సువిశాలమైన ఉద్యానవనాల్లో విహరించడం ఒక అద్భుతమైన అనుభూతి. తోటల్లో తిరుగుతూ ఉంటే, ప్రకృతికి దగ్గరగా సంచరిస్తున్నట్లుంటుంది. తోటల్లోని మొక్కలకు పూచే పువ్వులను చూస్తే పూజ కోసమో, సరదాగా తలలో తురుముకోవడం కోసమో కోయాలనిపిస్తుంది. తోటల్లోని చెట్లకు కాసే కాయలను, పండే పండ్లను కోసుకు తినాలనిపిస్తుంది. ప్రభుత్వాల అధీనంలో ఉండే కొన్ని తోటల్లో పూలు, పండ్లు కోయడంపై ఆంక్షలుంటాయి. ముచ్చటగా పెంచుకునే ప్రైవేటు తోటల్లో అలాంటి ఆంక్షలేమీ ఉండవు.
మనసుకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. వాటికి పూసిన పూలు, కాసిన కాయలు యథేచ్ఛగా కోసుకోవచ్చు. కానీ, బ్రిటన్‌లోని ఆ తోటలో పూలు, కాయలు కోసుకోవడం సంగతి అటుంచితే, అక్కడి మొక్కలను తాకినా ప్రమాదమే! తాకితే శిక్షలు ఏవైనా పడతాయని కాదు గానీ, అవి అత్యంత విషపూరితమైనవి.
ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోట బ్రిటన్‌లో నార్త్‌అంబర్‌లాండ్‌లోని ఆన్విక్ కేసిల్‌లో ఉంది. ఈ తోటకు ఏర్పాటు చేసిన నల్లని ఇనుప ప్రవేశ ద్వారంపైన ప్రమాద సంకేతాలుగా పుర్రె, ఎముకల గుర్తులు కనిపిస్తాయి. తోట లోపల కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలు దాదాపు అడుగడుగునా కనిపిస్తాయి. నిపుణులైన గైడ్ల పర్యవేక్షణలో మాత్రమే సందర్శకులు దీని లోపలకు వెళ్లవలసి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా యథేచ్ఛగా వెళితే, లేనిపోని అనర్థాలు తప్పకపోవచ్చు. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి.
అలాగని, వాటిని తాకడానికి ప్రయత్నించినా, మొక్కలకు పూసే పూలను కోయకుండానే, వాటిని వాసన చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడం కష్టం. గైడ్ల సూచనల మేరకు సురక్షితమైన దూరంలో నిలుచుని వీటిని చూడటమే అన్నివిధాలా క్షేమం. నార్త్‌అంబర్‌లాండ్ డ్యూషెస్ జేన్ పెర్సీ 2005లో ఈ తోటను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పదకొండో శతాబ్దినాటి కేసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునరుద్ధరించి, ప్రపంచంలోని అరుదైన విషపు మొక్కలను ఏరికోరి తీసుకొచ్చి ఈ తోటను పెంచారు. ఇందులోని విషపు మొక్కలు కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ‘మీ ప్రాణాలు తీసేసే మొక్కలే మీ ప్రాణాలను కాపాడతాయి’ అంటారు పెర్సీ.
ఈ తోటలో బెల్లడోనా, పాయిజన్ ఐవీ, హెన్‌బేన్, జెయింట్ హాగ్‌వీడ్ సహా వందలాది విషపు మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి పూల వాసన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం, వాంతులవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని మొక్కలను తాకితే చాలు ఒళ్లంతా దద్దుర్లు రేగి, చర్మం మంట పెడుతుంది. కొన్నింటి కాయలు, పళ్లు తింటే మైకం కమ్ముకు రావడమే కాకుండా, ప్రాణాంతక పరిస్థితులు సైతం ఎదురవుతాయి. ఈ తోటలోని మొక్కలు ప్రకృతిలోని జీవవైవిధ్యానికి అద్దంపడతాయి.
చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment