సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 1న మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత అన్నాభావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అన్నాభావు జన్మించిన సాంగ్లి జిల్లాలోని వటేగావ్‌లో ఆయన చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా సాఠే కోడలు, మనవడితో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లో చేరతారు.
స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే మాంగ్ లేదా మాతంగ్‌గా పిలిచే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా సాఠే మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. ఇలావుండగా అదే రోజు మధ్యాహ్నం కొల్హాపూర్‌లోని అంబాబాయి (మహాలక్ష్మీ) దేవాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ఒకటి రెండురోజుల్లో పూర్తి షెడ్యూల్ వెలువడుతుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
సోలాపూర్ సభ వాయిదా
బీఆర్‌ఎస్ సత్తా చాటేలా ఈనెల 30న సోలాపూర్‌లో సుమారు మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ తొలుత ప్రణాళిక రూపొందించారు. సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుకు అప్పగిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే వర్షాలు కురుస్తుండటం, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సోలాపూర్ సభను వచ్చే నెలకు వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు.
సాంగ్లి, కొల్హాపూర్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో సోలాపూర్‌తో పాటు పుణేలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 15 జిల్లాలు, 27 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌కు క్షేత్ర స్థాయి వరకు నిర్మాణం జరిగినట్లు సమాచారం. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షల మంది క్రియాశీల సభ్యులు (పదాధాకారులు) చేరగా, ఇందులో 6 లక్షల మంది ఆన్‌లైన్‌లో, 9 లక్షల మంది ప్రత్యక్షంగా సభ్యత్వం స్వీకరించారు.
క్షేత్ర స్థాయిలో జనరల్, మహిళ, రైతు, యువత, కార్మిక తదితర విభాగాలకు సంబంధించి తొమ్మిది కమిటీల చొప్పున ఏర్పాటయ్యాయి. త్వరలో క్రియాశీల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎంపీలు, సుమారు డజను మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ గూటికి చేరుకోగా, వందల సంఖ్యలో సర్పంచ్‌లు, పదుల సంఖ్యలో జిల్లా పరిషత్ సభ్యులు పార్టీలో చేరినట్లు స్థానిక నేతలు చెప్తున్నారు.
ఓ సిట్టింగ్ ఎంపీ చేరే అవకాశం?
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అస్థిరతను అనుకూలంగా మలుచుకుని పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్న కేసీఆర్‌తో.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీలో చేరికలపై సంప్రదింపులు జరుపుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ కూడా ఇటీవల కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీల చేరికల కోసం జరుపుతున్న సంప్రదింపుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
CM KCR Maharashtra Visit: ఆగస్టు 1న మహారాష్ట్రకు కేసీఆర్
Published Wed, Jul 19 2023 2:14 AM | Last Updated on Wed, Jul 19 2023 9:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment