బ్లూబెర్రీ, సీడ్‌లెస్ నేరేడు, ఆల్ సస్పైసిస్ మొక్కలు
పంటలు పండించే తీరు ఆసాంతమూ రసాయనాల మయం అయిపోయిన తర్వాత ఆహారం కూడా రసాయనాల అవశేషాలతో అనారోగ్యకరంగా మారిపోయింది. ఈ ముప్పు నుంచి మానవాళి తప్పించుకోవాలంటే.. పంటల ఉత్పత్తిదారులైన రైతుల అలవాటు మారాలి, వారితోపాటు సహ ఉత్పత్తిదారులైన వినియోగదారులూ మారాలి. రసాయనాల మకిలి లేని మంచి ఆహారాన్ని ఇష్టపడే ప్రజలు ఎవరైనా ముందు చేయాల్సింది వారి ఇంటిపైన, ముందు, వెనుక ఉన్న కొద్ది పాటి స్థలంలోనైనా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి తక్షణం శ్రీకారం చుట్టటమే.
ఈ చైతన్యాన్ని అందిపుచ్చుకోవటంలో, జనబాహుళ్యంలో ప్రచారంలోకి తేవటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ బాధ్యతను గుర్తెరిగి ఏడాది కాలంలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు బొర్రా ప్రదీప్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన జెడ్పీ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి గ్రామంలోని సాలిపేట శ్రీవెంకటేశ్వర గార్డెన్స్‌లో 4 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఉన్న కొద్ది పాటి స్థలాన్ని సద్వినియోగం చేసుకుని ఏడాది కాలంగా మిద్దె తోటలను పెంచుతున్నారు ప్రదీప్. ఎర్రమట్టి, నల్లమట్టి, బాగా చివికిన పశువుల ఎరువు, ఇసుక, కొబ్బరి పీచు తగు పాళ్లలో కలిపిన మిశ్రమం ప్లాస్టిక్ డబ్బాలు, బక్కెట్లతో ధర్మోకోల్ బాక్సుల్లో వేసి మొక్కలు నాటారు. డబ్బాలు, బక్కెట్ల కింద ఇనుప స్టాండ్లను అమర్చి శ్లాబు సంరక్షణకు చర్య తీసుకున్నారు.
వివిధ రకాల వంగ, టమోట, బెండ, తీగ బచ్చలి, తోటకూర, పాలకూర, గోంగూర, చిక్కుడు, బీర, కాకర, దోస, పొట్ల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, తీపి నారింజ, గులాబి, జామ, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, ప్యాషన్ ఫ్రూట్, బ్లూ బెర్రీ, అంజూర, స్ట్రాబెర్రీ, జామ, యాపిల్ బెర్, స్టార్‌ఫ్రూట్, నిమ్మ, ఆల్ సస్పైసిస్, మెక్సికన్ అవకాడో వంటి అరుదైన మొక్కలను సేకరించి వాటిని మిద్దెపై పెంచుతున్నారు. సహజసిద్ధమైన పద్ధతిలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యదాయక ఆహారాన్ని ఇంటిల్లపాది భుజిస్తున్నారు. ఈ విషయాలను సామాజిక మాథ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు
ఆహ్లాదం.. ఆరోగ్యం..
సుమారు సంవత్సర కాలంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నాను. ప్రతి రోజూ మొక్కలను సంరక్షిస్తూ వాటితో గడపటం వల్ల ఆహ్లాదంతో పాటు రుచికరమైన కూరగాయలు, పండ్లు ఇంటి అవసరాలకు సమకూర్చుకోవచ్చు. పిల్లలకు కూడా సేంద్రియ పంటల ప్రాధాన్యం తెలిస్తే.. తామూ పండిస్తారు. వాటిని పండించే రైతులపై గౌరవమూ పెరుగుతుంది.
– బొర్రా ప్రదీప్ (80749 73382), తెలుగు ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment