మెక్సికో దేశపు రాజధాని మెక్సికో నగరం. కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్. అధిక జనసాంద్రత. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 2.3 కోట్లు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన నగరం. వలస పాలనకు ముందు ఇది అజ్టెక్ సామ్రాజ్యపు రాజధాని. నగరం చుట్టూతా లోతు తక్కువ మంచినీటి సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నాయి. వీటి మధ్యలో మానవ నిర్మిత ద్వీపాలలో అనాదిగా సంప్రదాయ వ్యవసాయం జరుగుతోంది. ఈ వ్యవసాయక ద్వీప క్షేత్రాలను ‘చినాంపాస్’ అని పిలుస్తారు. వీటిని 2014లో మెక్సికో మెట్రోపాలిటన్ నగర పరిధిలోకి చేర్చారు. నగరం మొత్తం భూభాగంలో సుమారు 27.7%లో వ్యవసాయం విస్తరించింది. ఇందులో 99% విస్తీర్ణం చినాంపాస్‌లే ఆక్రమిస్తాయి. 5.10 లక్షల టన్నుల ఆహారోత్పత్తులను రైతులు పండిస్తున్నారు.
నగరం లోపల జనావాసాల మధ్య ఇంటిపంటలు, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్ హౌస్‌లు, హైడ్రోపోనిక్ వ్యవస్థలు, మిద్దె తోటలు, నిలువు తోట(వర్టికల్ గార్డెన్స్)లు సాగవుతున్నాయి. వీటిలో నగరవాసులు 24.7 టన్నుల కూరగాయలు, పండ్లను ఏటా ఉత్పత్తి చేస్తున్నట్లు గత ఏడాది జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్వాటెమాలా స్కూల్ ఆఫ్ సోషల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు ఉమ్మడిగా గత ఏడాది 75 అర్బన్ గార్డెన్లపై విస్తృత అధ్యయనం చేశారు.
అర్బన్ గార్డెన్లలో పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆహారాన్ని మెరుగుపరచి ఆహార భద్రతను పెంపొందించాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచాయి. కొందరు అర్బన్ రైతులకు ఈ పంటల అమ్మకాలే జీవనాధారంగా మారాయి. ఔషధ, సుగంధ మూలికలు మెక్సికో ప్రజల సంప్రదాయ వైద్యంలో, ఆహార సంస్కృతిలో అంతర్భాగం. ఇప్పటి ఇంటిపంటల్లోనూ వీటికి పెద్ద పీట ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల సాగును వ్యాప్తిలోకి తేవటంలో ఇతర దేశాల్లో మాదిరిగానే మెక్సికో నగరంలో కూడా దశాబ్దాలుగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ కోవలోకి చెందినదే ‘కల్టివా సియుడాడ్’ కూడా. ఈ స్పానిష్ మాటలకు అర్థం ‘సంస్కారవంతమైన నగరం’. పేరుకు తగ్గట్టుగానే ఇది పనిచేస్తోంది. సేంద్రియ ఇంటిపంటలు, సామూహిక ఇంటిపంటల సంస్కృతిని వ్యాపింపజేయడానికి కృషి చేస్తోంది.
ఆకాశ హర్మ్యాల నడుమ 1,650 చదరపు మీటర్ల స్థలంలో కల్టివా సియుడాడ్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ పచ్చగా అలరారుతోంది. పట్టణ వ్యవసాయాన్ని విద్య, ఉత్పత్తి/ఉత్పాదక, చికిత్సా సాధనంగా ఉపయోగించడం దీని లక్ష్యం. సృజనాత్మకత ఉట్టిపడే ఎతైన మడుల్లో ఆకుకూరలు, కూరగాయలతో పాటు 135 జాతుల పండ్లు, ఇతర చెట్లతో ఈ ఆహారపు అడవి నిర్మితమైంది. పండించిన ఉత్తత్తుల్లో.. తోట పనిలో సాయపడిన వాలంటీర్లకు 30% ఇచ్చారు. 28% పొరుగువారికి తక్కువ ధరకే అమ్మారు. 34% రెస్టారెంట్లకు అమ్మారు. పేదలకు ఆహారాన్నందించే కమ్యూనిటీ సూప్ కిచెన్లకు కూడా కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా స్వీయ సహాయక ఉద్యాన తోటల పెంపకం ద్వారా మెక్సికో ‘సంస్కారవంతమైన నగరం’గా రూపుదాల్చింది!
సామాజిక పరివర్తన సాధనం
అర్బన్ అగ్రికల్చర్ ప్రభావశీలమైన సామాజిక పరివర్తన సాధనం. ఆహార సార్వభౌమాధికారం, ఆహార భద్రతల సాధనకు.. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికీ ఇదొక వ్యూహం. 12 ఏళ్లుగా మా కమ్యూనిటీ కిచెన్ గార్డెనింగ్ అనుభవం చెబుతోంది ఇదే. వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి సారవంతమైన మట్టిని ఉత్పత్తి చేయడానికి, పోషకాల సాంద్రత కలిగిన కూరగాయలను పండించడం.. పంటలు, జంతువులు, పక్షుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు అంతస్తులకు అతీతంగా భుజం భుజం కలిపి పనిచేసేందుకు నగరవాసులకు సేంద్రియ ఇంటిపంటలు ఉపయోగపడుతున్నాయి.
– గాబ్రిలా వర్గాస్ రొమెరో, ‘కల్టి సియుడాడ్’ డైరెక్టర్, మెక్సికో నగరం
Comments
Please login to add a commentAdd a comment