జాడలేని జిల్లేడు.. కానరాని తంగేడు | 80 Percent Drop Off Garden Plants Used For Medicine | Sakshi
Sakshi News home page

జాడలేని జిల్లేడు.. కానరాని తంగేడు

Published Tue, Jan 31 2023 2:32 AM | Last Updated on Tue, Jan 31 2023 2:32 AM

80 Percent Drop Off Garden Plants Used For Medicine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి. నాగజెముడు..తంగేడు..కుంకుడు.. జిల్లేడు..ఉమ్మెత్త.. తిప్పతీగ..మునగ.. కరివేపాకు..వేప.. ఇవి కూడా మనిషికెంతో మేలు చేస్తాయి. ఇప్పుడంటే ఆధునిక వైద్యం అంతటా అందుబాటులోకి వచ్చింది కానీ ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో ఉండే ఇలాంటి మొక్కలు, చెట్లపైనే ఆధారపడి పల్లె ప్రజలు ప్రాణాలు కాపాడుకునేవారు.

ప్రాణం మీదకొచ్చే జబ్బైతే తప్ప ఓ మోస్తరు అనారోగ్యం నుంచి బయటపడేందుకు ఆకు పసర్లే ఉపయోగించేవారు. వాటి మీదే ఆధారపడి జీవించేవారంటే అతిశయోక్తి కాదు. రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు పెరట్లో ఈ తరహా ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లు కన్పించేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా జీవనశైలి మారిపోయింది. సంప్రదాయంగా వైద్యానికి వాడే పెరటి మొక్కల పెంపకం 80 శాతం పడిపోయింది.

ఏ ఇంటి పెరట్లో అయినా ఇలాంటి మొక్క ఒకటి కన్పిస్తే అది నిజంగా వింతే. పెరటి వైద్యం అంటే ఏమిటో కూడా నేటి యువతరానికి తెలియని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నాగజెముడు, తంగేడు, జిల్లేడు, కుంకుడు, ఉమ్మెత్త లాంటివి ఎక్కడో తప్ప కన్పించకుండా పోయాయి. అయితే కోవిడ్‌ తదనంతర కాలంలో మొక్కలపై కాస్త మక్కువ పెరిగింది. కుండీల్లోనైనా ఇతర మొక్కలతో పాటు ఒకటో రెండో ఔషధ మొక్కలు పెంచాలనే ఆరాటం మొదలైంది. ఈ మక్కువ  విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మాయమైన మన పెరటి మొక్కల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.   

‘ఊపిరిపోసే’ నాగజెముడు 
పెరట్లో ముఖ్యంగా పొలా­ల వెంట ముళ్ళ పొదల్లా ఉండే నాగజెముడు ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదు. పల్లె జనం  ఆధునిక వైద్యానికి అలవాటు పడి దీని ప్రాధాన్యతను గుర్తించడం లేదు. నిజానికి ఈ తరానికి ఈ మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాగజెముడు పూలను ఆస్తమా తగ్గించేందుకు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు వాడతారు. 

చర్మ వ్యాధులకు ఉమ్మెత్త 
ఉమ్మెత్త పరిస్థితి కాస్త నయం. ముళ్ళ కాయలతో పెరట్లో కన్పించే దీన్ని ప్రజలింకా పూర్తిగా మరిచిపోలేదు. ఇప్పటికీ అక్కడక్కడా గ్రామాల్లో కన్పిస్తోంది. కానీ ఈ మొక్కను కార్పొరేట్‌ ఆయుర్వేద వైద్యం విస్తృతంగా అభివృద్ధి చేస్తోంది. ఔషధ రూపంలో ప్రతి ఊరూ వెళ్ళిన ఈ మొక్క.. పెరట్లో ఉన్నా పల్లె జనం దీని విలువ తెలుసుకోవడం లేదు. ఉమ్మెత్త ఆకులు, కాయలను చర్మవ్యాధులకు బాగా వాడతారు. దీర్ఘకాల చర్మ వ్యాధులను సైతం తగ్గించే గుణం దీని సొంతం. ఇంత మంచి గుణాలున్న మొక్క మరో ఆరేళ్ళ తర్వాత పల్లెల్లో కన్పించదని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

చక్కెర స్థాయి తగ్గించే తంగేడు 
తంగేడు తాతల కాలం నుంచి తెలిసిన మొక్క. చిన్న చిన్న పసుపు వన్నె పూలు దీని ప్రత్యేకత. బ్రష్‌లు, పేస్టులు లేని రోజుల్లో వేపతో పాటు తంగేడు పుల్లలతో కూడా పళ్లు తోముకునేవారు. మధుమేహం వ్యాధికి దీన్ని మించిన మందులే లేవని పరిశోధనల్లో తేలింది. బతుకమ్మ పండుగొచ్చి తంగేడును కాస్త బతికించింది కానీ.. లేకపోతే ఈ చెట్టూ మనకు కన్పించనంత దూరంగా వెళ్ళేది. ఆయుర్వేద వనమూలికల్లో తంగేడు కీలక పాత్ర పోషిస్తోంది. దీన్ని మళ్ళీ పల్లె దరికి చేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  

షాంపూలు రాకముందు కుంకుడే.. 
కుంకుడు కాయ.. ఇప్పు­డు సూపర్‌ మార్కెట్లో అందమైన ప్యాకెట్‌గా కన్పించే వస్తువైంది. కానీ ఒకప్పుడు ప్రతి ఊళ్ళో విరివిగా ఈ చెట్లు ఉండేవి. షాంపూలు రాకముందు వరకు కుంకుడు రాజసానికి ఏ మాత్రం దెబ్బ తగల్లేదు. కుంకుడు రసం వాడినంత వరకు కేశాల వన్నె తగ్గలేదు. మంచి ఔషధ గుణాలున్న  చెట్టును కార్పొరేట్‌ కంపెనీలు ఆయుర్వేదం పేరుతో అభివృద్ధి చేస్తున్నాయి. పల్లెల్లో ఎవరికీ పట్టని కుంకుడు క్రమంగా పల్లె వాకిటి నుంచి కార్పొరేట్‌ ఫామ్‌లకు వెళ్తోంది. 

పొలాలకు ‘రక్షణ కంచె’ 
మంగళగిరి కంచె.. ఈ మొక్క గురించి చాలామందికి తెలియదు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకు చాలా పల్లెల్లో ఇంటి పెరట్లో, పొలం గట్టుపై కన్పించిన మొక్క ఇది. కార్బన్‌–డై–ఆక్సైడ్‌ను నియంత్రించడంలో దీనికో ప్రత్యేకత ఉంది. పంట పొలాల్లో మొక్కలకు హాని చేసే క్రిమి కీటకాలను అదుపు చేస్తుంది. చిన్న మొక్క వేస్తే చాలు పొలం చుట్టూ రక్షణ కవచంలా అల్లుకుపోయే ఈ మొక్క... ఇనుప కంచెల ఆవిర్భావంతో కనుమరుగైంది. ఈ మొక్కపై విస్తృత పరిశోధనలు జరిగి దీని ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైనా.. మన దగ్గర ఎవరికీ తెలియనంతగా కనుమరుగైపోయింది. ఇతర దేశాల్లో మాత్రం ఈ మొక్క పెంపకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు.  

కాల గర్భంలో ఎన్నో.. 
విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అన్పించే తలనొప్పిని తగ్గించే సొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిబట్టే మారేడు.. సర్వ రోగ నివారిణి తులసి..ఇలాంటివెన్నో మనకు కన్పించకుండా పోతున్నాయి.  

ఇవీ నిజాలు.. 
►వృక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వాటి ఔషధ గుణాలు గుర్తించారు. ఇప్పటికే 1.26 లక్షల మొక్క జాతులను వివిధ రూపాల్లో వాడుకుంటున్నారు. 

►30 ఏళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల మొక్క జాతులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు 80 వేల లోపే ఉన్నాయి. 

►పెరటి వైద్యం 30 ఏళ్ళ క్రితం వరకూ 92 శాతం ఉండేది. ఏదో ఒక మొక్కతో వ్యాధిని నయం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కేవలం 12 శాతమే పెరటి వైద్యాన్ని నమ్ముతున్నారు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఇది 21 శాతానికి పెరిగింది.   

►పల్లెల్లో పెరటి వైద్యంగా వాడిన మొక్కల్లో 20 జాతులు ప్రస్తుతం ఆయుర్వేద ముందుల రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు దాదాపు రూ.2 వేల కోట్లతో వీటిని పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలోని 82 రకాల ఔషధ మొక్కల ను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement