
రాష్ట్ర ఆదాయం రూ.47 వేల కోట్లు
ఆరు నెలల్లో రెవెన్యూ రాబడిలో గణనీయ వృద్ధి: ఈటల
- సేల్స్ ట్యాక్స్, వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల
- ఇప్పటివరకు బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది రాష్ట్ర ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆరు నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ. 47 వేల కోట్ల మేర ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడి, లోటు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలపై విపక్ష నేత కె.జానారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఈటల సమాధాన మిచ్చారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినా రాష్ట్ర ఆదాయం తగ్గదని, మున్ముందూ మరింత గొప్పగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఆదాయం వ్యాట్ రూపేణ 22 శాతం పెరిగిందని, వాహనాల పన్ను 35 శాతం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై 56 శాతం కలిపి మొత్తంగా గతేడాదికన్నా 13 శాతం వృద్ధి ఉందని వివరించారు.
భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే 44 శాతం తక్కువగా ఉందన్నారు. నోట్ల రద్దుతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నా దాన్ని కేంద్రం ఆర్థిక సాయం రూపంలో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. 2014–15లో రాష్ట్రంలో మిగులు రూ. 369 కోట్లు మేర ఉండగా, 2015–16లో ఆడిటర్ జనరల్ నివేదికల ప్రకారం రూ. 3,121 కోట్ల మిగులు ఉందన్నారు. ప్రస్తుత ఏడాది మిగులు ఎలా ఉండనుంది జీఎస్టీ శ్లాబ్‌లపై స్పష్టత వచ్చాక మార్చి అనంతరం తెలుస్తుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రణాళికేతర వ్యయం రూ. 28,858.33 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ. 22,756.77 కోట్లుగా ఉందని, మొత్తంగా బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లని వెల్లడించారు. మార్చి నాటికి బడ్జెట్ వ్యయం రూ. లక్ష కోట్లు దాటుతుం దన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ. 17వేల కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉం డగా ఇప్పటికే మూడు విడతల మాఫీ పూర్తయిందన్నారు.
ఎంఐఎం, కాంగ్రెస్ వాకౌట్
విద్యార్థుల ఫీజు బకాయిలపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదంటూ ఎంఐఎం... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల బడ్జెట్ విడుదలపై స్పష్టత లేదంటూ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు: జానా
ఇదే అంశంపై సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్ర బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లుగా ఉంది. కానీ ఇప్పటివరకు ఆరు నెలల ఆదాయం 47 వేల కోట్లని అంటున్నారు. మరో ఆరో నెలల్లో మరో రూ.47 వేల కోట్లు వచ్చినా బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు. ఇదే విషయాన్ని గతంలోనే చెప్పా. అదే ఇప్పుడు నిజమవుతోంది. ఇక పెద్దనోట్ల రద్దుతో ఆదాయం 20 వేల కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రే చెబుతున్నారంటే దీనికి అదనంగా మరో రూ. 10 వేల కోట్లు కచ్చితంగా తగ్గుదల ఉంటుంది. ఎలా చూసినా లక్ష కోట్ల బడ్జెట్ దాటడం కష్టం. ఈ ఏడాది బడ్జెట్ ఖర్చు మొదలు పెట్టనే లేదు’ అని పేర్కొన్నారు.
ముమ్మాటికీ లోటు రాష్ట్రమే: అక్బరుద్దీన్
‘రాష్ట్రంలో 2014–15లో మిగులు కనబడుతున్నా, 2015–16లో 4 వేల కోట్ల మేర లోటు ఉంది. ప్రస్తుత ఏడాదిలోనూ ఖర్చు రూ. 51 వేల కోట్ల మేర ఉండగా ఆదాయం 47 వేల కోట్లే ఉంది. అలాం టప్పుడు మిగులు రాష్ట్రం ఎలా అవుతుంది. 10.93 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మెయింటెనెన్స్ చార్జీలు, రీయిం బర్స్‌మెంట్ ఫీజులు చెల్లించలేదు. షాదీ ముబారక్ కింద కేవలం 30 కోట్లే విడుదలయ్యాయి. మరి మిగులు రాష్ట్రం అని ఎలా అంటారు’ అని ప్రశ్నించారు