వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేరుస్తాం
మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారని, అందుకను గుణంగా అధికారంలోకి రాగానే డాక్టర్ చెల్లప్ప కమిషన్ వేశారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మేధాశక్తికి కులంతో పనిలేదని నిరూపించిన యుగపురుషుడు మహర్షి వాల్మీకి అని, అంతటి మహనీయుని జయంతిని రాష్ట్ర స్థారుు ఉత్సవంగా నిర్వహించుకోవడం వాల్మీకి బోయవర్గాల అభివృద్ధి, సంక్షేమంపట్ల సీఎం కేసీఆర్‌కు గల నిబద్ధతను తెలియజేస్తుందని తెలి పారు. ఆదివారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల సారథ్యంలో మహర్షి వాల్మీకి జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా కృషి చేస్తామని, చెల్లప్ప కమిషన్ రిపోర్టు కూడా వచ్చిందని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వాల్మీకి బోయలకి ఫెడరేషన్ ద్వారా అభివృద్ధి, ఎస్టీల్లో చేర్చే ప్రక్రియ, రాజకీయాల్లో ప్రాధాన్యం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజనరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ జీడీ అరుణ, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు తదితరులు పాల్గొన్నారు.