
సామాన్యుడికే కష్టకాలం
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌సలో మంత్రి ఈటల
- నగదు మార్పిడి పరిమితిని రూ.10 వేలకు పెంచండి
- వారానికి రూ.2 లక్షల విత్‌డ్రాయల్‌కు అనుమతించండి
- బ్యాంకర్లకు ఆర్థిక మంత్రి ఈటల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనమున్న వాళ్ల కంటే సామాన్యులే ఎక్కువ బాధలు పడుతున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, నోట్ల మార్పిడికి కేంద్రం విధించిన ఆంక్షల ప్రభావంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్‌స ఈటల నిర్వహించారు. బ్యాంకుల ఇన్‌చార్జిలతో పాటు ఆర్‌బీఐ ఇన్‌చార్జిలు, లీడ్ బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, నోట్లు మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనే ప్రధానంగా చర్చించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లను ఈటల కోరారు. ‘‘నోట్లు ప్రజల దైనందిన జీవితాలతో సంబంధం ఉన్న అంశం. బ్యాంకింగ్ కార్యక లాపాలతో వారికి సంబంధాలు తక్కువగా ఉంటారుు. అందుకే ఆటోలు, టాక్సీలు, వ్యాన్లలో ప్రయాణాలకు, చిన్న షాపుల్లో కొనుగోళ్లకు పాత నోట్లను అనుమతించే అంశాన్ని బ్యాంకర్లు పరిశీలించాలి.
అడ్డాల మీద పని చేసే కార్మికుల జీవన భృతికి ఇబ్బందులు రాకుండా వేతన చెల్లింపులు జరిగేలా చూడాలి. పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోండి. సోషల్ మీడియాలో పుకార్ల నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించేలా ప్రచారం నిర్వహిం చండి. జిల్లాల్లో కరెన్సీ కొరత లేకుండా చిన్న నోట్లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చేలా చూడండి’’ అని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సరిపడేన్ని కొత్త నోట్లు, చిన్న నోట్లు సిద్ధం చేసుకున్నాకే కేంద్రం ఈ కసరత్తు చేస్తే సమస్య వచ్చేది కాదని కాన్ఫరెన్‌స అనంతరం మీడియాతో అభిప్రాయపడ్డారు. ‘‘నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట క్యూ లైన్లలో నిలబడి ప్రజలు ఉపాధి కోల్పోయారు. అన్ని వ్యాపారాలూ నష్టం చవిచూశారుు. పాత నోట్లు చెల్లక, కొత్తగా విడుదల చేసిన రూ.2,000 నోటుకు చిల్లర దొరక్క జనం నానా కష్టాలు పడుతున్నారు.
పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో పాత నోట్లు చెల్లుతాయని చెప్పినా అక్కడా చిల్లర తిరిగివ్వక పోవడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. నగదు మార్పిడి పరిమితిని రూ.4500 నుంచి రూ.10 వేలకు పెంచాలి. ఖాతాదారులు తమ ఖాతా నుంచి (వారానికి) రూ.24 వేలకు బదులు రూ.2 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి’’ అని డిమాండ్ చేశారు. ఖాతాల్లో రూ.2.5 లక్షలకు మించి నగదు జమ చేసుకోవద్దనేలా ఉన్న నిబంధన ప్రజలను మరింత భయభ్రాంతులను చేస్తోందన్నారు. ‘‘పిల్లల పెళ్లిళ్లకు, పై చదువులకు, శుభకార్యాలకు జీవితాంతం కష్టపడి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా కూడబెట్టిన రైతులు, కూలీలు, సామాన్యులున్నారు. అదంతా నల్లధనం కాదు. దీన్ని గుర్తించి కేంద్రం కొన్ని సడలింపులు చేయాలి. తన నిర్ణయాలను సమీక్షించుకోవాలి. తెలం గాణలోని గ్రామీణ బ్యాంకులకు సైతం నగదు మార్పిడి, సంబంధిత లావాదేవీలకు అవకాశం కల్పించాలి. బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడే వారికి కనీస సదుపాయాలు కల్పించాలి. సరిపడేన్ని కొత్త కౌంటర్లు ఏర్పాటు చేయాలి. పనివేళలను పెంచాలి’’ అని బ్యాంకర్లను మంత్రి కోరారు.
సహకార బ్యాంకులకు అనుమతివ్వాలి: సీఎస్ రాజీవ్‌శర్మ
నోట్ల రద్దు పరిణామాలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌సలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన్నారు. ‘‘రాష్ట్రంలో ఖరీఫ్ కొనుగోళ్లు మొదలయ్యారుు. కానీ సహకార బ్యాంకులకు కేవలం రూ.36 కోట్లివ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 12 లక్షల మంది రైతు ఖాతాదారులున్నారు. రబీ పెట్టుబడులకు నోట్ల కొరత లేకుండా చూడండి’’ అని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కోరారు. సహకార బ్యాంకులలో పాతనోట్లు జమ చేసుకునేందుకు అనుమతించాలన్నారు.‘‘గ్రామాల్లో పోస్టాఫీసుల పనితీరును సమీక్షించండి. ఉపాధి కార్మికులకు వేతనాలందేలా చూడండి’’ అని కోరారు. జిల్లాల్లో నగదు కొరత లేకుండా బ్యాంకు అధికారులు పర్యవేక్షించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోరారు. కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని నవీన్ మిట్టల్ కోరారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఆర్‌బీఐ జీఎం
కరెన్సీ కొరత తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఆర్‌బీఐ జీఎం మేఘనాథ్ చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన పని లేదన్నారు. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది వారిని చైతన్యపరచాలన్నారు. మహిళలు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం అందించాలని ఎస్‌బీఐ సీజీఎం హరిదయాళ్ సూచించారు. ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ-పాస్ మిషన్లు, ఈ-వాలెట్లు, రూపే కార్డులు వాడాలని కోరారు.