శ్రీమతికి పచ్చల హారం! | husbend gifted to he's wife green house | Sakshi
Sakshi News home page

శ్రీమతికి పచ్చల హారం!

Published Sun, Jul 3 2016 2:42 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

శ్రీమతికి పచ్చల హారం! - Sakshi

శ్రీమతికి పచ్చల హారం!

కాంక్రీట్  నగరంలో పచ్చని పొదరిల్లు
ప్రకృతిపై ప్రేమతో వినూత్న గృహానికి రూపం
ఇంటిని వనంలా తీర్చిదిద్దిన వైనం...

తాము ఎంతగానో ఇష్టపడేవారిపై తమ ప్రేమను వ్యక్తపరచవలసిన సందర్భం వచ్చిన ప్రతిసారి చరిత్రలో ఒక గొప్ప కళాఖండమో, నిర్మాణమో రూపుదిద్దుకున్నాయి. తరాలు గడిచినా వారి ప్రేమను చరిత్రలో అజరామరంగా నిలుపుతున్నాయి. లియోనార్డో మోనాలిసా పెయిటింగ్ నుంచి షాజహాన్ తాజ్‌మహల్ వరకు ఇలా రూపుదిద్దుకున్నవే. వారి ప్రేమతో జీవకళను సంతరించుకున్న కళాఖండాలు భవిష్యత్   తరాలకు తమ వసివాడని ప్రేమ విలువను చాటిచెపుతున్నాయి. ఆ కోవకే చెందిన ఈ కాలపు ఓ భర్తగారి ‘ఆకుపచ్చని’ ప్రేమగాథ ఇది. శ్రీమతి కోరిందే తడవుగా ఓ అందమైన ఆకుపచ్చని పొదరిల్లును తీర్చిదిద్ది ఆమెకు కానుకగా ఇచ్చిన ఆ భర్త పర్యావరణ ప్రేమికుడు..అంతకు మించి అందరికీ ఆదర్శనీయుడు. ఆ వివరాలు నేటి సండే స్పెషల్‌లో మీకోసం....

సాక్షి, సిటీబ్యూరో: భార్యపై ప్రేమను మాటల్లో కాక చేతల్లో చూపాలనుకునే భర్త ఆయన. భార్య భర్తల మధ్య అన్యోనత ఉండాలే గాని పూరిల్లయినా మేడతోనే సమానం అని నమ్మే భార్య ఆవిడ. చిలకా గోరింకల్లాంటి ఆ దంపతులు విహార యాత్ర కోసం ఓసారి కుటుంబ సభ్యులతో కలసి కేరళకు వెళ్లారు. రిసార్ట్‌లో పచ్చని ప్రకృతి నడుమ చెక్కతో నిర్మించిన కుటీరంలో విడిది చేశారు. ప్రకృతి శోభతో అలరారే కుటీరం అందం శ్రీమతి మది దోచింది. భర్తతో మనకు హైదరాబాద్‌లో ఇలాంటి ఇల్లుంటే ఎంత బాగుంటుందో కదా అంది. అప్పటికి భర్త గారి మౌన మే సమాధానమైంది. ఇంటికి తిరిగొచ్చాక ఏడాది పాటు కష్టపడి కేరళ సంప్రదాయ శైలిలో ఫ్లైవుడ్‌తో ఇంటిని నిర్మించారు ఆ భర్త.

దాంతోపాటు చుట్టూ అందమైన ఇంటి పంటల క్షేత్రాన్ని సృష్టించి తన గృహలక్ష్మికి బహుమతిగా సమర్పించారు. హైదరాబాద్, ఎల్బీనగర్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన ఆ అన్యోన్య దంపతులు చింగిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, లక్ష్మి. శ్రీధర్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీలో రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మి గృహిణి.  ఆరు సెంట్ల స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మిస్తే అద్దెల ద్వారా లభించే ఆదాయాన్ని ఆయన దీని కోసం వదులుకోవటం విశేషం. రెండేళ్లపాటు శ్రమించి వంద గజాల స్థలంలో చెక్క ఇంటిని నిర్మించారు శ్రీధర్‌రెడ్డి. ఇంటి బయట వసారా. చుట్టూ పండ్ల మొక్కలు. కింద తివాచి పరచినట్టు కాళ్లను మెత్తగా తాకే పచ్చిక. ఉదయాన్నే తమ కిలకిలరావాలతో నిద్రలేపే పక్షులు.

ఒక్క రోజు అక్కడ గడిపిన వారికి ఉషోదయం వారి జీవిత పుస్తకంలో ప్రత్యేక పుటగా నిలుస్తుంది. వివిధ రకాల కాయగూర, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. దీనికోసం తొలుత ఇంటి ఆవరణలో 10 ట్రక్కుల ఎర్రమట్టిని తోలించారు. దొండ, సొర వంటి తీగజాతి మొక్కలు వంగ , మిర్చి, క్యాబేజీ వంటి కాయగూర పంటలు, దానిమ్మ, చిన్న ఉసిరి, అడవి ఉసిరి, ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పాషన్ ఫ్రూట్, ఎర్రజామ, అరటి, అంజూర, గంగరేగి, మామిడి వంటి పండ్ల మొక్కలు...బ్రహ్మకమలం, అడవి సంపెంగ వంటి పూల మొక్కలను పెంచుతున్నారు.

ఏడాది వయసున్న ఆపిల్ చెట్టు కూడా ఉందిక్కడ. ముగ్గురు సభ్యులు గల తమ కుంటుంబానికి వారంలో మూడు రోజులకు సరిపడా కూరగాయలను పండించుకుంటున్నారు. శ్రీధర్‌రెడ్డి రోజూ మూడు గంటల పాటు రెండేళ్లు శ్రమించి ఈ హరితవనానికి జీవం పోశారు. ఇప్పటికీ వాటికి ఎరువులు వేయటం, కలుపు తీయటం వంటి పనుల కోసం ప్రతిరోజూ ఉదయం రెండు గంటల సమయం కేటాయిస్తారు.

ఇంటికి వచ్చిన బంధువులు మా అభిరుచిని మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు అపార్ట్‌మెంట్లో కన్నా ఈ ఇంటిలో ఉండేందుకే వారు ఇష్టపడుతుండటం సంతోషం కలిగిస్తోంది.  - శ్రీధర్‌రెడ్డి  (97011 11754)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement