ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరం ఒకే ద్వారం గుండా విమానం ఎక్కే చోటికి చేరుకున్నాం.ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా ఈ పుష్పకవిమానంలో ఎక్కాలంటే మాత్రం రాసి పెట్టి ఉండాలి. కొంతమంది విమానం వరకూ వచ్చినా సరే, వారిని తిరిగి వెనక్కి పంపుతున్నారు ద్వారం దగ్గర ఉన్న విచిత్ర వేషధారులు. పాపం దురదృష్టవంతులు. మామూలువిమానం కంటే ఇది ఏంతో భిన్నంగా ఉంది, బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. పూల మీద కాలు పెట్టామా అన్నట్లున్న మెట్లెక్కి విమానంలోకి చేరుకున్నాము. లోపల ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉండేటట్లు ఉంది మరి! కొంతమందిని ఎందుకు వెనక్కి పంపారో అర్ధం అవటంలేదు. చుట్టూ ఇనుప రేకుల బదులు అద్దాలు బిగించినట్టు బయట పరిసరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అద్దాలు కూడా లేవేమో, బయట నుండి మంచి సువాసనలతో కూడిన గాలి వీస్తూ ఉంది. దాని రెక్కలు ఏవో పక్షి రెక్కల లాగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. మేము మొత్తం ముప్పై ఆరుమందిమి పుష్పక ట్రావెల్స్ వారి విమానంలో యాత్రకు బయలుదేరాము. వాళ్ళలో ఇరవై మంది వరకూ నాకు తెలిసిన వాళ్ళే అవడం కాస్త విచిత్రంగా ఉంది. అందరం కూర్చున్నాము. ఉన్నట్టుండి విమానం సమాంతరంగా కాకుండా నిట్టనిలువుగా గాలిలోకి లేచింది. విమానం ముందుకు వెళ్ళే కొద్ది మేఘాలు కిందకు వెళుతున్నాయి. అయినా కూడా దారంతటా కొత్త మేఘాలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఒక్కో ఆకారంలో ఉన్నాయి.
విమానం అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశించి ఆగింది. అందరు కిందికి దిగి చూడవచ్చని ఒక కంఠం ప్రకటించింది. ఆగొంతు ఎవరిదో? ఎవరూ కనబడలేదు. ఆకాశంలో ఉద్యానవనం ఏమిటా అని అందరం ఆశ్చర్యంగా చూస్తూ విమానం నుండి కిందికి దిగాము. ఆ వనంలో మరలా ఆకాశానంటుతున్నాయా అన్నట్టుగా ఏపైన చెట్లు,రంగురంగుల పూలు, పూల పుప్పొడిని గ్రోలుతున్నఅందమైనసీతాకోకచిలుకలు, పక్షులు, భారీ ఆకారం గల జంతువులూ తిరుగాడుతున్నాయి. మేము తప్ప ఎక్కడా మనుషులు కనిపించలేదు. అద్భుతపరిమళంతోట అంతటా పరుచుకుని ఉంది. అందరూ ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు పరిచయం లేదు. పరిచయం ఉన్న కొద్దిమంది మాత్రం కచ్చితంగా అంత ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. మొదటగా చూసింది ఈ విమానం ఎక్కక ముందు, బస్సులో మేము చేసిన చార్‌ధామ్ యాత్రలో మాకు వంట చేసిపెట్టిన అరవవాడు. నేను ఎన్నో సార్లు వాడితో వంటల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడినా, వాడి పేరు నాకు తెలియదు. లేదు నేనడగలేదు. ముతక లుంగీ, మాసిపోయిన బనీను కట్టుకొని ఉండే వాడు కాస్తా, అందమైన తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. ఎన్నో సార్లు వాడి మీద ఆధారపడి ఉండే కుటుంబం గురించి చెప్పేవాడు. నెలలో సగం రోజులు వారికి దూరంగా ఉంటున్నందుకు బాధపడుతూ ఉండే వాడు. ఇప్పుడు వాడి ముఖంలో అటువంటి ఛాయ లేమీ లేవు. కులాసాగా తిరుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లు చెబుతున్నాడు. నాకేసి చూసి నవ్వాడు. అదే వాణ్ని నవ్వుతూ చూడటం. హటాత్తుగా నాకో అనుమానం వచ్చింది, వాడు ఇక్కడ ఉంటే మాకు వంట చేసే వాళ్ళు ఎవరు? చుట్టూ చూశాను అటువంటి ఏర్పాట్లు ఏమీ చేసినట్టు కనిపించలేదు. గంటకోసారి ఏదో ఒకటి తినే నాకు ఆశ్చర్యంగా అస్సలు ఆకలే అనిపించలేదు. ఎవరికీ ఆ ఆలోచన లేనట్టుంది.
పాన్పు కంటే మెత్తగా ఉన్న గడ్డి మీద లేడి పిల్లలా గెంతుతూ అగుపడ్డాడు మా బస్సుకు క్లీనర్‌గా వచ్చిన అబ్బాయి. ఇంటి నుండి దూరంగా వచ్చానని ఎప్పుడూ ఉలుకూపలుకూ లేకుండా నత్తలాగుండే పద్నాలుగేళ్ళ కుర్రాడు. వాడు అంత ఆనందంగా ఉండటంచూసి నాకు ఆశ్చర్యమేసింది. మరో వైపున ఉన్న జనాలలో నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగా కబుర్లు చెప్తూ కనబడింది ఆమె. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడంతో ఎప్పుడూ కోపంగా, దిగులుగా, అకారణంగా పోట్లాడుతూ ఒంటరిగా ఉండేది. అలాంటి ఆమె ఇలా అందరితో కలిసి ఉల్లాసంగా కబుర్లాడుతూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆనందమే సుమా అసూయ మాత్రం కాదు, నిజంగా. ఒకచోట కొందరు చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. బస్సులో కదలకుండ గంట కూర్చుంటే కాళ్ళు ఉబ్బిపోయి, గట్టిగా నాలుగు అడుగులు వేస్తే ఆయాసపడే అతడు పూనకం వచ్చిన వాడిలా గాల్లో ఎగిరెగిరి చిందులు వేస్తున్నాడు. ఒకప్పుడు తన ఆటపాటలతో జనాలను ఓలలాడించిన అతనికి, అప్పటి జవసత్వాలు తిరిగి వచ్చినట్టున్నాయి. మైమరిచి ఆడుతున్నాడు అతను. విమానంలోకి తిరిగి రమ్మని గొంతు వినిపించేసరికి అందరూ వచ్చి విమానం లోనికి ఎక్కుతున్నారు. నిన్నటి దాకా నేను చూసిన వాళ్ళలా అగుపించలేదు ఎవరూ. కర్మ ఫలాన్ని రోగాల రూపంలో అనుభవిస్తూ, కడుపున పుట్టిన వారి ఆదరణకు నోచుకోక నిరాశా పూరిత వదనాలతో, ఇష్టమైనది తినలేక, కనీసం ఏదో ఒకటి తినడానికి కూడా సహకరించని వణికే శరీరాలతోఉండేవారు కాస్తా ఇప్పుడు ధవళ వర్ణదుస్తులు ధరించి, వెలిగే కండ్లతో, నిటారుగా నిలిచిన శరీరాలతో, అంతులేని ప్రశాంతత గలిగిన వదనాలతో ఉన్నారు. ఇంత మార్పు ఎలా సాధ్యమైందో తెలియలేదు. కనీసం విమానం వాళ్ళు తాగడానికి కూడా ఏమీ ఇవ్వలేదు, దాని వల్ల ఇలా మారాము అనుకోవడానికి. నేను కూడా అలాగే మారానా? నా శరీరంలో కూడా మార్పు తెలుస్తోంది. ఒకసారి నన్ను నేను అద్దంలో చూసుకుందామని అనుకున్నా. విమాన సహాయకులను అద్దం అడుగుదామని చుట్టూ చూశాను. అటువంటి వారు ఎవరూ కనబడలేదు. అసలు విమానాన్ని నడుపుతున్నట్టు కూడా ఎవరూ కనబడలేదు. కంగారు కలిగిందా, లేదు అస్సలు కలగలేదు.
విమానం తిరిగి బయలుదేరి ఎంతో సేపు అయింది. ఇంకా గమ్యం రాలేదు. అయినా చిరాకు కలగలేదు. ఇంత ప్రశాంతత నాలో ఎలా కలిగింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. చుట్టూ చూశాను, అందరూ అలాగే ఉన్నారు. ఎవరూ అలిసిపోయినట్టు, నిద్రపోతున్నట్టు అనిపించలేదు. గమ్యస్థానం చేరుకున్నాము, అందరూ దిగవలసిందిగా కోరుతున్నాం అంటూ మరోసారి ఆ కంఠం వినబడింది.అందరం కిందికి దిగాం. ఇక్కడ ఎటు చూసినా జనమే కనబడుతున్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. దూరంగా కొన్ని కౌంటర్లు, ప్రతి కౌంటర్ ముందు పెద్ద వరుసలో చాలా మంది నిలబడి ఉన్నారు. మేమూ ఆ లైన్లో నిలబడ్డాము. ఆకౌంటర్లలో ఉన్న వ్యక్తులు లైన్లో నిలబడి ఉన్న వాళ్ళను ఏదో అడుగుతూ, లైన్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాక తన దగ్గర ఉన్న కంప్యూటర్ లాంటి దాంట్లో ఏదో రాసుకుంటున్నారు. సమాధానం చెప్తున్న వాళ్ళ ముఖాలు కాసేపు ఆనందంతో, కాసేపు బాధతో రకరకాలుగా మారుతున్నాయి. సమాధానం చెప్పిన తర్వాత పక్కకు వచ్చిన వాళ్ళు రెండు వేరువేరు ద్వారాల గుండా వెళుతున్నారు. కొంతమంది విచిత్ర వేషధారులు వాళ్ళను దగ్గర ఉండి లోపలి తీసుకెళ్తున్నారు. మొదటి ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళు ఆనందంగా వెళుతుంటే, రెండో ద్వారం గుండా వెళ్తున్నవాళ్ళు వడలిన ముఖాలతో వెళుతున్నారు. రెండో ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళలో మళ్ళీకొంతమంది నిర్భయంగా వెళ్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. మా ముప్పై ఆరు మంది వంతు వచ్చింది. మెల్లగా ఒక్కొక్కరు కౌంటర్ దగ్గరకు చేరుకుంటున్నారు.
నా వంతు వచ్చింది. నేను కౌంటర్ లోని వ్యక్తి వైపు చూశాను. అత్యంత గంభీరంగా ఉన్న అతని వదనంలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. అతను నా పేరు అడిగాడు. నేను కథకుడు అని చెప్పాను. అతను కథకుడు జననం 1963, మరణం 2019 అని రాసుకున్నాడు. మరణం, మరణమా, అంటే నేను మరణించానా అని ఆశ్చర్యంగా అడిగాను అతన్ని. అతను నా చేతిని అతని దగ్గర ఉన్న పుస్తకంపై ఉంచాడు.అప్పటివరకు నా జీవితంలో జరిగిన ప్రతి విషయం కండ్ల ముందు మెదలసాగాయి. మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రతి సంఘటన కనపడుతున్నది. ఆయా సంఘటనలు నాకు మిగిల్చిన అనుభూతులకు అనుగుణంగా ముఖంలోని రంగులు మారుతున్నాయేమో. పెదవులు నవ్వుతున్నాయి, బిగుసుకుంటున్నాయి, కండ్ల నుండి నీళ్ళు కారుతున్నాయి. చివరగా నేను బస్సులో నిద్రలో ఉన్నాను, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ చీకట్లో చిన్న వెలుగు దగ్గర బస్సు ఆగింది. బస్సు దిగి వెళ్ళిన డ్రైవర్ కాసేపటికి తూలుతూ వచ్చాడు. ఇంకాసేపటికి బస్సు కూడా తూలడం మొదలుపెట్టింది. దాదాపు ఎదురుగా వస్తున్న వాహనాన్నిఢీ కొట్టబోయి తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ ఊగుతూ చివరికి స్టీరింగ్ మీదకు ఒరిగిపోయాడు. బస్సు అదుపుతప్పింది. వందల అడుగుల లోతున్న లోయలోకి దొర్లింది. అందరం నిద్రలో ఉండగానే చనిపోయాము. ఎలా చనిపోయామో కూడా ఎవరికీ తెలియదు.
చెయ్యి పుస్తకం పైనుండి తీశాను. మరి విమానం దగ్గరి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిన వారు ఎవరు అని అడిగాను. ఓ అదా వాళ్లు చావు అంచుల దాకా వచ్చి, భూమి మీద ఇంకా నూకలు ఉండి తప్పించుకున్నవారు. అంటే వాళ్లు దురదృష్టవంతులు కారు, అదృష్టవంతులు అని గ్రహించాను. అందరితో పాటూ నేను ద్వారాల వైపు నడవసాగాను.కొందరు విచిత్రవేషధారులు వచ్చి ఒక ద్వారం వైపు నన్ను తీసుకుని వెళ్లి అక్కడి వరుసలో నిలబెట్టారు. అదిఏం ద్వారం అని అడిగాను. స్వర్గానికి వెళ్ళే ద్వారం అని చెప్పాడు. అటు వైపుది నరకానికి వెళ్లే ద్వారం అని చెప్పాడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే నేను నిలబడింది స్వర్గ ద్వారానికి ఎదురుగా. నిలబడి అందరి వైపు చూడసాగాను. ఇప్పుడువాళ్ళ మనసులో విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇంతకూ ఆత్మలకు మనసు ఉంటుందా ఏమో తెలియదు. కాని వాళ్ళు అనుకునే విషయాలు కూడా తెలియసాగాయి.మోకాళ్ళనొప్పులతో బాధ పడే కళాకారుడు,బాధ, నొప్పి నుండి విముక్తి లభించిందని ఆనందంగా ఉన్నాడేమో.పెద్దకొడుకు దగ్గర ఒకరు, చిన్న కొడుకు దగ్గర ఒకరు ఉంటూ యాత్రకు కలిసి వచ్చిన ఆ దంపతులు ఇక ఒకరికిఒకరు దూరంగా ఉండక్కర్లేదని భావిస్తున్నారేమో. పిల్లలకు భారం అవలేదని, ఛీత్కారాలు పడక్కర లేదని ఆ పండు ముదుసలి అనుకుంటుందేమో. దేవుణ్ణి దగ్గర నుంచి చూసేంత దరికి చేరానని, కైవల్యం ప్రాప్తించిందని ఆ పంతులు భావిస్తున్నాడేమో.
నరకపు ద్వారం వైపు చూశాను..
అనవసరంగా డబ్బు సంపాదనలో పడి పాపాలు చేసి, కనీసం కడుపుకు కూడు కూడా సరిగా తినలేకపోయానని ఆ వ్యాపారి వగరుస్తున్నాడేమో, నలుగురు మరణించిన ప్రమాదానికి కారణమైన అతను ఫోన్ మాట్లాడుతూ కారు నడపకుండ ఉండాల్సిందని భావిస్తున్నాడేమో, ఇక నుంచి తన సంపాదన గురించి తల్లిదండ్రులు, భార్య వాదులాడుకోనక్కర లేదని ఆ కుర్రాడు సంతోషిస్తున్నాడేమో. అనయాస మరణం లభించిందని ఆ రోగిష్టి వాడు నవ్వులు చిందిస్తున్నాడేమో, నరకప్రాయమైన ఆ జీవితం కంటే ఈ నరకమే మేలేనేమోనని ఆ అతివ స్థిమితంగా ఉందేమో, అంతమంది జీవితాలను నాశనం చేశానని మా బస్సు డ్రైవర్ దుఃఖిస్తున్నాడో. లేక బాధల నుండి అందరికి ముక్తి చేకూర్చానని ఉప్పొంగిన గుండెలతో ఉన్నాడో...అందరూ ఎలా ఉన్నా నాలో ఉన్న కథకుడు మాత్రం నేను చూసిన, చేసిన ఈ మరణాంతర ప్రయాణాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాంక్ష మొదలయింది. ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ కోరిక తీవ్రమైంది. ద్వారం దగ్గరి అద్దాలలో నన్ను చూసుకున్నాను. నా ముఖంలో ఆందోళన ప్రస్పుటంగా కనబడుతోంది. ద్వారం దగ్గర ఉన్న భటుడు నన్ను ఆపాడు. నా ముఖం వైపు చూసి తీవ్రమైన కోరికలతో ఉన్న వాళ్ళు స్వర్గప్రవేశానికి అనర్హులు. కోరికలను తీర్చుకోవడానికి మరొక జన్మ ఎత్తుపో అంటూ తన శూలంతో నన్ను నెట్టి వేశాడు. భూమి మీద మళ్ళీజన్మెత్తాను. నాకు తెలిసిన కథనంతా ప్రపంచమంతా ఎలుగెత్తి చాటుతున్నాను. బతికుండగానే మంచి పనులు చేయండి,మరణిస్తే మీతో పాటూ ఏదీ రాదు అని గొంతు చించుకుని అరుస్తున్నాను. అరిచీ అరిచీ అలిసిపోయి చుట్టూ చూశాను. నన్ను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. తిరిగి మళ్ళీ అరవాలని గొంతెత్తాను. ఛీ ఎదవ కుక్క ఊరికే అరుస్తా ఉంది అంటూ ఎవడో రాయి విసిరాడు. కుయ్ మనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తాను నా నాలుగు కాళ్ళ మీద.
- శ్రీకాంత్ రెడ్డి
పుష్పకయాత్ర
Published Sun, Mar 10 2019 12:54 AM | Last Updated on Sun, Mar 10 2019 12:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment