Union minister Mahesh sharma
-
బాలికా సాధికారతను సాధించాలి
హైదరాబాద్: దేశంలో బాలికా సాధికారతను సాధించాల్సిన అవసరముందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 21కె, 10కె, 5కె రన్‌ను ఆయన ప్రారంభించారు. అమ్మ అనే పదానికి ఎంతో విలువ ఉందని.. అందుకే భారత్ మాతా అని పిలుస్తామని అన్నారు. దేశంలో పురుషులు, మహిళల నిష్పత్తిలో తేడా ఉందని, అయితే ఈ పరిస్థితి తెలంగాణలో కొంత మెరుగ్గా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో 2 వేలకు పైగా మురికివాడలు ఉన్నాయని, బాలికలను దత్తతకు తీసుకొని చదివించాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’లో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, కిశోర్ వికాస్ విద్యార్థులు నగరంలోని 104 కిశోర్ వికాస్ కేంద్రాల్లో 2,500 మంది బాలికలు ఉన్నారని సేవా భారతి సచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి రఘునాథన్ వీరబెల్లి తెలిపారు. ఐటీ కంపెనీలు సీఎస్ఆర్లో భాగంగా సహాయం అందించేందుకు రన్ పేరిట అవగాహన కల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, సుమారు 7 వేల మంది ఐటీ ఉద్యోగులు, కిశోర్ వికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయం: మంత్రి ఈటల ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ముగింపు కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రన్లో పాల్గొన్న కిశోర్ వికాస్ బాలికలకు షూ, పుస్తకాలు అందిస్తామని అన్నారు. అనంతరం 21కె, 10కె, 5కె రన్ విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. -
సీత జన్మస్థలంపై పార్లమెంట్లో రగడ
- ఆధారాల్లేవు.. ఇది విశ్వాసాలకు సంబంధించిన అంశం - కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ప్రకటన.. రాజ్యసభలో రగడ న్యూఢిల్లీ: సీత జన్మించిన ప్రాంతం మన విశ్వాసాలకు సంబంధించిన విషయమని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ రాజ్యసభలో పేర్కొనడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి చారిత్రక ఆధారాలు లేవని ప్రతిపక్షం పేర్కొంది. అయితే శర్మ తన సమాధానాన్ని సమర్థించుకున్నారు. సీత జన్మించిన ప్రాంతంపై సందేహాలు అక్కర్లేదని, ఆమె మిథిలలో జన్మించినట్లు వాల్మీకి రామాయణంలో ఉందని తెలిపారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా బిహార్‌లోని సీతామర్హి ప్రాంత(సీత జన్మించినదిగా భావిస్తున్న చోటు) అభివృద్ధి గురించి వివరాలు కోరిన సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సీతామర్హి జిల్లాలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని కాబట్టి ఆ ప్రాంతంలో సీత జన్మించిందని అనడానికి చారిత్రక ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీతారాముల స్వయంవరానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని వ్యగ్యంగా ప్రశ్నించారు. రాముడికి చెడ్డపేరు తేవొద్దు: తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయుధాలు ప్రదర్శిండం పట్ల తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలతో రాముడికి అపకీర్తి తేవొద్దని కేంద్రాన్ని కోరింది. రామనవమి లాంటి పవిత్ర దినాన శాంతి, ప్రేమను ప్రచారం చేయడానికి బదులు ఆయుధాలు పట్టేలా యువతను ప్రోత్సహించడం తాలిబన్ సంస్కృతిని పోలినట్లు ఉందని పేర్కొంది. -
'నమో' కంటే మంచి బ్రాండా? నో చాన్స్!
అయోధ్య: ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. 'ఈ ఎన్నికల్లో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోదు'అని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ(నమో) బ్రాండ్ తోనే ఎన్నికల్లో తలపడతామని పేర్కొన్నారు. 'కులసమీకరణాల చిక్కుముడులకు కొదువలేని యూపీలో ఏదో ఒక కులానికి చెందిన అభ్యర్థిని ప్రకటించి, మిగతా వారిని అసంతృప్తికి గురిచేసేకంటే సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాం' అని యూపీ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తోన్న అభివృద్ధి పనులను వివరించి ఓట్లు అడుగుతామని, గెలిచిన తర్వాత అందరిలోకి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా పార్టీనే నిర్ణయిస్తుందని కటియార్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం కిందటే షీలా దీక్షిత్ ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఎస్సీకి మాయవతి ఎలాగూ ఉన్నారు. ఇక అధికార సమాజ్ వాది పార్టీ సీఎం అభ్యర్థి ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. బీజేపీ నమో బ్రాండ్ తోపాటు రామబాణాన్ని సైతం సంధించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో 'రామాయణ మ్యూజియం' నిర్మించతలపెట్టింది. మ్యూజియం ప్రతిపాదిత ప్రాంతాన్ని మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అయోధ్యలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకే మ్యూజియం నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ నిర్ణయానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లాగే అయోధ్యలోనూ కొత్త పర్యాటక ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమికి 15 కిలో మీటర్ల దూరంలో 25 ఎకరాల స్థలంలో నిర్మించనున్న 'రామాయణం మ్యూజియం'లో వాల్మికి రామాయణానికి సంబంధించిన అనేక రూపాలను పొందుపర్చనున్నారు. -
‘గోమాంస’ హత్యపై రాజకీయ దుమారం
దాద్రి/లక్నో: గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లో బిషాదా గ్రామంలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టిచంపిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆరోపణల నుంచి బయటపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇది ముందస్తు ప్రణాళికతోనే చేసిన హత్య అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రతి చిన్నవిషయానికి ట్వీట్లు చేసే ప్రధాని మోదీ.. దీనిపై స్పందించడం లేదేమని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటనకు మతంరంగు పులమవద్దని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అన్నారు. శుక్రవారం ఆయన ఇఖ్లాక్ కుటుంబాన్ని పరామర్శించారు. సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇక ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇఖ్లాక్ కుమారుడు డానిష్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాగా, అసదుద్దీన్ ఒవైసీ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మహమ్మద్ ఇఖ్లాక్ మతమే అతని మృతికి కారణమని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని ఆయన ఆరోపించారు.