
ఇదేం మాయ రోగం?
తనకల్లు : కరువు నేలలో కొందరు దుండగులు విధ్వంస కాండకు తెరలేపారు. పాడి పంటలతో ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో చిచ్చు రేపారు. అసలే వర్షాలు లేక పంట నష్టపోయి అప్పుల పాలైన రైతన్నలు రాత్రనకా, పగలనకా కష్టపడి పండించిన అరటి తోటను రాత్రికి రాత్రే తెగనరికేశారు.
బాగుపడిపోతారని కడుపుమంటో ఏమో కానీ కూలీలను పెట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. కన్నబిడ్డలా కంటికి రెప్పలా పంటను కాపాడుతూ వచ్చినా.. చేతికొచ్చే సమయంలో ఇలా నేలపాలవ్వడంతో తనకల్లు మండలం సీఆర్ పల్లికి చెందిన రైతులు బాలాంజనేయరెడ్డి, దామోదర్ రెడ్డి గుండెలు అవిసేలా బోరుమని విలపించారు.
కదిరి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, నల్లచెరువు ఎస్‌ఐ మక్బూల్‌బాషా, తనకల్లు ఏఎస్‌ఐ బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో దుండగుల జాడ కోసం ప్రయత్నించారు. రూ.10 లక్షల పంట నష్టం జరిగినట్లు రెవిన్యూ, ఉద్యనశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ‘పంట కోసం రూ.లక్షలు అప్పు చేశాం.. త్వరలో పంట చేతికొస్తే అప్పు తీర్చేసి హాయిగా ఉందామనుకున్నాం. కాపు కూడా బాగా వచ్చింది. వ్యాపారులూ మంచి ధర ఇస్తామన్నారు. ఇంతలో ఎవరో ఇలా దారుణానికి ఒడిగట్టారు. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలి.. ప్రభుత్వమే ఆదుకోవాల’ని బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.