జూన్‌లో ‘సమ్మక్క సాగర్‌’ జాతికి అంకితం  | Tupakulagudem Ready To Inaugurate | Sakshi
Sakshi News home page

జూన్‌లో ‘సమ్మక్క సాగర్‌’ జాతికి అంకితం 

Published Sun, May 16 2021 5:07 AM | Last Updated on Sun, May 16 2021 9:03 AM

Tupakulagudem Ready To Inaugurate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ జలాల గరిష్ట వినియోగమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం) సిద్ధమైంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్ధేశంతో చేపట్టిన ఈ బ్యారేజీని జూన్‌లోనే పూర్తిగా నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నాటికే ఈ పనులు పూర్తి చేయాలని భావించినా, వర దల కారణంగా పనుల్లో ఆటంకం ఏర్పడి ముందుకు సా గలేదు. ఇప్పుడు పనులు ముగియడంతో వచ్చే నెల చివరి వారంలో ఈ బ్యారేజీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వను న్నారు. జూన్‌ నుంచే నిల్వ చేసిన నీటిని దేవాదుల పంçపుల ద్వారా ఆయకట్టుకు అందించనున్నారు.  

6.94 టీఎంసీల నిల్వకు రెడీ.. 
గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చి రీడిజైన్‌ చేసి నాలుగేళ్ల కిందటే పనులు మొదలుపెట్టారు. 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది.

గత ఏడాదే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా బ్యారేజీ ప్రాంతం వద్ద 18 లక్షల నుంచి 21 లక్షల క్యూసెక్కుల మేర వరద రావడంతో కాఫర్‌ డ్యామ్‌ కొట్టుకుపోయింది. దీంతో జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ఆగిన పనులు తిరిగి డిసెంబర్‌లో ఆరంభమయ్యాయి. అనంతరం కాఫర్‌ డ్యామ్‌ను తిరిగి నిర్మించి, నీటిని, బురదను పూర్తిగా తొలగించి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం 59 గేట్ల బిగింపు పూర్తయింది. మొత్తంగా ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్‌ పనులు మొత్తం ముగిశాయి. జూన్‌లోనే పూర్తిస్థాయిలో నీటి నిల్వకు బ్యారేజీ సిద్ధమయింది.  

వచ్చింది వాడేద్దాం... 
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లను ఆదేశించారు. ఆ సూచనల మేరకు వారం రోజుల కిందటే సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ బ్యారేజీ ప్రాంతంలో పర్యటించారు. మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేసి జూన్‌ మొదటి వారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నిజానికి బ్యారేజీ వద్ద జూన్‌ 15 తర్వాత ప్రవాహాలు మొదలవుతాయి. బ్యారేజీ ఎగువన కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన ఉండే ఈ బ్యారేజీకి చేరుతుంది. బ్యారేజీ 83 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నా, 70 నుంచి 71 మీటర్ల లెవల్‌లోనే 2.90 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. 71 మీటర్ల లెవల్‌ నుంచి దేవాదుల పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉంటుంది. ఈ నీటితో దేవాదుల పరిధిలోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వినియోగిస్తే పూర్తి ఆయకట్టుకు నీరందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement