినతులు అందుతున్నాయి.
ఇక్కడ నా సభకు ప్రజలు రాకుండా చేసేందుకు మేకలను కోస్తూ దావత్‌లు ఇస్తున్నారు. రైతులు తుఫాన్‌లా విజంభించినప్పుడు ఇలాంటి కుట్రలు పనిచేయవు. నా అంచనా ప్రకారం మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుంది.
ఆదివారం మహారాష్ట్రలోని కాంధార్–లోహలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తా..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. పార్టీలు, పాలకులు మారుతున్నా.. ప్రజల స్థితిగతుల్లో మార్పులు రావడం లేదు. స్వాతంత్య్రం తర్వాత మొరార్జీ, వీపీ సింగ్, చరణ్‌సింగ్, దేవేగౌడ వంటి కొందరు తప్పించి మిగతా 70 ఏళ్లలో.. 54ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్ల పాటు బీజేపీ పాలన సాగినా ప్రజల పరిస్థితిలో తేడా లేదు. దేశంలో సమృద్ధిగా సాగుయోగ్య భూమి, నీటి వనరులున్నా వ్యవసాయ రంగం దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
నదుల్లో వేలాది టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా.. మహారాష్ట్ర సహా ఎన్నో ప్రాంతాల్లో తాగు, సాగునీరు లభించడం లేదు. వనరులను సద్వినియోగం చేయడంలో ఇక్కడి ముఖ్యమంత్రి, దేశ ప్రధాని ప్రతిబంధకంగా మారారనే విషయాన్ని గుర్తించండి. నాతో కలిసి ఉద్యమించండి. ప్రతీ ఎకరానికి నీరు అందించే బాధ్యత నాది. నా మాటలను ఇక్కడే వదిలి వెళ్లకుండా మీ గ్రామాల్లో, మీ కుటుంబాల్లో చర్చించండి.
గులాబీ జెండా బలం తెలుసుకోండి
రైతాంగ సమస్యలపై రైతులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. నేటికీ మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. మరి వారు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎక్కడ పడుకున్నారు. రైతులు 13 నెలల పాటు ధర్నా చేసి 750 మంది ప్రాణాలు కోల్పోతే ఒక్కమాట మాట్లాడని ప్రధాన మంత్రి.. యూపీ, పంజాబ్ ఎన్నికలు రావడంతో తీయటి మాటలతో క్షమాపణ చెప్పాడు.మనం ఏకమై లక్ష్యం కోసం ఉద్యమించి బలాన్ని చూపినప్పుడు ఇలా నిప్పు మీద నీళ్లు చల్లినట్టుగా డ్రామాలు ఆడుతుంటారు.
దేశంలో కులం, మతం పేరు మీద విభజింపబడి ఎంతకాలం పాలింపబడతామో అప్పటిదాకా మనం ఇలాగే మధనపడాల్సి వస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. రైతులు ఎవరికో ఒకరికి వేటు వేస్తారు కదా అనే ధీమాతో దేశంలోని రాజకీయ పార్టీలున్నాయి. రైతుల ఐకమత్యమే వారి దుస్థితికి విరుగుడు. గులాబీ జెండా బలం తెలుసుకుని మనమే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలమవుదాం. ఎంతవరకు మనం ఏకమవుతామనే విషయంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని జిల్లా పరిషత్‌లలో బీఆర్‌ఎస్ పోటీచేసి గులాబీ జెండాను ఎగురవేస్తుంది. గ్రామాల్లో మీ బలాన్ని చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇంతకుముందు తెలంగాణ మోడల్‌ను ఆమలు చేయాలని 80 గ్రామాల సర్పంచులు తీర్మాణం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోయింది.
తొమ్మిదేళ్ల క్రితం దారుణ స్థితిలో ఉన్న తెలంగాణ ఇప్పుడు గొప్ప ప్రగతితో ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటిది ఎంతో సంపద ఉన్న మహారాష్ట్రను పది పదిహేనేండ్లలో శక్తివంతమైన రాష్ట్రంగా మార్చవచ్చు. జై తెలంగాణ.. జై మహారాష్ట్ర.. జై భారత్’’ అంటూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.
సభలో ఎంపీలు బీబీ పాటిల్, సంతోష్‌కుమార్, దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, షకీల్ అహ్మద్, బీఆర్‌ఎస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ హిమాంశు తివారీ తదితరులు పాల్గొన్నారు.
కాంధార్, లోహ పట్టణాలు గులాబీమయం
బీఆర్‌ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో కాంధార్, లోహ పట్టణాలు గులాబీమయంగా మారాయి. ప్రధాన రహదారుల వెంట బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు కట్టారు. ఈ సభలో పాల్గొనేందుకు కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు చేరుకున్నారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాంధార్ లోహకు వెళ్లారు. తొలుత కాంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోంగ్డే నివాసానికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత ప్రత్యేక బస్సులో ర్యాలీగా లోహలోని బైల్‌బజార్ మైదానం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.
వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, బసవేశ్వరుడు, బీఆర్ అంబేడ్కర్, అన్నా బాహుసాతే, మహాత్మా పూలే, అహిల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సాయంత్రం 4.20కు బహిరంగ సభ ముగిశాక హైదరాబాద్‌కు తిరుగుపయనమైన కేసీఆర్ 5.45 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
బీఆర్‌ఎస్‌లో నేతల చేరిక
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన మహారాష్ట్ర నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు శంకరన్న ధోండ్గే, మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ జాదవ్, డాక్టర్ వసంతరావు బోండేతోపాటు నాగ్‌నాథ్ ఘిసేవాడ్, సురేష్ గైక్వాడ్, యశ్‌పాల్ భింగే, జకీర్ చావ్స్, ప్రహ్లాద్ రొఖండో తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment