అన్‌బిలీఫ్‌బుల్!
కళ
రెండు సంవత్సరాల క్రితం మాంచెస్టర్‌లోని ఒక తోటలో భార్య ఎల్‌హమ్‌తో కలిసి విహారానికి వెళ్లాడు ఒమిద్ అసాది. ఉన్నట్టుండి గాలి వీచడం మొదలైంది. గాలికి ఆ తోటలో పెద్ద పెద్ద ఆకులు నేలరాలుతున్నాయి. వాటిని చూస్తే ఆసాదికి భలే ముచ్చటేసింది. వాటిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. పుస్తకాలలో దాచాడు. ఇక ఆ విషయం మరిచేపోయాడు.
కొన్ని రోజుల తరువాత పేపర్‌తో తయారుచేసిన కళాకృతుల ప్రదర్శనకు వెళ్లినప్పుడు తాను దాచుకున్న పత్రాలు ఆసాదికి గుర్తుకువచ్చాయి. వాటిని కాన్వాస్‌గా చేసుకొని రకరకాల బొమ్మలు వేయాలనే ఆలోచన వచ్చింది. ఒక సూదితో రోజూ రెండు నుంచి మూడు గంటల వరకు ఈ పత్రాల మీద చిత్రాలను లిఖించడానికి ప్రయత్నించేవాడు. మొత్తానికైతే కొన్నిరోజుల తరువాత అసాది ప్రయత్నం గాడిలో పడింది. జంతువులు, పక్షులు, మనుషులు... కోరు కున్న చిత్రమల్లా పత్రంపై ప్రత్యక్షమయ్యేది.
ఈ పత్రాలపై చెట్టు జిగురు తప్ప రసాయనాలేవీ వాడేవారు కాదు. ‘‘పత్రాల మీద చిత్రాలను చెక్కుతున్నప్పుడల్లా నా బాల్యం గుర్తుకు వస్తుంది’’ అంటున్నాడు అసాది. ఇరాన్‌కు చెందిన అసాది భార్యతో కలిసి మాంచెస్టర్‌లో స్థిరపడ్డాడు. తాను అభిమానించే వ్యక్తుల పోట్రయిట్‌లను పత్రాల మీద చెక్కి వారికి కానుకగా ఇస్తుంటాడు. ‘‘ఎంత టైమ్ తీసుకున్నామనే దానికంటే ఎంత అందంగా వచ్చింది అనేది ముఖ్యం’’ అంటాడు అసాది.
ఇటీవల మొదటిసారిగా తన కళాకృతులను ప్రదర్శనకు పెడితే అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘చెట్టు మీది నుంచి యాపిల్ పడితేనే కాదు... ఆకు పడినా కొత్త ఆలోచనలు వస్తాయి’’ అని తరచుగా అంటుంటాడు సరదాగా అసాది.
పచ్చనాకు సాక్షిగా నిజమే కదా మరి!