చంద్రబాబు ఇంటి వద్ద నాటి నిరసనకు నేడు కక్ష సాధింపు
చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేసి విక్రయించిన జోగి కుటుంబం
అయినా సరే అక్రమ కేసు నమోదు చేసిన టీడీపీ ప్రభుత్వం
ఇబ్రహీంపట్నం జోగి నివాసంలో వేకువజాము నుంచే ఏసీబీ తనిఖీలు
జోగి తనయుడిని అరెస్టుచేసి, గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలింపు
తన కుమారుణ్ణి అన్యాయంగా అరెస్టు చేశారన్న జోగి
కన్నీటిపర్యంతమైన జోగి సతీమణి
అక్రమ కేసులపై పోరాడతామన్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు తెరతీసింది. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసి, దానిని విక్రయించిన వ్యవహారంలో అక్రమ కేసు నమోదు చేసింది. పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేసిన ఓ భూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తోపాటు, చిన్నాన్న వెంకటేశ్వరరావును నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతేకాక.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలతో పేరుతో హల్‌చల్ చేశారు.
అనంతరం.. జోగి రాజీవ్‌ను ఎలాంటి నోటీసులివ్వకుండానే అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగి సతీమణి శకుంతల.. మా బిడ్డ ఏం పాపం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం.. ఏసీబీ కార్యాలయం వద్దకు జోగి రమేష్ చేరుకుని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
నిజానికి.. గతంలో టీడీపీ నేతలు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. ఆ ఉదంతంతో చంద్రబాబు అతనిపై కక్షగట్టి ఇప్పుడు వేధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
ఇక జోగి రమేష్ తనయుని అరెస్టు వార్త తెలియగానే వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని నాని, వెలంపల్లి, దేవినేని అవినాష్, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ ఆరెస్టులపై పోరాడతామని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులన్నీంటిని ఎదుర్కొంటామని చెప్పారు.
తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు
ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. ఇందులో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగాదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్ విజయకుమార్, విజయవాడ రూరల్ తహశీల్దారు, నున్న సబ్‌రిజి్రస్టార్ ఉన్నారు. సీఐడీ కేసు విచారణలో ఉండగానే ఏసీబీ హడావిడిగా కేసు నమోదు చేయడం గమనార్హం.
ఇక ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దేదీప్యను విచారించారు. మరోవైపు.. గతంలో చంద్రబాబు ఇంటివద్ద నిరసన చేపట్టిన కేసులో జోగి రమే‹Ùకు మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే..
అక్రమ కేసులపై పోరాటం చేస్తాం
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారని, అక్రమంగా అరెస్టులు చేస్తారన్నారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్ చేశారన్నారు. చంద్రబాబును నిలదీయకుండా వదలమన్నారు. జోగి రమేష్‌కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు.. కొనుక్కున్న వారు లేరు.. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా? అని ప్రశ్నించారు.
ఈ తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారని నాని చెప్పారు. జోగి రమేష్ సతీమణి మాట్లాడుతూ.. అప్పటి సీఎం జగన్‌గారిని ఉద్దేశించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడడంవల్లే తన భర్త నిరసన తెలపడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లారని.. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు.
ఇక రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీసీ అయిన జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీమంత్రి వెలంపల్లి అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. తాము పరామర్శకు రావొద్దా అని మాజీమంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అలాగే, జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. అందుకే జగన్ ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ చెప్పారు.
14 రోజులపాటు రిమాండ్
ఇదిలా ఉంటే.. జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి హిమబిందు ఎదుట హాజరుపర్చగా ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. నిందితుని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.
మా నాన్నపై కక్ష తీర్చుకునేందుకే..
నా తండ్రిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అక్రమ కేసులు పెట్టారు. ఈనాడులో ప్రకటన చూసే కొన్నాం.. అలాగే, ప్రకటన ఇచ్చే అమ్మాం. ఈ వ్యవహారాన్ని లీగల్‌గానే కోర్టులోనే తేల్చుకుంటాం. – జోగి రాజీవ్, జోగి రమేష్ తనయుడు
నాపై కక్షతో నా కొడుకుపై కేసు..
మా అబ్బాయి మీద కేసు నమోదు చేయడం దుర్మార్గం. చంద్రబాబూ.. నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అటాచ్ అయిన అగ్రిగోల్డ్ భూములు ఎవరైనా కొంటారా? కావాలనే కక్షతోనే నా కొడుకుని అరెస్టుచేశారు. ఇది బలహీనవర్గాలపైన, గౌడ కులస్తుపైన దాడిగా నేను భావిస్తున్నా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పుచేసినట్లు రుజువుచేస్తే ఆత్మహత్య చేసుకుంటాం. – జోగి రమేష్, మాజీమంత్రి
ఇద్దరిని అరెస్టు చేశాం
విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అవ్వా శేషనారాయణకు చెందిన అగ్రిగోల్డ్ భూమి కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùలను అరెస్ట్‌చేశాం. ఇందులో ఐదుగురు నిందితులను గుర్తించాం. తదుపరి విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టుచేస్తాం. – సౌమ్యలత, ఏసీబీ అడిషనల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment