సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కొనసాగుతున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. గురువారం ఉదయానికి 37వేల క్యూసెక్కులు (3.36 టీఎంసీలు)గా నమోదైన ప్రవాహం సాయంత్రానికి 1.93లక్షల క్యూసెక్కులకు (17.54 టీఎంసీలు) పెరిగింది. 24 గంటల వ్యవధిలో ప్రాజెక్లులోకి ఏకంగా 12 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. వచ్చి చేరుతున్న వరదతో ప్రాజెక్టులో నిల్వ 215 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. గోదావరిలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది.
శ్రీశైలానికి జలకళ
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఏకంగా 1.60లక్షల క్యూసెక్కుల (14.54 టీఎంసీలు) ప్రవాహం వస్తుండటంతో అక్కడి నుంచి 2.13లక్షల క్యూసెక్కుల (19.36 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా నారాయణపూర్‌కు చేరుతుండగా, అక్కడి నుంచి 1.94లక్షల క్యూసెక్కుల (17.63 టీఎంసీలు) నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు 1.85లక్షల క్యూసెక్కుల (16.81టీఎంసీలు) మేర ప్రవాహం వస్తోంది. దీంతో జూరాల నుంచి 24 గేట్ల ద్వారా 1,57,185 క్యూసెక్కులు (14.28 టీఎంసీలు), విద్యుదుత్పత్తి ద్వారా 26,238 క్యూసెక్కులు (2.38 టీఎంసీలు) నదిలో వదులుతున్నారు.
ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ 315 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాల్వలకు 1,900 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి దిగువసు వస్తున్న నీరంతా శ్రీశైలానికి చేరుతోంది. గురువారం సాయంత్రం శ్రీశైలానికి 1.93లక్షల క్యూసెక్కుల (17.54టీఎంసీలు) ప్రవాహం వస్తోంది. బుధవారం ఉదయం కేవలం 804 అడుగుల మట్టంలో 31టీఎంసీల మేర నీటి నిల్వలుండగా, అది ఒక్క రోజులోనే 822 అడుగులకు పెరిగి నిల్వ 43 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులో 12 టీఎంసీల కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 158 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 115 టీఎంసీల మేర తక్కువగా నిల్వ ఉంది. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటం, ఈ వరద మరో పది రోజుల పాటు కొనసాగినా ప్రాజెక్టులో నీటినిల్వలు భారీగా పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment