
ప్రాజెక్టులకు ‘భూ’తాపం!
- సాగునీటి ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూమి 1.94 లక్షల ఎకరాలు
- అందులో జీవో 123 ప్రకారం సేకరించేందుకు నిర్ణయించిన భూమి 90,881 ఎకరాలు
- జీవో 123 కింద ఇప్పటివరకు సేకరించింది 20 వేల ఎకరాలు
- జీవోపై పలుచోట్ల నిర్వాసితుల నుంచి వ్యతిరేకత
- 2013 చట్టం అమలుకు డిమాండ్
-
మెరుగైన పరిహారం, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వ యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద గుదిబండగా మారుతోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటిలోనూ భూసేకరణ ముందుకు కదలకపోవడంతో నిర్మాణ పనులకు బ్రేక్‌లు పడుతున్నాయి. దీంతో సాగు లక్ష్యాలపై సందిగ్ధత నెలకొంటోంది. రాష్ట్రంలో భూసేకరణ జరగాల్సిన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా ఇందులో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకు మాత్రమే భూసేకరణ పూర్తి చేయగలిగారు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి మరో 1.94 లక్షల ఎకరాల సేకరణ పెండింగ్‌లోనే ఉంది. ఈ దృష్ట్యా ప్రధాన ప్రాజెక్టుల భూ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపేలా ప్రభుత్వం జీవో 123ని తెరపైకి తేగా దానిని నిర్వాసితులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకు కదలడం ఎలా అన్న దానిపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
1.94 లక్షల ఎకరాలు అవసరం..
రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు కలగలిపి దాదాపు 3,94,725.18 ఎకరాల మేర భూమి కావాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. గతంలో వేసిన అంచనాలమేరకు 3.25 లక్షల ఎకరాల వరకు అవసరం ఉండగా కొత్తగా చేరిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల కారణంగా అది మరో 40 నుంచి 50వేల ఎకరాలకు పెరిగింది. మొత్తం కావాల్సిన భూమిలో ఇప్పటి వరకు 1,99,257.83 ఎకరాలు సేకరించారు. మరో 1,94,629.45 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో 90,881 ఎకరాలను జీవో 123 ప్రకారం సేకరించాలని నిర్ణయించిన సర్కారు ఆ మేరకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ జీవో కింద సుమారు 20వేల ఎకరాలను సేకరించింది. ఈ ఏడాది మరో 70 వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జీవో 123 ప్రకారం భూసేకరణకు పలు గ్రామాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, కొత్త చట్టాలకు అనుగుణంగా చెల్లింపులు జరపాలన్న డిమాండ్, శాఖల మధ్య సమన్వయ లేమి వల్ల సేకరణ నత్తనడకన సాగుతోంది.
ఎకరాకు రూ.5.5 లక్షలు...
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల్లో జీవో 123 ప్రకారం ఏటా రెండు పంటలు పండే భూములకు ఎకరాకు రూ.5.5 లక్షలు, ఒక పంట పండే భూమికి ఎకరాకు రూ.4.5 లక్షలు, బీడు భూములకు రూ.3.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించి ఆ విధంగానే కొనుగోలు చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కింద అందరి సమ్మతితో ఆమోదయోగ్య ధర నిర్ణయించి పరిహారం ఇస్తున్నారు.
మల్లన్న సాగర్‌తో చిక్కులు..
అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్ సహా కొన్ని చోట్ల ఈ పరిహారంపై నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వస్తోంది. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు జత కలవడంతో ఇది మరింత తీవ్రం అవుతోంది. వారంతా 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాలని డిమాండ్ చేయడం ప్రభుత్వానికి నిద్రపట్టనీయడం లేదు. ఈ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే గ్రామసభల ఆమోదం తీసుకోవడం, మార్కెట్ విలువపై మూడు రెట్ల ధర కట్టడం, ప్రభావితం అయ్యే కుటుంబాలకు రూ.5 లక్షల వరకు పరిహారం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఏకమొత్తంగా పరిహారం ఇవ్వాల్సి రావడం పెద్ద ప్రక్రియగా మారుతోంది. దీన్నంతా కొలిక్కి తెచ్చేందుకు సుమారు 6 నుంచి 8 నెలలు పట్టనుండటం ప్రభుతాన్ని కలవరపెడుతోంది. భూసేకరణ ఆలస్యమైన పక్షంలో నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడం ఎలా అన్నదానిపై ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో తొలి ప్రాధాన్యం సహా.. మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రయోజనాలను జీవో రూపంలో వెలువరించే అవకాశం ఉంది.