
సరే, పిల్లలంతా ఆరుబయట చెట్లు నాటారు, మేము అనుకునేదేమంటే, ఇదంతా కూడాను చదువులో భాగమే, వాటి వేర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, అలాగే ఒకదాని గురించి బాధ్యతగా ఉండటం, ఒకదాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. చెట్లు అన్నీ చచ్చిపోయాయి. అవి ఆరెంజ్ చెట్లు. అవి ఎందుకు చనిపోయాయో నాకు తెలీదు, కానీ చనిపోయినై. భూమి మట్టితోనే ఏదైనా సమస్య ఉందో, నర్సరీలోంచి వచ్చినవే మంచివి కాదో. దాని గురించి ఫిర్యాదైతే చేశాం. మొత్తం ముప్పై మంది పిల్లలున్నారు, ప్రతి చిన్నారి ఒక్కో మొక్క నాటాలి, చూస్తే ముప్పై చెట్లూ చనిపోయినై. ఆ ఎండిపోయిన కట్టెలను పిల్లలు చూస్తూవుంటే, డిప్రెసింగ్‌గా ఉండింది.
మరీ అంత బాధేం ఉండేది కాదుగానీ, ఈ చెట్ల వ్యవహారం జరగడానికి కొన్ని వారాల ముందు పాములన్నీ చచ్చిపోయినై. కనీసం అవి చనిపోవడానికి ఓ కారణం అయితే కనబడింది, బాయిలర్ నాలుగు రోజులు ఆగిపోయింది సమ్మె వల్ల. కనీసం ఇదీ అని పిల్లలకు వివరించి చెప్పొచ్చు. అందుకే పరిస్థితులు మామూలైన తర్వాత పాములను చూసినప్పుడు పిల్లలు మరీ కలత చెందలేదు. ఔషధ మొక్కల గార్డెన్ విషయంలో అయితే అది నీళ్లు మరీ ఎక్కువ పెట్టడం అయివుండాలి, కనీసం పిల్లలకు ఇప్పుడు తెలుసు నీళ్లు ఎక్కువ పోయకూడదని. పిల్లలు ఆ గార్డెన్ మీద మరీ ఎక్కువ పట్టింపుతో ఉండి, అందులో ఎవరైనా మేము చూడనప్పుడు కొన్ని నీళ్లు ఎక్కువ పోసివుంటారు. అనుకోగూడదుగానీ ఎవరైనా కావాలని చేసిందా అన్న ఆలోచన కూడా మాకు రాకపోలేదు. అలా ఎందుకు అనుకున్నామంటే, దీనికంటే ముందు ఎడారి ఎలుకలు చనిపోయినై, తెల్ల చిట్టెలుకలు చనిపోయినై, నలికండ్లపాములు చనిపోయినై... సరే, ఇప్పుడు వాళ్లకు తెలుసు వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకుపోవద్దని.
ఉష్ణమండల చేపలు చనిపోతాయని మాత్రం ఊహించాం, అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద సంఖ్యలో, ఉపరితలానికి వచ్చి, మెలి తిరిగి వెల్లకిలా పడిపోయినాయి. ఆ సమయంలోనే మా పాఠ్య ప్రణాళికలో ఉష్ణమండల చేపలు చూపాలని ఉండింది, కానీ మేము ఏమీ చేయలేకపోయాం. మేము కనీసం ఓ కుక్కపిల్లను ఉంచుకునే వీలు లేకపోయింది. అది చిన్న కుక్కపిల్ల, దాన్ని మర్డోక్ చిన్నారి గ్రిస్టెడె ట్రక్కు కింద చూసింది, ఆ డ్రైవరు అప్పుడే డెలివరీ పూర్తిచేసుకున్నాడు, ఆ ట్రక్కు దాని మీద ఎక్కడ ఎక్కేస్తుందేమో అని తెగ భయపడిందట, వెంటనే దాన్ని తన బ్యాగులో పెట్టుకుని స్కూలుకు తెచ్చేసింది. కానీ దాన్ని చూసిన మరుక్షణం, దేవుడా, అది రెండు వారాలకు మించి బతకదేమో అనిపించింది... చివరకు అదే జరిగింది.
నిజానికి అది తరగతి గదిలో ఉండకూడదు కూడా, అట్లా అని పాఠశాల నిబంధనలు ఏవో ఉండినాయి, కానీ పిల్లలతో మీరు కుక్కపిల్లను క్లాసులోకి తేవొద్దని చెప్పలేరు, అది అప్పటికే వచ్చి మీ కళ్లముందు కనబడుతూ, ఈ మూల నుంచి ఆ మూలకు గెంతుతూ కుయ్యికుయ్యిమంటూ ఉన్నప్పుడు. దానికి వాళ్లు ఎడ్గర్ అని పేరు పెట్టారు, నా పేరు మీదుగానే! ఇంక చూడండి, దానితో వాళ్లు చేసే తమాషా, ‘బాగుంది ఎడ్గర్!’, ‘ఇటు చూడు ఎడ్గర్!’ అంటూ ఒకటే అరవడం, ఒకటే నవ్వడం. నేను కూడా సంతోషపడ్డాను, నన్ను ఆటపట్టిస్తుంటే నాకు బానేవుంటుంది. వాళ్లు సామానుల గదిలో దానికో చిన్న ఇల్లు అదీ కూడా కట్టారు. అదెందుకు చనిపోయిందో అంతుపట్టలేదు, కుక్కలకు తగిలే ఏదైనా అంటువ్యాధి అయివుండాలి. బహుశా దానికి టీకాలు వేయించివుండరు. పిల్లలు స్కూలుకు వచ్చేలోపలే దాన్ని తీయించేశాను. ప్రతిరోజు పొద్దుటే నేను ఆ సామాన్ల గదిని చూస్తూ వచ్చాను, ఓ దినచర్యలాగా, ఏం జరిగే ప్రమాదముందో ఒక అంచనావుంది కాబట్టి. దాన్ని కస్టోడియన్‌కు అప్పగించాను.
ఆ తర్వాత ఈ కొరియన్ అనాథ, హెల్ప్ ద చిల్డ్రెన్ కార్యక్రమంలో భాగంగా క్లాస్ తరఫున దత్తత తీసుకున్నాం, ప్రతి చిన్నారీ నెలకో పావలా డాలర్ చొప్పన ఇవ్వాలనేది ఆలోచన. ఆ పిల్లాడి పేరు కిమ్, మేము దత్తత తీసుకోవడమే ఆలస్యమైందో ఏమోగానీ దురదృష్టకరమైన సంగతి. అతడి మరణానికి కారణం ఏమిటో మాకు వచ్చిన ఉత్తరంలో పేర్కొనలేదు, కానీ మేము ఇంకో దత్తతకు వెళ్లమని సలహా అయితే ఇచ్చారు, కొన్ని ఆసక్తికరమైన కేసు హిస్టరీలు కూడా పంపారు, కానీ మాకు అప్పటికే గుండెలు జారివున్నాయి. అందరూ మరీ డీలా పడిపోయారు, నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని అనుకోసాగారు. నాకేమీ ప్రత్యేకంగా స్కూలులో ఏదో దోషం ఉన్నట్టు కనిపించలేదు, నేను మంచి చూసినవాణ్ని, చెడు చూసినవాణ్ని. ఏదో అదృష్టం బాగాలేదంతే. చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయారు, ఆ మాటకొస్తే. రెండు గుండెపోట్లు, రెండు ఆత్మహత్యలు, ఒకరు నీటమునిగి, ఇంకో నలుగురు కారు ప్రమాదంలో. ఒకరికి స్ట్రోక్ వచ్చింది. ప్రతి ఏడాదీ తాతలు, బామ్మల మరణాలు మామూలుగానే ఎక్కువే సంభవిస్తుంటాయి, ఈ సంవత్సరం మరీ ఎక్కువున్నట్టున్నాయి.
చివరకేమో ఈ దారుణం. దారుణం ఎలా జరిగిందంటే– ఈ మాథ్యూ వెయిన్, టోనీ మావ్‌రోగార్డో ఇద్దరూ ప్రభుత్వ కార్యాలయ భవనం కోసం తవ్వుతున్న పునాదుల దగ్గర అడుకుంటున్నారు. అక్కడే పెద్ద పెద్ద దూలాలు కుప్పవేసి వున్నాయి. వాటిని సరిగ్గా పెట్టలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు, దానిమీద కోర్టు కేసు అయితే రానుంది. ఏది సత్యమో ఏది కాదో నాకైతే తెలీదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బాలేదు. ఇంకోటి మరిచిపోయాను, బిల్లీ బ్రాంట్ వాళ్ల నాన్నను ఎవడో ముసుగు తొడుక్కున్న అగంతకుడు కత్తితో దారుణంగా పొడిచాడు, ఇంట్లో జొరబడినప్పుడు వాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు. ఒకరోజు క్లాసులో చర్చ జరిగింది. ఇవన్నీ ఎటు పోయాయని వాళ్లు ప్రశ్నించారు, ఆ చెట్లు, ఆ నలికండ్లపాములు, ఆ ఉష్ణమండల చేపలు, ఎడ్గర్, నాన్నలు, అమ్మలు? మాథ్యూ, టోనీ, వీళ్లు ఎటు పోయారు? నాకు తెలీదు, తెలీదు అని జవాబిచ్చాను. మరి ఎవరికి తెలుసని అడిగారు. ఎవరికీ తెలియదని జవాబిచ్చాను. అప్పుడు వాళ్లు, అంటే ఈ జీవితానికి అర్థాన్ని ఇచ్చేది ఈ మరణమా అని అడిగారు. లేదు, లేదు, జీవితానికి అర్థం కల్పించేది జీవితం మాత్రమే అని చెప్పాను. తర్వాత వాళ్లు ఏమన్నారంటే, కానీ ఈ చావు అనేది లౌకిక ప్రపంచంలో రోజువారీ భరించి తీరవలసిన రొష్టును అధిగమించే దిశలో మనని కొనిపోయే మూలసూత్రంగా పరిగణిస్తారు కదా––
అవును, కావొచ్చు, అన్నాను. మాకు నచ్చలేదు, అన్నారు వాళ్లు. ఊమ్ బాగుంది, అన్నాను. ఎంత సిగ్గుమాలిన విషయం, అన్నారు. ఒప్పుకున్నాను. అయితే మీరు ఇప్పుడు హెలెన్(మా టీచింగ్ అసిస్టెంట్)ను మా ముందు ప్రేమించండి, ఎలా చేయాలో మేము చూస్తాం. మాకు తెలుసు మీకు హెలెన్ అంటే ఇష్టమని అన్నారు వాళ్లు. నాకు హెలెన్ అంటే ఇష్టమే, కానీ అలా చేయలేనని చెప్పాను.
మేము దాని గురించి చాలా విన్నాం, కానీ మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు వాళ్లు. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు, పైగా అది ఎవరూ, ఎక్కడా ఇంతకుముందు ప్రదర్శించి చూపలేదని చెప్పాను. హెలెన్ కిటికీలోంచి చూసింది. ప్లీజ్ ప్లీజ్, మీరు హెలెన్‌ను ప్రేమించండి, మాకో విలువ ఉందని నమ్మకం కలిగించండి, మాకు భయమేస్తోంది, అన్నారు వాళ్లు. ఆ విలువ అంతటా ఉందనీ, (నాకూ భయమేస్తున్నప్పటికీ) మీరు భయపడనవసరం లేదనీ చెప్పాను. హెలెన్ వచ్చి నన్ను కౌగిలించుకుంది. ఆమె కనుబొమ్మలను నేను కొన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను. పిల్లలు కేరింతలు కొట్టారు. ఇంతలో తలుపు దగ్గర ఏదో చప్పుడైంది, వెళ్లి తీశాను, కొత్త ఎడారి ఎలుక లోనికి వచ్చింది. పిల్లలు ఆనందంతో అరిచారు.
నాతో ఎవరూ నేరుగా ప్రస్తావించలేదుగానీ, అసలు స్కూలులోనే ఏదో దోషం ఉందని పిల్లలంతా అనుకోసాగారు. సుప్రసిద్ధ అమెరికన్ కథకుడు, నవలాకారుడు డోనాల్డ్ బార్తెల్మె (1931–1989) రాసిన ‘ద స్కూల్’ కథ ఇది. 1974లో న్యూయార్కర్ లో ప్రచురించబడింది. నిరాశామయ, విధ్వంసకర ప్రపంచంలో ఇంకా ప్రేమ అనే ఆశ ఉందని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ ఇది. ముగింపు అసభ్యకరంగా ఉందని విమర్శించినవాళ్లున్నారు. అయినప్పటికీ క్లాసిక్‌గా గుర్తింపు వచ్చింది. సంక్షిప్త అనువాదం: సాక్షి సాహిత్యం డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment