ఒక రాత్రి ఆ తోటలో..! | A night .. In the garden! | Sakshi
Sakshi News home page

ఒక రాత్రి ఆ తోటలో..!

Published Sun, Jul 19 2015 1:01 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

ఒక రాత్రి ఆ తోటలో..! - Sakshi

ఒక రాత్రి ఆ తోటలో..!

* తోటలో యువతి...
* తిరుగుతూ పాట పాడుతోంది.
* నవ్వుతోంది... ఏడుస్తోంది.
* మనిషా? దెయ్యమా??

ఇంగ్లండ్‌లోని బ్రిమింగ్‌హామ్ టౌన్ ఎలా ఉంటుంది? ఒకప్పుడు దానికి ఉన్న పేరు మార్కెట్ టౌన్. దీనికి సార్థకత చేకూరుస్తున్నట్లుగానే ఉంటుంది ఆ టౌన్. మార్కెట్ మాదిరిగానే గజిబిజిగా, బిజీ బిజీగా ఉంటుంది.  అలాంటి పట్టణంలో ఒక తోటను ఆనుకొని ఉంది విక్టోరియా విల్లా.

‘‘ఎంత అందంగా ఉంది! ఎంత రాజదర్పంతో ఉంది!’’ అనుకుంటారు కొత్తవాళ్లు. ‘‘ఎంత క్రూరంగా ఉంది, ఎంతగా భయపెడుతోంది’’ అని వణికి పోతారు పాతవాళ్లు. ఇప్పుడు ఆ పాతభవంతికి సరికొత్త కళ వచ్చింది. ఎందుకంటే ఆ భవంతిని గ్రేగ్ క్లార్క్ అనే ప్రొఫెసర్ కొనుగోలు చేశాడు. తెలియక కాదు... తెలిసీ తెలియక కాదు... బాగా తెలిసే ఈ భవంతిని కొనుగోలు చేశాడు. దెయ్యాల సంఘం ఒకటి  ప్రొఫెసర్ క్లార్క్‌ను కలుసుకొని ‘మేము ఉన్నాం మహాప్రభో’ అని వినతిపత్రం సమర్పించినా సరే... ఆ భవంతిని కొనడానికి వెనుకంజ వేసేవాడు కాదు.
 
ప్రొఫెసర్‌కు  ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. అందరిలోకెల్లా పెద్దది హన్నా బెట్స్. మిగతా పిల్లలకు తల్లి దండ్రుల కంటే అక్క దగ్గరే చనువు ఎక్కువ. విల్లాలో ఉన్న ఆరు బెడ్ రూమ్‌లలో పిల్లలు స్వేచ్ఛగా తిరుగు తుంటారు. ఒకరోజు మాత్రం పెద్ద తమ్ముడు టామ్ బిక్కచచ్చి వచ్చాడు. ‘‘అక్కా... ఆ గదిలో ఒక ముసలాయన ఉన్నాడు. ఏరా మనవడా, ఇప్పుడా రావడం’’ అని నా దగ్గరికి రాబోతుంటే భయంతో పరుగెత్తుకు వచ్చాను’’ అన్నాడు. నవ్వింది బెట్స్. మరో రోజు చెల్లి మేరీ గడ గడ వణుకుతూ... ‘‘అక్కా... ఆ గదిలో గెడ్డం ముసలోడు తిరుగుతున్నాడు’’ అంది. ఈసారి మాత్రం నవ్వలేదు బెట్స్. ఆలోచించింది. అమ్మతో చెబితే నాన్నకు చెప్పమంటుంది. నాన్నతో చెబితే ఏం జరుగుతుందో తనకు తెలుసు.

కాబట్టి తానే ఆరోజు ఒంటరిగా ఆ గది లోకి వెళ్లి, నవల చదువుకోవడం ప్రారంభించింది. అయిదు నిమిషాల తరువాత... ఏడుస్తున్న ముసలిగొంతు వినిపించింది. ‘‘ఎవరది?’’ అని అరిచింది బెట్స్. జవాబు లేదు. కిటికీ రెక్కలు ఊగాయి. ఆ తరువాత ఏడుపు దానికదే ఆగిపోయింది.
 
ఒకరోజు ప్రొఫెసర్ కుటుంబం సినిమాకు వెళ్లి, హోటల్‌లో భోజనం చేసి ఇంటికి తిరిగొచ్చింది. లోపల ఏవో గొంతులు, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘‘లోపల ఎవరో ఉన్నారు’’ భయంగా అన్నారు పిల్లలు. ‘‘లోపల పిల్లులు పోట్లాడుకుంటున్నాయి. వాటి శబ్దానికి కూడా భయపడితే ఎలా?’’ అని పిల్లల భుజాల మీద చేయివేసి ధైర్యం చెప్పాడు ప్రొఫెసర్. లోపల ఎవరూ లేరా??
 ఒకరోజు రాత్రి ప్రొఫెసర్ భార్య మేడపైగది కిటికీలో నుంచి తోట వైపు చూస్తోంది.

ఓ యువతి వెన్నెల్లో తిరు గుతూ పిచ్చిగా నవ్వుతోంది. పాడుతోంది. అంతలోనే ఏడుస్తోంది. ‘‘కొంపదీసి దెయ్యమైతే కాదుగదా!’’ అనుకుంది ప్రొఫెసర్ భార్య. ఒకరోజు ప్రొఫెసర్ క్లార్క్  హడావుడిగా వచ్చి ‘‘ఈ ఇంటిని అమ్మేశాను. త్వరలో మనం ఒక కొత్త ఇంట్లోకి మారబోతున్నాం’’ అన్నాడు. వారం తిరిగేలోపే ఆ కుటుంబం కొత్తింటికి మారింది. ఆగమేఘాల మీద  విక్టోరియా విల్లాను ఎందుకు అమ్మేశాడో ఎప్పుడూ ఎవరికీ  చెప్పలేదు ప్రొఫెసర్ క్లార్క్.
   
హన్నా బెట్స్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి. లండన్‌లో ఉంటోంది.  సుదీర్ఘకాలం తరువాత తన ఫ్రెండ్స్‌తో కలసి విక్టోరియా భవంతికి వెళ్లింది. ఆ భవంతి అప్పటిలాగే గంభీరమైన మౌనంతో ఉంది. చుట్టుపక్కల జనాల ద్వారా... ఈ భవంతి గురించి ఎన్నడూ వినని కొత్త విషయం ఒకటి తెలిసింది. విక్టోరియా విల్లాను ఒక డాక్టర్ చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు. అతడి మన వడిని  డబ్బు కోసం కొందరు కిడ్నాప్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేశాడనో, అడిగినంత  డబ్బు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాడనే కారణంతోనో పిల్లాడిని చంపేశారు. అది తట్టుకోలేక పిల్లాడి తల్లి చనిపోయింది. ‘‘కూతురు, మనవడు చనిపోయాక నేనెందుకు ఈలోకంలో...’’ అని ఆ డాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి వికోర్టియా విల్లాలో, చుట్టుపక్కలా తండ్రీకూతుళ్ల్ల ఆత్మలు సంచరిస్తున్నాయనేది ప్రచారంలో ఉన్న కథ. బెట్స్ విక్టోరియా విల్లాలోని ఆరు గదుల్లోకీ వెళ్లింది. ఆమెకు మళ్లీ ముసలి డాక్టరు అరుపు, వెన్నెల రాత్రుల్లో తోటలో యువతి ఏడుపు, నవ్వు మళ్లీ వినిపించినట్లుగా అనిపించింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement