Childhood marriage
-
చేతులే నేస్తాలుగా...
కష్టమంటే ఏంటో తెలియని చిన్నతనం. ఊహ తెలియకముందే పెళ్లి పేరుతో జీవనం. ఆదుకోని అయినవారు. అయినా చేతులున్నాయి కదా! అంటూ కొత్త జీవనం వైపుగా అడుగులు వేసి నేడు అందరితో శభాషని అనిపించుకుంటోంది ఆటోడ్రైవర్ సీతాదేవి. రోడ్లు ఊడ్చే పని నుంచి ఆ ఢిల్లీ రోడ్ల మీదే ఆటో నడుపుతూ, ముగ్గురు పిల్లలను చదివిస్తున్న సీతాదేవి ‘ఎన్నో ఒడిదుడుకుల జీవితం. కానీ, సొంత చేతులనే నమ్ముకున్నాను’ అని చెబుతోంది. ‘‘నేను మా అమ్మనాన్నలకు కొడుకుల కంటే తక్కువేమీ కాదని నిరూపించుకున్నాను. కొన్నేళ్ల క్రితం కష్టం వచ్చిందని పుట్టింటికి వెళితే, ఆదరించలేదు. అలాగని వారి మీద కోపం తెచ్చుకోలేదు. మా అమ్మనాన్నలది బీహార్. అక్కడే ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు. ఆ వయసులో నాకెలాంటి తెలివితేటలు లేవు. నా భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిపోయాను. కానీ, ఆయన ఉద్యోగం గుజరాత్లో. పెళ్లయ్యాక ఐదేళ్లయినా పిల్లలు పుట్టలేదని అత్తింటిలో వేధింపులు. నన్ను వదిలేయమని నా భర్తతో బంధువులంతా చెప్పారు. ఆ యేడాదే గర్భవతిని అని తెలియడంతో నా పట్ల మా అత్తింటివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. కానీ, నా భర్త ఉద్యోగం పోవడంతో కుటుంబపరిస్థితి పూర్తిగా క్షీణించింది. అప్పుల్లో కూరుకుపోయారు. ఎనిమిది నెలల గర్భవతిని. పూట గడవని పరిస్థితి. ఉన్న వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. పుట్టింటికి వెళితే గడపతొక్కనివ్వలేదు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాను. తినడానికి ఏమీ లేని పరిస్థితి. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నాను. తెలిసినవారి ద్వారా రోడ్లు ఊడ్చే పని దొరికింది. దీంతో మరో చిన్న ఇంటికి మారిపోయాం. పురిటిబిడ్డను తీసుకునే పనికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మా అన్న రావడంతో కొద్దిగా వస్తువులు కొన్నాను. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లలకు పూట గడుస్తుంది కానీ, మున్ముందు రోజులెలా గడవాలా... అని ఆలోచించేదాన్ని. నాలుగు ఇళ్లలో వంటపని చేయడం ప్రారంభించాను. ఆదాయం బాగానే ఉండటంతో స్వీపర్ పని వదిలేశాను. ► పగలు వంటలు నాకు వండడం తెలుసు. కానీ, వెరైటీ వంటలు చేయడం రాదు. వంటల పుస్తకాలు కొని, చదివి వెరైటీ వంటలు నేర్చుకొని, ఇళ్లలో చేయడం మొదలుపెట్టాను. అలా నెలకు 10 నుంచి 12 వేల రూపాయల వరకు వచ్చేవి. ఈ సంపాదనతో నా ముగ్గురు పిల్లల పోషణ బాగానే చూసుకోగలిగాను. ► రాత్రిళ్లు ప్లాస్టిక్ సంచులు ప్రయత్నం లేకుండా మన తలరాతలో ఏది రాస్తే అది జరుగుతుందనుకోవడం తప్పు. పగలు వంటలతో పాటు రాత్రి ఇంటి వద్దే ప్లాస్టిక్ బ్యాగులు కుట్టేదాన్ని. పదకొండువందల రూపాయలతో పాత మెషిన్ కొని, బ్యాగులు కుట్టేదాన్ని. మెటీరియల్ ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి, వేరేవాళ్లకు కూడా పని ఇవ్వడం మొదలుపెట్టాను. అలా పదివేల ప్టాస్టిక్ సంచులు కుట్టించి ఇస్తే, సంచికి ఇరవై ఐదు పైసలు వచ్చేవి. ఈ సంపాదనతో బీహార్‌లో ఇల్లు కట్టుకున్నాను. ► బిజీ బిజీ చేతుల నిండా పనులు. నా రోజులు డబ్బుతో నిండిపోవడం మొదలయ్యాయి. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అత్తమామల రుణం తీర్చేశాం. మా అమ్మనాన్నల లక్షన్నర అప్పు కూడా తీర్చి కొడుకుల కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాను. నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కాలేజీలో, ఒకరు పదోతరగతి చదువుతున్నారు. నా సంపాదనతోనే పిల్లలను చదివిస్తున్నాను. ► డ్రైవింగ్‌లో శిక్షణ దాదాపు పదేళ్ల క్రితం గృహహింసపై మా ప్రాంతంలో అవగాహనా కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు ఓ లాయర్ మాట్లాడుతూ ‘‘మహిళలు గృహహింసను ఎందుకు అనుభవించాలి, భర్తపై ఆధారపడకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరు అని వివరించారు. ఆ సమయంలోనే అమ్మాయిలు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఆ ఫౌండేషన్ వాళ్లు ఇచ్చిన ఆరు నెలల డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నాను. అదే సంవత్సరం నేను ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్ ప్రారంభించాను. అయితే, పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని కొంతకాలం తర్వాత డ్రైవింగ్ మానేశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఈ–ఆటో నడిపే అవకాశం వచ్చింది. కల్కాజీ మెట్రోలో ఈ–ఆటో ప్రారంభించినప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలు వస్తాయి. ఉదయం 10 గంటలకు ఈ–ఆటోతో మెట్రో పార్కింగ్ నుంచి బయల్దేరుతాను. సాయంత్రం 5 వరకు నడుపుతున్నాను. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. అందుకు చింతిస్తూ కూర్చోకుండా, పనిని చేస్తూనే ఉండాలి. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది’అని చెబుతున్న సీతాదేవి కృషి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది. – సీతాదేవి -
‘డబ్బు చెల్లించలేకపోతే.. పెళ్లి జరిపించండి’
హైదరాబాద్ : బాల్య వివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. రోజుకు ఎంతో మంది చిన్నారుల బాల్యం వివాహమనే బంధీఖానాలో చిక్కుకుంటూనే ఉంది. ఇటువంటి దురాచారాలు మారుమూల పల్లెల్లోనే కాదు.. హైద్రాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలలోనూ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న కారణంగా వివాహానికి సిద్ధమైందో 15 ఏళ్ల బాలిక. వివరాల్లోకి వెళితే.. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ఊర్మిళ, శ్రీకాంత్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. అయితే బతుకుదెరువు కోసం శ్రీకాంత్ కుటుంబం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కాటేదాన్ ఏరియాలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే శ్రీకాంత్ కుటుంబానికి.. పొరుగున ఉన్న చెన్నయ్య గుప్త అనే వ్యక్తి ఇంటిని అద్దెకివ్వడంతో పాటు డబ్బు సాయం చేశారు. అయితే శ్రీకాంత్ కుటుంబం ఈ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయింది. దీంతో చెన్నయ్య గుప్త.. దివ్యాంగుడైన తన 38 ఏళ్ల కుమారుడు రమేశ్ గుప్తాకు శ్రీకాంత్ పెద్ద కూతురు(15)ను ఇచ్చి వివాహం చేయాల్సిందిగా బలవంతపెట్టాడు. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో.. బుధవారం సాయంత్రం గుడిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు గుడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను గర్ల్స్ హోంకి తరలించారు. ఆమె ఇష్టప్రకారమే.. బాలిక తల్లి ఊర్మిళ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చిన నాటి నుంచి రమేశ్ కుటుంబం తమకు అన్ని విధాల సాయపడిందని తెలిపింది. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాం కాబట్టి రమేశ్‌కు తమ కూతురినిచ్చి వివాహం చేస్తామని మాట ఇచ్చామని పేర్కొంది. మా అమ్మాయి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు.. ఆమె అంగీకారంతోనే పెళ్లి నిర్ణయించామని చెప్పింది. డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసి.. దివ్యాంగుడైన తమ కుమారుడిని చూసుకోవడానికే చెన్నయ్య గుప్త ఈ పెళ్లి నిశ్చయించారని మైలర్‌దేవ్‌పల్లి ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. డబ్బు చెల్లించలేని పక్షంలో బాలికతో తమ కుమారుడి వివాహం జరిపించాలంటూ ఆమె తల్లిదండ్రులను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు బాల్య వివాహ నిషేధ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మైనర్ పెళ్లికి నిరాకరణ.. కుటుంబం హత్య
జంషెడ్పూర్ : ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్ భూమ్ జిల్లాలో గత నెల 14న ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింగ్భూమ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఐదు శవాలు దొరికాయి. వీరిని రామ్‌సింగ్ సిర్కా, అతని భార్య పను, కూతురు రంభ(17), కుమారులు కండే(12), సోన్యాలుగా పోలీసులు గుర్తించారు. ఇదివరకే పెళ్లైన వ్యక్తితో తన మైనర్ కూతురికి వివాహం జరిపించడానికి నిరాకరించాడనే కారణంతో రామ్ సింగ్ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రామ్‌సింగ్ ఇంట్లో లేని సమయంలో రాడ్లు, పదునైన ఆయుధాలతో కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులు.. వారి శవాలను ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో పడేశారని వివరించారు. రామ్ సింగ్ ఇంటికి రాగానే అతనిపై కూడా దాడి చేసి హతమార్చారని వెల్లడించారు. అతని శవాన్ని కూడా దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ కేసులో తొమ్మిది మందిని అనుమానితులుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఒకరిని అరెస్టు చేయగా మిగిలిన వారు రాష్ట్రం విడిచి పారిపోయినట్లు సమాచారం. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
పరిగి : రెండు రోజుల్లో జరగాల్సిన బాల్యవివాహాన్ని పోలీసులు, ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు ఆదివారం అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన మమత (14) పరిగి నంబర్ 1 ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మూడు రోజుల క్రితం బాలికకు మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండల రుద్రారానికి చెందిన మల్లేశం (40)కి ఇచ్చి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. మల్లేశంకు ఇది రెండో వివాహం. అయితే ఈ విషయం ఉపాధ్యాయుల ద్వారా ఎంవీఎఫ్ ఆర్గనైజర్లకు తెలిసింది. వారు ఎస్ఐ నగేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన శనివారం రాత్రి సిబ్బందితో అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి పనులను నిలిపి వేయించాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆదివారం ఉదయం ఎంవీఎఫ్ సిబ్బందితో కలిసి మరో మారు బాలిక తల్లిదండ్రులకు, పెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం బాలికను కస్తూర్బా గాంధీ పాఠశాలకు పంపించారు. వివాహ వయస్సు వచ్చే వరకు వివాహం చేయరాదని వారి వద్ద రాయించుకున్నారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు రాములు, నరసింహులు, దేవకుమారి తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహానికి బ్రేక్!
కడియం : మండలంలోని మురమండ గ్రామంలో గురువారం జరగనున్న బాల్యవివాహాన్ని అధికారులు ముందుగానే అడ్డుకున్నారు. వధువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అధికారుల కథనం ప్రకారం... మురమండ ఏఎంజీ నగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు గురువారం ఆమె మేనమామతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేశారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ నర్సమ్మ సూచన మేరకు సూపర్వైజర్ సీహెచ్ హెలెన్ విషయాన్ని గ్రామ సర్పంచ్ ఈదర పాపారావుకు తెలిపారు. దీంతో వీరందరూ కలసి బుధవారం బాలిక ఇంటికి చేరుకున్నారు. చిన్నవయస్సులో వివాహం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, బంధువులకు వివరించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేస్తామని అధికారులకు లిఖితపూర్వంగా హామీ ఇచ్చారు. బాలిక మేనమామ తల్లి ఇటీవలే మరణించారని, ఏడాదిలోపు పెళ్లి చేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలిక తల్లిదండ్రులు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల వారి నుంచి వివాహం నిలిపివేస్తున్నట్టుగా వీఆర్వో పి. శంకర్రావు లిఖితపూర్వకంగా రాయించుకున్నారు.