thupakula gudem
-
జూన్‌లో ‘సమ్మక్క సాగర్’ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల గరిష్ట వినియోగమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం) సిద్ధమైంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్ధేశంతో చేపట్టిన ఈ బ్యారేజీని జూన్‌లోనే పూర్తిగా నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నాటికే ఈ పనులు పూర్తి చేయాలని భావించినా, వర దల కారణంగా పనుల్లో ఆటంకం ఏర్పడి ముందుకు సా గలేదు. ఇప్పుడు పనులు ముగియడంతో వచ్చే నెల చివరి వారంలో ఈ బ్యారేజీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వను న్నారు. జూన్ నుంచే నిల్వ చేసిన నీటిని దేవాదుల పంçపుల ద్వారా ఆయకట్టుకు అందించనున్నారు. 6.94 టీఎంసీల నిల్వకు రెడీ.. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చి రీడిజైన్ చేసి నాలుగేళ్ల కిందటే పనులు మొదలుపెట్టారు. 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. గత ఏడాదే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా బ్యారేజీ ప్రాంతం వద్ద 18 లక్షల నుంచి 21 లక్షల క్యూసెక్కుల మేర వరద రావడంతో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో జూన్ నుంచి నవంబర్ వరకు ఆగిన పనులు తిరిగి డిసెంబర్లో ఆరంభమయ్యాయి. అనంతరం కాఫర్ డ్యామ్‌ను తిరిగి నిర్మించి, నీటిని, బురదను పూర్తిగా తొలగించి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం 59 గేట్ల బిగింపు పూర్తయింది. మొత్తంగా ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు మొత్తం ముగిశాయి. జూన్‌లోనే పూర్తిస్థాయిలో నీటి నిల్వకు బ్యారేజీ సిద్ధమయింది. వచ్చింది వాడేద్దాం... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. ఆ సూచనల మేరకు వారం రోజుల కిందటే సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ బ్యారేజీ ప్రాంతంలో పర్యటించారు. మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేసి జూన్ మొదటి వారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నిజానికి బ్యారేజీ వద్ద జూన్ 15 తర్వాత ప్రవాహాలు మొదలవుతాయి. బ్యారేజీ ఎగువన కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన ఉండే ఈ బ్యారేజీకి చేరుతుంది. బ్యారేజీ 83 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నా, 70 నుంచి 71 మీటర్ల లెవల్లోనే 2.90 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. 71 మీటర్ల లెవల్ నుంచి దేవాదుల పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉంటుంది. ఈ నీటితో దేవాదుల పరిధిలోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వినియోగిస్తే పూర్తి ఆయకట్టుకు నీరందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
దేవాదులతో సస్యశ్యామలం
ఏటూరునాగారం(ములుగు): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పంటకు నీరు అందిస్తామని, దేవాదుల మోటార్లతో 5 టీఎంసీల నీటిని ఎత్తిపోయిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం దేవాదులలోని మూడో దశ మోటార్లలో ఉన్న రెండు మోటార్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు తుపాకులగూడెం బ్యారేజీ వద్ద 72మీటర్ల మేర నీటి సామర్థ్యం ఉండేవిధంగా కాపర్‌డ్యామ్ (మట్టికట్ట) నిర్మించి, అందులోని నీటిని దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌కు పంపించామని తెలిపారు. అక్కడ ఉన్న నీటిని మోటార్ల ద్వారా భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు తరలించడంతో అన్ని రిజర్వాయర్లు నిండుతాయని చెప్పారు. దీంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు 5టీఎంసీల నీటిని తోడుకోవడం జరుగుతుందని వివరించారు. ఇక పాత వరంగల్ జిల్లా ప్రజలకు వేసవిలోనూ తాగునీటి సమస్య ఉండదన్నారు. రబీ సీజన్లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బ్యారేజీ పూర్తయితే 365 రోజులు.. 2019 ఆఖరు వరకు దేవాదుల మూడో దశ పనులను పూర్తి చేయించి, తుపాకులగూడెం గోదావరిపై బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 365 రోజులపాటు 100 టీఎంసీల నీటిని తీసుకోవడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు వివరించారు. రూ.1800కోట్లతో రామప్ప చెరువు నుంచి గణపసముద్రం చెరువుకు పైపులైన్ నిర్మించి నీటిని తరలిస్తామని, అలాగే పాకాల చెరువులోకి దేవాదుల నీటిని మళ్లించేందుకు రూ.136 కోట్లు మంజూరు చేశామన్నారు. యాద్రాద్రిలోని గుండాల చెరువు, లక్నవరం చెరువు, నర్సం పేట వద్ద ఉన్న ఎర్రరంగయ్య చెరువులకు కూడా నీటిని తరలించేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. పనులు ఇలా చేస్తే ఎలా? తుపాకులగూడెం బ్యారేజీ వద్ద చేపట్టిన పనులు నిర్లక్ష్యంగా చేస్తే ఎలా? అని ఫిబ్రవరి నెలలో లక్ష క్యూబీక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాలని రిత్విక్, ఎస్ఈడబ్ల్యూ కాంట్రాక్టర్లను హరీష్‌రావు ఆదేశించారు. పనులు జాప్యమవుతున్నాయని ఇంజినీరింగ్ చీఫ్ నాగేంద్రరావును ప్రశ్నించారు. పనుల్లో వేగం పెంచకపోతే ఇబ్బంది పడతామని అన్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, సివిల్‌సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇంజినీరింగ్ చీఫ్ నాగేంద్రరావు, దేవాదుల సీఈ బంగారయ్య, దేవాదుల ఎస్ఈ చిట్టిరావు, తుపాకులగూడెం ఎస్ఈ వెంకటేశ్వర్రావు, ఎస్ఈడబ్ల్యూ ఎండీ.రాజశేఖర్, రిత్విక్ ఎండి.సీఎంరాజేష్, మెగా ఇంజినీరింగ్ వైస్‌ప్రెసిడెంట్ ఎన్.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా వెంకటాపురం(కె) సీఐ రవీందర్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్రావు, ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్, మంగపేట ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య హరీష్‌రావు పర్యటన సాగింది. స్పెషల్, సీఆర్పీఎఫ్ పోలీసు బలగాలతో పెద్ద సంఖ్యలో మోహరించారు. -
తుపాకులగూడెంలో ప్రారంభమైన ఇసుక క్వారీ
ఏటూరునాగారం : మండలంలోని తుపాకులగూడెం ఇసుక క్వారీ ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభమైంది. తుపాకులగూడెం వద్ద గోదావరి నది నుంచి తోడిన సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ ఉంది. దాన్ని విక్రయిస్తేనే సొసైటీ సభ్యులకు లాభాలు వస్తాయని భావించిన టీఎస్ఎండీసీ అధికారులు క్వారీ నుంచి విక్రయాల అనుమతిని ఆన్లైన్లో పొందుపరిచారు. దీంతో సోమవారం నుంచి ఇసుక క్వారీ అమ్మకాలు ప్రారంభమయ్యారు. దీంతో స్థానిక గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏటూరు సొసైటీ క్వారీ మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై ఇసుక క్వారీల ప్రాజెక్టు అధికారి వెంకటరమణను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో క్వారీలో విక్రయాలు ప్రారంభించామన్నారు. గోదావరి నుంచి ఇసుకను తీయకుండా గతంలో నిల్వ చేసిన ఇసుకను విక్రయిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.