'మన జీవితంలో మనం ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు చూసుంటాం. ఎన్నో అద్భుతాలను చూసుంటాం. అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పాతాళవనాన్ని కాదు కాదు, ఉద్యానవనాన్ని మీరెప్పుడైనా చూశారా! చూడాలంటే.. పాతాళంలోకి దిగాల్సిందే.., దిగాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే..! ఆశ్చర్యం, అద్భుతం రెండూ కలిస్తేనే ఈ వనం. మరి అదేంటో కాస్త ముందే తెలుసుకుందామా..!'
ఈ పాతాళవనం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఈ ఉద్యానవనం వెనుక కొంత చరిత్ర ఉంది. ఇటలీలోని సిసిలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన బాల్డసరె ఫారెస్టీరె ఫ్రెస్నోలో 1904లో పది ఎకరాల భూమి కొన్నాడు. ఇక్కడి మట్టి నిమ్మ, నారింజ వంటి పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా లేకపోవడమే కాదు, ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో విపరీతమైన వేడిగా ఉండేది. వేసవి తాపాన్ని తట్టుకునే విశ్రాంతి మందిరం కోసం బాల్డసరె ఈ భూమిలో ఇరవైమూడు అడుగుల లోతున నేలమాళిగను తవ్వించాడు.
నేలమాళిగలోనే గదులు గదులుగా నిర్మాణం చేపట్టి, లోపలకు గాలి వెలుతురు సోకేలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ తవ్వకాన్ని విస్తరించి, చిన్న చిన్న మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచాడు. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో ఈ నేలమాళిగలో మొక్కలు ఏపుగా పెరిగాయి. బాల్డసరె 1946లో మరణించాడు. అమెరికా ప్రభుత్వం 1977లో దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నేలమాళిగలో పెరిగిన ఈ ఉద్యానవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment