
ఇల్లందకుంట (హుజూరాబాద్): సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మార్పులు చేస్తూ.. కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అప్పగిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో కేటాయించిన రూ.642 కోట్లు కాదని రూ.1,912 కోట్లు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
సాగునీటి రంగంలో 2014 తర్వాత కొత్తగా వచ్చిన మార్పులేమీ లేదన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రానికి కాకుండా కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ సమావేశానికి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను కాదని తన కుమారుడు కేటీఆర్‌ను పంపడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.