దిశ చూపే ‘పశ్చిమం’!
కీలకంగా తొలి దశ పోలింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నిర్ణయాత్మకమైనది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 సీట్లకు శనివారం జరిగే తొలి విడత పోలింగ్ సరళి ప్రభావం మిగిలిన దశల పోలింగ్‌పై ఉంటుందని రాజకీయపక్షాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న పశ్చిమ యూపీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రాష్ట్రంలో ముస్లింల జనాభా 18 శాతం ఉండగా, ఇక్కడ అది 26 శాతం. మాజీ ప్రధాని చరణ్‌సింగ్, ఆయన కొడుకు ఆరెల్డీ నేత అజిత్‌సింగ్ వంటి నేతల జాట్ సామాజికవర్గం ఉన్నదీ ఇక్కడే. రైతుల విషయంలో పాలకపక్షం విధానాలు ఇక్కడి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
నరేంద్ర మోదీ గాలి వీచిన 2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం పది లోక్‌సభ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రాంతీయపక్షాలు ఎస్పీ, బీఎస్పీలకు 24 సీట్ల చొప్పున దక్కగా, బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకుంది. జాట్ల ఓట్లే పునాదిగా ఉన్న ఆరెల్డీకి 9, కాంగ్రెస్‌కు 5 సీట్లు లభించాయి.
గతంలో ఎస్పీకి లాభం.. 2012లోనూ యూపీ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. ఆ దశలో ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి పడ్డాయంటూ జరిగిన ప్రచారం మిగతా విడతల పోలింగ్‌పై కనిపించిందని విశ్లేషకులు నిర్ధారించారు. ఎస్పీ మిగిలిన దశల్లో మరింత బాగా పుంజుకుని రికార్డు స్థాయిలో 224 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఓటు ప్రభావం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది కీలకాంశంగా మారింది. నవంబర్, డిసెంబర్‌లో ఎస్పీ యాదవ పరివారంలో జరిగిన కీచులాటలు చివరికి సుఖాంతమవడంతో ఈ పార్టీకి జనాదరణ పెరుగుతోందని వార్తలొస్తున్నాయి. ‘అఖిలేశ్ మంచివాడేగాని, చివరి రెండేళ్లలోనే బాగా పనిచేశాడు’అ ని ఈ ప్రాంతంలో కొందరంటున్నారు.
తగ్గిన బీజేపీ హవా..: ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి అంత జనాదరణ కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్‌తో తొలిసారి చేతులు కలిపిన ఎస్పీ, ఒంటరిగా బరిలో ఉన్న బీఎస్పీ బలాన్ని వారు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. బీసీల్లో ప్రధాన వర్గమైన యాదవుల జనాభా పశ్చిమ యూపీలో నామమాత్రం కావడంతో ఎస్పీకి విజయావకాశాలు తక్కువ. బీఎస్పీకి పునాదివర్గమైన దళితుల్లోని చమార్లు(జాటవ్‌లు) ఈ ప్రాంతంలో ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం దళితుల్లో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. ఈ పార్టీ చీఫ్ మాయావతి తల్లిదండ్రులు ఇక్కడి ఘజియాబాద్ జిల్లాకు చెందినవారు.
2013లో జరిగిన ముజఫర్‌నగర్ మతఘర్షణల వల్ల పార్లమెంటు ఎన్నికల్లో జాట్లతోపాటు మెజారిటీ హిందూ ఓటర్లు కమలానికి ఓటేశారు. జాట్లకు బీసీ హోదా దక్కకపోవడం, రైతు సమస్యలు తీరకపోవడంతో గ్రామీణులు బీజేపీకి దూరమయ్యారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్