
మనవరాలు ఇనారాతో ప్రభ
మనవలు, మనవరాండ్రకు నానమ్మలు ఎన్నో విలువైన బహుమతులు అందిస్తుంటారు. ఆట వస్తువులు, బొమ్మలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసి వారికి అందిస్తుంటారు. వారి మోములో ఆనందాన్ని నింపుతుంటారు. కానీ ఇక్కడ ఓ నానమ్మ విభిన్న ప్రత్యేకతను చాటుకున్నారు. ఏకంగా తన మనవరాలి కోసం మిద్దె తోటనే పెంచుతున్నారు. తన సంతానం ఎలాగూ వ్యవసాయ క్షేత్రాలు, మొక్కల మధ్య జీవితాన్ని గడపకపోవడాన్ని గమనించిన ఆమె తన ముద్దుల మనవరాలి కోసం ముద్దుముద్దుగా మిద్దె తోట పెంపకానికి ఉద్యుక్తులయ్యారు.
బంజారాహిల్స్:బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 13లోని శ్రీ సాయినగర్‌లో నివసిస్తున్న ప్రభా పొనుగోటి ఇంటి మిద్దెపైకి వెళ్లి చూస్తే అక్కడ ఏపుగా పొరుగుతున్న కూరగాయల మొక్కలతో పాటు బోన్సాయ్ వృక్షాలు, పాతకాలం నాటి కలెక్షన్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇదంతా ఆమె తన మనవరాలి కోసం తయారు చేయడం విశేషం. సాయినగర్‌లో నివసించే ప్రభా పొనుగోటి తల్లిదండ్రులతో పాటు అత్తామామలది వ్యవసాయ నేపథ్య ఉన్న కుటుంబాలు. తండ్రి, మామ ఇద్దరూ రైతులు కావడంతో ఆమెకు తోటలన్నా, వ్యవసాయ క్షేత్రాలన్నా ఇష్టంగా ఉండేది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత పంటలు చూడటం, కూరగాయల మొక్కలు కానరాకపోవడం ఆమెను ఒకింత ఇబ్బందికి గురి చేసింది. తన పిల్లలు ఎలాగూ వీటిని చూడలేదు. కనీసం తన మనవళ్లు, మనవరాళ్లైనా తోటలు చూడాలనే ఉద్దేశంతో తన ఇంటినే తోటగా మార్చేశారు. మనవరాలు ఇనారా కోసం ఆమె టెర్రస్‌పై ఏకంగా పెరటి తోట పెంచుతున్నారు. ఇందులో కూరగాయల మొక్కలతో పాటు తనకిష్టమైన బోన్సాయ్ వృక్షాలను కూడా పెంచుతున్నారు. ఆమె పెంచుతున్న కూరగాయల మొక్కలన్నీ ఆర్గానిక్‌వే కావడం విశేషం. ప్రస్తుతం చిక్కుడు, వంకాయ, బీన్స్, బెండకాయ, టమాట, పచ్చిమిర్చితో పాటు నాలుగు రకాల ఆకు కూరలు కూడా పండిస్తున్నారు.
చూడచక్కని బోన్సాయ్ వృక్షాలు
ప్రభా పొనుగోటి ప్రతిరోజూ మనవరాలు ఇనారాను తీసుకొని ఉదయం మిద్దె తోటలోకి అడుగు పెడతారు. వాటి సాగును పరిశీలిస్తారు. నీరు పోసి కలుపు తీస్తారు. ఇలా గంటపాటు మనవరాలితో కలిసి ఇక్కడే గడుపుతారు. ఇక సాయంత్రం మరో రెండు గంటలు ఈ తోటలోనే గడుపుతారు. ఇదంతా తన మనవరాలి కోసమే చేసినట్లు ఆమె వెల్లడించారు. కొడుకులు, కోడళ్లు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ప్రభ ఒంటరితనం నుంచి దూరం కావడానికి ఈ మిద్దె తోటను వేదికగా మార్చుకున్నారు. ఒక వైపు తోటను పెంచుతూనే ఇంకోవైపు ఇళ్లంతా బోన్సాయ్ వృక్షాలతో నింపేశారు. వాటి ఆలనాపాలనా కూడా చూస్తుంటారు. ఇటీవలే ఈ తోటలోకి కొత్తగా పునాస మామిడి, జామ, లక్ష్మణ్ సీతాఫలం, అవకాడ్ మొక్కలు వచ్చి చేరాయి. వీటిని పెంచేందుకు వర్మీ కంపోస్టు కూడా తయారు చేస్తున్నారు.
మట్టివాసన..ఆస్వాదన
కుటుంబ సభ్యులందరూ పెరటి తోటను ఆస్వాదించేందుకు, మట్టి వాసన చూసేందుకు వీలుగా మిద్దె మొత్తం మొక్కలతో నింపేశారు. మనవరాలి కోసం ఏకంగా మినీ గార్డెన్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఇనారా 14 నెలల చిన్నారి. ఆమె పేరుతో ప్రతినెలకు ఒక మొక్క చొప్పున ఈ గార్డెన్‌లో పెంచుతున్నారు. వీటికి తోడు గ్రామీణ ఇళ్లలోని ఉండే కాగులు, ఇసుర్రాయి కూడా ఆమె కలెక్ట్ చేశారు. మొక్కల కోసం వాడిపారేసిన బకెట్లు, వాష్ బాక్స్‌లు సేకరించి అందులోనే వాటిని పెంచుతున్నారు. టైర్లు, కొబ్బరిపీచు ఇలా పడేసిన వ్యర్థాలన్నీ కూరగాయలు, మొక్కల పెంపకం కోసం వినియోగిస్తున్నారు. ప్రతిరోజూ మూడు, నాలుగు గంటలు ఈ తోటలో గడపడం వల్ల తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, ఇంటిల్లిపాది చక్కని గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని ప్రభ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment