'నమో' కంటే మంచి బ్రాండా? నో చాన్స్!
అయోధ్య: ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. 'ఈ ఎన్నికల్లో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోదు'అని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ(నమో) బ్రాండ్ తోనే ఎన్నికల్లో తలపడతామని పేర్కొన్నారు.
'కులసమీకరణాల చిక్కుముడులకు కొదువలేని యూపీలో ఏదో ఒక కులానికి చెందిన అభ్యర్థిని ప్రకటించి, మిగతా వారిని అసంతృప్తికి గురిచేసేకంటే సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాం' అని యూపీ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తోన్న అభివృద్ధి పనులను వివరించి ఓట్లు అడుగుతామని, గెలిచిన తర్వాత అందరిలోకి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా పార్టీనే నిర్ణయిస్తుందని కటియార్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం కిందటే షీలా దీక్షిత్ ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఎస్సీకి మాయవతి ఎలాగూ ఉన్నారు. ఇక అధికార సమాజ్ వాది పార్టీ సీఎం అభ్యర్థి ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది.
బీజేపీ నమో బ్రాండ్ తోపాటు రామబాణాన్ని సైతం సంధించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో 'రామాయణ మ్యూజియం' నిర్మించతలపెట్టింది. మ్యూజియం ప్రతిపాదిత ప్రాంతాన్ని మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అయోధ్యలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకే మ్యూజియం నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ నిర్ణయానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లాగే అయోధ్యలోనూ కొత్త పర్యాటక ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమికి 15 కిలో మీటర్ల దూరంలో 25 ఎకరాల స్థలంలో నిర్మించనున్న 'రామాయణం మ్యూజియం'లో వాల్మికి రామాయణానికి సంబంధించిన అనేక రూపాలను పొందుపర్చనున్నారు.