అఖిలేశ్‌ ‘పని’కి పరీక్ష! | Opposition disturbed after SP-Congress alliance: Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌ ‘పని’కి పరీక్ష!

Published Sun, Feb 19 2017 2:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అఖిలేశ్‌ ‘పని’కి పరీక్ష! - Sakshi

అఖిలేశ్‌ ‘పని’కి పరీక్ష!

నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ఈ మూడోదశ ఎన్నికలు చాలా కీలకం. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పుకుంటున్న సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. ‘పనే మాట్లాడుతుంది’ (కామ్‌ బోల్తాహై) అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అఖిలేశ్‌ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది రాజధాని లక్నోలోనే. ఆదివారం ఎన్నికలు జరగనున్న మూడోదశలో లక్నో కూడా ఉంది.

బీజేపీ కంచుకోట బద్దలు
అడ్వాణీ రామజన్మభూమి ఉద్యమ ప్రభావం కారణంగా.. గత ఎన్నికల వరకు లక్నో బీజేపీకి కంచుకోట. 1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన తర్వాత యూపీలో ఎవరు అధికారంలో ఉన్నా లక్నోలో బీజేపీ హవా నడిచింది. దీనికి తోడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి లక్నో ఎంపీ కావటంతో పరిస్థితి పూర్తిగా కమలానికి అనుకూలంగా ఉండేది. కానీ 2012లో సమాజ్‌వాదీ పార్టీ.. కమలం కంచుకోటను బద్దలుకొట్టి ఇక్కడున్న 9 సీట్లలో ఏడింటిని గెలుచుకుంది.

అయితే లక్నోను అభివృద్ధి బాట పట్టించిన అఖిలేశ్‌.. ఈ ఎన్నికల్లోనూ తన సీట్లను కాపాడుకోగలిగితే తను చెబుతున్న ‘పనే మాట్లాడుతుంది’ అనే నినాదం విజయవంతమైనట్లే. లక్నోలో మెట్రోరైలు ప్రారంభం అఖిలేశ్‌ డైనమిజానికి నిదర్శనం. హైదరాబాద్, కొచ్చిల్లో ఏళ్ల తరబడి మెట్రోరైలు నిర్మాణం కొన‘సాగు’తుంటే.. వేగంగా 8.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసిన ఘనత అఖిలేశ్‌దే. ట్రయల్‌ రన్  నడుస్తున్న ఈ స్ట్రెచ్‌లో మార్చిలో మెట్రో పరుగు ప్రారంభం కానుంది. లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే అఖిలేశ్‌ సాధించిన మరో విజయం. గోమతి తీరం, జ్ఞానేశ్వర్‌ మిశ్రా పార్క్‌ అభివృద్ధి కూడా ఎస్పీ ప్రచారంలో కీలకంగా మారాయి.

బడీ దీదీ వర్సెస్‌ ఛోటీ బహు
లక్నో కంటోన్మెంట్‌ ప్రాంతంలో బీజేపీ తరపున రీటా బహుగుణ జోషి , ములాయం చిన్నకోడలు అపర్ణ యాదవ్‌ (ఎస్పీ) మధ్య పోటీ ఆసక్తి కరంగా మారింది. యాదవ కుటుంబంలో వివాదం తర్వాత అంతా సర్దుకుందని చెప్పుకునేందుకు అఖిలేశ్‌.. అపర్ణకు సీటిచ్చారు. దీంతో లక్నో కంటోన్మెంట్‌లో పోటీ బడీ దీదీ (రీటా బహుగుణ) వర్సెస్‌ ఛోటీ బహు (అపర్ణ)గా మారింది.

మరోవైపు, లక్నోలోని సరోజినీ నగర్‌ స్థానం నుంచి ములాయం మేనల్లుడు అనురాగ్‌ యాదవ్‌పై కామన్ వెల్త్‌ మెడలిస్ట్‌ స్వాతి సింగ్‌ బీజేపీ (రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు) తరçఫున పోటీ చేస్తున్నారు. లక్నోలోని వివిధ నియోజకవర్గాలనుంచి ముగ్గురు ఎస్పీ మంత్రులు సహా పలువురు మహామహులు బరిలో ఉన్నారు. అయితే లక్నోకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఎస్పీని గెలిపిస్తే.. రెండోసారి సీఎంగా మరింత ముందుకు తీసుకెళ్తానని అఖిలేశ్‌ ప్రచారంలో ప్రజలను కోరుతున్నారు.

మోదీకి దీటైన జవాబులు
2014లో బీజేపీ యూపీలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి వేరుగాఉంది. మోదీ విమర్శలకు రాహుల్, అఖిలేశ్, డింపుల్‌ యాదవ్‌ కూడా తమదైన శైలిలో దీటైన సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు, 2014 ఎన్నికలకు ఇప్పటికీ ప్రముఖమైన తేడా ఎన్నికల నిపుణుడు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే). ‘కామ్‌ బోల్తాహై’ అని అఖిలేశ్‌ అన్నా.. ‘మన్ కీ బాత్‌ కాదు కామ్‌ కీ బాత్‌’ అని డింపుల్‌ నినదించినా అది ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహంలో భాగమే. అటు ప్రియాంక గాంధీ కూడా మోదీ విమర్శలను చాలా వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు. తను దత్తపుత్రుడినని మోదీ చెప్పిన మరుక్షణమే.. ‘రాహుల్, అఖిలేశ్‌ వంటి సొంత పుత్రులుండగా.. దత్తపుత్రుల పని యూపీకి లేదు’ అని దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.

- యూపీ నుంచి కె.రామచంద్రమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement