
'దేవినేని ఉమా పెద్ద దద్దమ్మ'
విజయవాడ: కృష్ణా డెల్టాను ఎడారిగా చేసే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమైయ్యారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల వల్ల 150 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ తరలించుకుపోతుందని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న చంద్రబాబు నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. కేంద్రం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర చంద్రబాబు గంగిరెద్దులా మారారని ఎద్దేవా చేశారు. ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్రం, కృష్ణా బోర్డు వద్ద ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
ఓటుకు కోట్లు కేసుతో కేసీఆర్ చంద్రబాబును తరిమికొట్టారని అన్నారు. అందుకే ఈ ప్రాజెక్టులపై చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెద్ద దద్దమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్లు పెట్టి సొళ్లు కబుర్లు చెబుతారు కానీ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై మాత్రం స్పందించడంటూ విమర్శించారు. ఈ ప్రాజెక్టులను వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని జోగి రమేష్ స్పష్టం చేశారు.