ఇంట్లో నుంచే ఎగిరే విమానం
విమానంలో ప్రయాణించాలంటే విమానాశ్రయాలకు వెళ్లాల్సిన పనిలేదు. కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు ఇంట్లో నుంచే ఎక్కడికైనా ఎగిరిపోవొచ్చు, తిరిగి ల్యాండ్ అవ్వొచ్చు. విమానాలకు ఎంతో ఖర్చుతో కూడిన ఇంధనం అవసరమౌతుంది, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా?..ఇంట్లో మనం సాధారణంగా వాడే కరెంట్ సాకెట్ నుంచే ఛార్జింగ్ చేస్తే చాలు గాల్లో హాయిగా చక్కర్లు కొట్టి రావొచ్చు. నలుగురు జర్మన్ ఇంజనీర్లు కలిసి ఇంట్లో నుంచే గమ్యస్థానాలకు చేరే కొత్త రకం మినీ విమానం 'లిలియం' డిజైన్‌ను చూస్తే 2018 వరకు ఇది సాధ్యమయ్యేదిలానే కనిపిస్తుంది.
రెండు సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త ఆల్ట్రాలైట్ చిన్న విమానం లిలియం. ఇది ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు. లిలియం స్టార్టప్‌ను మునిచ్ యూనివర్సిటీ విద్యార్థులు..డానియల్ వీగాండ్, పాట్రిక్ నాథన్, సెబాస్టియన్ బోర్న్, మాథియాస్ మీనర్లు కలిసి ప్రారంభించారు. యూరోపియన్ స్పెస్ ఏజెన్సీలో(ఈఎస్‌ఏ) బిజినెస్ ఇంక్యుబేటర్‌లో లిలియం ప్రాజెక్టును హోస్ట్ చేశారు. 'వీగాండ్ తమ కాన్‌సెప్ట్‌ను ప్రాక్టికల్‌గా వివరించారు..వాతావరణానికి కలిగే లాభాలను వివరించారు. ఎలక్ట్రిక్ ఇంజిన్‌లను వాడటం వల్ల తక్కువ శబ్ధం ఉద్గారమవ్వడంతో పాటూ వాతావరణానికి ఎలాంటి హానీ జరగదు' అని ఈఎస్ఏ తెలిపింది.
రోజూ వారి అవసరాల కోసం ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తున్నట్టు దీని డిజైనర్లలో ఒకరు డానియల్ వీగాండ్ తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన భారీ ఎయిర్ పోర్టుల అవసరం లేకుండానే ఈ విమానం సునాయాసంగా ఎగిరిపోతుంది. ఇంట్లోనే విమానానికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంకా నిర్మాణదశలోనే ఉన్న ఈ గుడ్డు ఆకారంలో ఉండే లిలియం విమాన అమ్మకాలు 2018 ఏడాది వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని దీని డిజైనర్లు చెబుతున్నారు. గరిష్టంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ విమానం.. గంటకు 400కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు.
'లిలియం ఇంజన్‌లలో ఉపయోగించే టెక్నాలజీతో జెట్ విమానాలు, హెలీకాప్టర్‌లలో వచ్చే శబ్ధాలకన్నా చాలా రెట్లు తక్కువ వస్తుంది. దీనికి ఇంట్లో వాడే సాకెట్తోనే ఛార్జింగ్ చేయోచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయాల్లో మాత్రమే దీంట్లో ప్రయాణించొచ్చు' అని వీగాండ్ తెలిపారు.
లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరికి చెందిన దీన్ని నడపడానికి పైలెట్ లైసెన్స్ ఉండి కేవలం 20 గంటల ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. దీని ధర విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకపోయినా..ఇప్పటికే ఉన్న మినీ విమానాలకంటే తక్కువకే ఇది లభిస్తుందని ఈఎస్ఏ తెలిపింది.