తోటరాముళ్లు!
కొత్త ధోరణి
ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా క్లబ్‌ల వైపు పరుగులు తీసి ‘రిలాక్స్ అయ్యాం’ అని చెప్పుకోవడం మగరాయుళ్లకు ఉండే అలవాటు. ఇప్పుడు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలలో ‘క్లబ్’ స్థానాన్ని ‘తోట’ ఆక్రమించింది. ఇదేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! ఎక్కువశాతం మంది పురుషులు రిలాక్స్ కావడం కోసం తోట పనిచేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వారు కూడా తమకున్న కొద్దిపాటి తోటలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తోటపని అనేది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ‘‘కాలంతో పాటు ప్రాధాన్యతలు మారుతాయి. ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం, పార్టీలకు విరివిగా వెళ్లడం అనేది పురుష లక్షణంగా ఉండేది. ఇప్పుడు మాత్రం వంట, తోట పని ఆ స్థానాన్ని భర్తి చేశాయి’’ అంటున్నాడు బ్రిటన్‌కు చెందిన టామ్‌లిన్ అనే మానసిక విశ్లేషకుడు.
‘ఉన్నట్టుండి పురుషపుంగవులకు తోట మీద ప్రేమ పెరగడానికి కారణం ఏమిటి?’ అనేదానికి కొందరు చెప్పేదేమిటంటే బ్రిటన్‌లోని ఒక ఛానల్‌లో ప్రసారమయ్యే ‘లవ్ యువర్ గార్డెన్’ అనే కార్యక్రమం. ‘‘గార్డెనింగ్‌తో పాటు వంట, క్రాఫ్ట్...మొదలైనవి పాపులర్ కల్చర్‌లో భాగం అవుతున్నాయి’’ అంటున్నాడు ‘లవ్ యువర్ గార్డెన్’ ప్రెజెంటర్ ఫ్రాన్సిస్ టాప్‌హిల్. రోజుకో రకమైన సాంకేతిక సాధనాలు వెల్లువెత్తుతున్నా ఈ సాంకేతిక యుగంలో పాత అలవాట్లు మళ్లీ రావడం ఆహ్వానించదగినదే అంటున్నాడు ఫ్రాన్సిస్.