![Enforcement Directorate Questions Ahmed Patel Over Money Laundering - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/28/ahmed-pat.jpg.webp?itok=hstQqWCG)
న్యూఢిల్లీ: సందేశార సోదరుల మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్(70)ను సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఢిల్లీలోని అహ్మద్ పటేల్ ఇంట్లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలంటూ అహ్మద్ పటేల్‌కు ఇటీవలే రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విచారణకు రాలేనని తేల్చిచెప్పారు. దీంతో ఈడీ బృందం నేరుగా అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్లింది. వడోదరకు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు నితిన్ సందేశార, చేతన్ సందేశార, దీప్తి సందేశర బ్యాంకు నుంచి రూ.14,500 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. వారంతా పరారయ్యారు. ఈ వ్యవహారంతో అహ్మద్ పటేల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ ఆయనను ప్రశ్నించింది. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. 30న మరోసారి ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment