
ఔషధ వనం
⇒ ‘దివిస్’లో 109 రకాల ఔషధ మొక్కల పెంపకం
⇒ హిమాలయాల్లో మాత్రమే పెరిగే మెుక్కలు సైతం లభ్యం
⇒ కశ్మీర్ ప్రాంతంలో లభించే రుద్రాక్ష చెట్లు కూడా..
⇒ సంరక్షణ, వాటి ప్రత్యేకతలు వివరించడానికి ప్రత్యేక నిపుణులు
హిమాలయాల్లో మాత్రమే పెరిగే మెుక్కలు.. కశ్మీర్ ప్రాంతంలోనే లభించే రుద్రాక్షలు.. భద్రాద్రి రాముడు, శివుడికి ఇష్టమైన పుష్పం.. సుగంధద్రవ్యాల తయారీకి వినియోగించే అరుదైన ప్లాంట్స్.. ఇలా 109 రకాల ఔషధ మెుక్కలు. ఇవన్నీ లభించేది మరెక్కడో కాదు.. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లాబోరేటరీస్ కంపెనీలో. పరిశ్రమకు చెందిన 5 ఎకరాల్లో 109 రకాల ఔషధ మెుక్కలు పెంచుతున్నారు.
‘జగదేకవీరుడు.. అతిలోకసుందరి’ సినిమా చూసే ఉంటారు. ఓ చిన్నారి కాలిలో చలనం పోతుంది. బాలికను పరీక్షించిన ఓ ఋషి హిమాలయాల్లో మాత్రమే లభించే ఓ అరుదైన మొక్కను తెచ్చి, దాని పత్రాల నుంచి రసం తీసి రాస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. దీంతో హీరో అక్కడికి వెళ్లడం.. ఆకు తేవడం.. పసరు తీసి రాయడం.. ఆ తర్వాత బాలిక యథాస్థితికి రావడం తెలిసిందే. అటువంటి అరుదైన మొక్క కావాలంటే ఇప్పుడు ఏ హిమాయాలకు వెళ్లనక్కర్లేదు. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లేబోరేటరీస్‌లోని ఔషధ వనానికి పోతే అలాంటి మెుక్క లభిస్తుంది. హిమాలయాల్లో మాత్రమే పెరిగే మొక్క ఒక్కటే కాదు.. అలాంటి అరుదైన 109 రకాల మొక్కలకు దివీ ఔషధ వనంలో జీవం పోస్తున్నారు.
చౌటుప్పల్:
ఆయుర్వేదం దివ్య ఔషధం. మన సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని రకాల చెట్లు, మొక్కలు, ఆకులు, కాయలు, పండ్లు, బెరడు, కాండం ఇలా ప్రతి భాగం ఒక్కో రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటాయి. వాటిని వినియోగించి రోగాల నుంచి విముక్తి పొందడమే ‘ఆయుర్వేద’ వైద్యం. వాటిని కొన్ని రసాయనిక పదార్థాలతో మేళవించి, ప్రత్యేక పదార్థాలను తయారు చేసే, వినియోగించడమే ‘అల్లోపతి’ వైద్యం. అటువంటి వివిధ రకాల ఔషధాలు, సుగంధద్రవ్యాల తయారీకి వినియోగించే అరుదైన మొక్కలను చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లాబోరేటరీస్ కంపెనీలో పెంచుతున్నారు. కంపెనీ 500ఎకరాల్లో ఉండగా, ఇందులో 250ఎకరాల్లో చెట్లను పెంచుతున్నారు. ఇందులో రావి, యూకలిప్టస్, కానుగ, ఫిల్టోఫామ్, ఉసిరి, నేరేడు, గుల్‌మోహర్, బాదం, వేప, సుబాబుల్, గన్నేరు, పూల మొక్కలు పెంచుతున్నారు.
5 ఎకరాల్లో...
కంపెనీ ఆవరణలోని 5ఎకరాల్లో దివి ఔషధ వనం పేరుతో 109రకాల ఔషధ మొక్కలను గత రెండున్నరేళ్లుగా పెంచుతున్నారు. ప్రస్తుతం 300లకుపైగా ఔషధ మొక్కలు వనంలో జీవం పోసుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, మొక్కలను కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ పెంచుతున్నారు. మొక్కల సంరక్షణకు, వాటి పేర్లు, పండ్లు, ఆకుల ప్రత్యేకతలను వివరించడానికి ఔషధ మొక్కలపై అవగాహన ఉన్న నిపుణులను కూడా నియమించారు. ఇందులో హిమాలయాల్లో మాత్రమే లభించే 9రకాల సుగంధ ద్రవ్యాల మొక్కలతో పాటు, కశ్మీర్ ప్రాంతంలో మాత్రమే లభించే రుద్రాక్ష చెట్లను కూడా ఇక్కడ పెంచుతున్నారు. కృష్ణతులసి, జమ్మి, బిలంబి, లవంగ, కర్పూర, సబ్జతులసి, రుద్రజడ, మెంతి వంటి అరుదైన రకాలతో పాటు కూరల్లో వినియోగించే బిర్యాని ఆకు, లవంగ ఆకువంటి మొక్కలను కూడా పెంచుతున్నారు.