గార్డెన్‌లో కలుపు మొక్కలు తీస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా(ఇన్‌సెట్) గోంగూర
కంకిపాడు: అదొక అంగన్‌వాడీ కేంద్రం. అద్దె భవనంలో నడుస్తోంది. అయినా అక్కడ ఉన్న పెరడును సద్వినియోగం చేసుకుని నూట్రీ గార్డెన్‌ను ముచ్చటగా తీర్చిదిద్దారు. అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలను స్థానికంగానే సమకూర్చుకుంటున్నారు. న్యూటీ గార్డెన్ నిర్వహణతో మిగతా అంగన్‌వాడీ కేంద్రాలకూ ఆదర్శంగా నిలుస్తోంది కంకిపాడులోని ఐదో నంబరు అంగన్‌వాడీ కేంద్రం.
స్థలం చిన్నదే..
ఈ అంగన్‌వాడీ కేంద్రం పట్టణంలోని రజక రామాలయం సమీపంలో నడుస్తోంది. ఈ కేంద్రానికి టీచరుగా వై.నళినీకుమారి, ఆయాగా బి.రజని విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రానికి ఎదురుగా సుమారు అర సెంటు స్థలం ఉంది. ఈ స్థలంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని అంగన్‌వాడీ సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా విజయవాడ నుంచి కూరగాయల విత్తనాలను కొనుగోలు చేశారు. ఉన్న కొద్ది స్థలంలోనే బెండ, వంగ, మిర్చి, గోరుచిక్కుడు, వీటితో పాటు ఆకుకూరల విత్తనాలు చల్లారు.
పోషకాలతో కూడిన ఆహారం
కొద్ది రోజులుగా ఈ గార్డెన్‌లో పండిన ఆకుకూరలు, ఇతర కూరగాయలనే అంగన్‌వాడీ కేంద్రంలో కూరలు సిద్ధం చేసేందుకు వినియోగిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి రోజూ వంటలో ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు, చిక్కుడు వినియోగిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి పెరడును శుభ్రం చేస్తూ అంగన్‌వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను సమకూర్చుకుంటున్నారు.
అన్ని అంగన్‌వాడీకేంద్రాల్లోనూ గార్డెన్‌లు
అన్ని అంగన్‌వాడీ కేంద్రాల వద్ద న్యూట్రీ గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రంలో నిర్వహణ చాలా బావుంది. ప్రతి ఒక్కరూ గార్డెన్‌ల నిర్వహణపై శ్రద్ధ వహించి చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు బాధ్యతగా పనిచేయాలి.– జి.ఉమాదేవి, సీడీపీవో,కంకిపాడు
Comments
Please login to add a commentAdd a comment