
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లనుప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.
సికింద్రాబాద్‌నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు కొత్తగా వందే భారత్ రైలు నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
ఇక ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, రామగుండం, కాజీపే స్టేషన్లలో మాత్రమే ఆగనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నాగ్‌పూర నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్‌పూర్- సికింద్రాబాద్ రైలుతోపాటు నాగ్‌పూర్- పుణె రైలు కూడా సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.
#Secunderabad - #Nagpur VandeBharat Express will be introduced very soon
Tentative launch date: 📅 15th September pic.twitter.com/K43a6Eu1an— TechChaitu (@techchaituu) September 9, 2024
హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్‌పుర (బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్‌పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు.