దేవాదులతో సస్యశ్యామలం | minister harish rao visits devadula project | Sakshi
Sakshi News home page

దేవాదులతో సస్యశ్యామలం

Published Wed, Jan 31 2018 3:45 PM | Last Updated on Wed, Jan 31 2018 3:49 PM

minister harish rao visits devadula project - Sakshi

గోదావరి నీరును పరిశీలిస్తున్న మంత్రి హరీష్‌రావు

ఏటూరునాగారం(ములుగు): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండో పంటకు నీరు అందిస్తామని, దేవాదుల మోటార్లతో 5 టీఎంసీల నీటిని ఎత్తిపోయిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం దేవాదులలోని మూడో దశ మోటార్లలో ఉన్న రెండు మోటార్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు తుపాకులగూడెం బ్యారేజీ వద్ద 72మీటర్ల మేర నీటి సామర్థ్యం ఉండేవిధంగా కాపర్‌డ్యామ్‌ (మట్టికట్ట) నిర్మించి, అందులోని నీటిని దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌కు పంపించామని తెలిపారు. అక్కడ ఉన్న నీటిని మోటార్ల ద్వారా భీంఘన్‌పూర్‌ రిజర్వాయర్‌కు తరలించడంతో అన్ని రిజర్వాయర్లు నిండుతాయని చెప్పారు. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సుమారు 5టీఎంసీల నీటిని తోడుకోవడం జరుగుతుందని వివరించారు. ఇక పాత వరంగల్‌ జిల్లా ప్రజలకు వేసవిలోనూ తాగునీటి సమస్య ఉండదన్నారు. రబీ సీజన్‌లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

బ్యారేజీ పూర్తయితే 365 రోజులు.. 
2019 ఆఖరు వరకు దేవాదుల మూడో దశ పనులను పూర్తి చేయించి, తుపాకులగూడెం గోదావరిపై బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 365 రోజులపాటు 100 టీఎంసీల నీటిని తీసుకోవడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు వివరించారు. రూ.1800కోట్లతో రామప్ప చెరువు నుంచి గణపసముద్రం చెరువుకు పైపులైన్‌ నిర్మించి నీటిని తరలిస్తామని, అలాగే పాకాల చెరువులోకి దేవాదుల నీటిని మళ్లించేందుకు రూ.136 కోట్లు మంజూరు చేశామన్నారు. యాద్రాద్రిలోని గుండాల చెరువు, లక్నవరం చెరువు, నర్సం పేట వద్ద ఉన్న ఎర్రరంగయ్య చెరువులకు కూడా నీటిని తరలించేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. 

పనులు ఇలా చేస్తే ఎలా?
తుపాకులగూడెం బ్యారేజీ వద్ద చేపట్టిన పనులు నిర్లక్ష్యంగా చేస్తే ఎలా? అని ఫిబ్రవరి నెలలో లక్ష క్యూబీక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరగాలని రిత్విక్, ఎస్‌ఈడబ్ల్యూ కాంట్రాక్టర్లను హరీష్‌రావు ఆదేశించారు. పనులు జాప్యమవుతున్నాయని ఇంజినీరింగ్‌ చీఫ్‌ నాగేంద్రరావును ప్రశ్నించారు. పనుల్లో వేగం పెంచకపోతే ఇబ్బంది పడతామని అన్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, సివిల్‌సప్లయ్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇంజినీరింగ్‌ చీఫ్‌ నాగేంద్రరావు, దేవాదుల సీఈ బంగారయ్య, దేవాదుల ఎస్‌ఈ చిట్టిరావు, తుపాకులగూడెం ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఈడబ్ల్యూ ఎండీ.రాజశేఖర్, రిత్విక్‌ ఎండి.సీఎంరాజేష్, మెగా ఇంజినీరింగ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఎన్‌.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా వెంకటాపురం(కె) సీఐ రవీందర్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్‌రావు, ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్, మంగపేట ఎస్సై మహేందర్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య హరీష్‌రావు పర్యటన సాగింది. స్పెషల్, సీఆర్‌పీఎఫ్‌ పోలీసు బలగాలతో పెద్ద సంఖ్యలో మోహరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement