పాపం.. పసివాడు
నవమాసాలు పెంచి పురిటినొప్పులు భరించి జన్మిచ్చిన అమ్మా ఇలా వదిలేశావేమమ్మా ఏమి ముంచుకొచ్చింది ముప్పు ఏమి చేశావ్ అంత తప్పు చూశావు కదా నా రూపం అనిపించలేదా అయ్యో పాపం..
చీరాల: ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు.. తెల్లగా, బొద్దుగా, అందంగా ఉన్నాడు. తల జుత్తు నల్లగా నిగనిగలాడిపోతోంది. చూస్తేనే ముద్దాడాలనిపిస్తోంది. కానీ మహరాజులా ఉన్న పండంటి బిడ్డ చీరాల బస్టాండు వద్దనున్న గార్డెన్ పక్కన మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో శుక్రవారం ఏడుస్తూ కనిపించాడు. గార్డెన్ సిబ్బంది పరుగుపరుగున అక్కడకు వెళ్లారు. కన్నతల్లి కనిపిస్తుందేమో.. నాన్న వచ్చి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటాడేమోనని గమనించారు. కానీ ఎంత సేపటికీ ఆ మగ బిడ్డకోసం ఎవరూ రాలేదు. ఇక విషయం అర్థం అరుుంది.
ఎవరో కావాలనే బాబును అక్కడ వదిలి వెళ్లారని. బుజ్జారుుకి కనీసం బొడ్డు తాడు కూడా ఊడలేదు. ఈ దృశ్యం చూసిన కొంతమంది కళ్లలో నీళ్లు తిరిగారుు. మానవత్వం ఉన్నవారు మౌనంగా రోదించారు. పుట్టిన మూడు రోజులకే ఆ పసివాడు పడుతున్న కష్టాలకు చలించారు. చలికి వణుకుతున్న బాబును స్థానికులు అక్కున చేర్చుకొని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి బాబు అరోగ్యంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆ బిడ్డను పెంచుకుంటామంటూ చాలా మంది ముందుకొచ్చినా.. వైద్యులు నిరాకరించారు. ఐసీడీఎస్ ద్వారా ఒంగోలులోని చైల్డ్ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.