బాల్య వివాహానికి బ్రేక్!
కడియం : మండలంలోని మురమండ గ్రామంలో గురువారం జరగనున్న బాల్యవివాహాన్ని అధికారులు ముందుగానే అడ్డుకున్నారు. వధువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అధికారుల కథనం ప్రకారం... మురమండ ఏఎంజీ నగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికకు గురువారం ఆమె మేనమామతో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేశారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ నర్సమ్మ సూచన మేరకు సూపర్‌వైజర్ సీహెచ్ హెలెన్ విషయాన్ని గ్రామ సర్పంచ్ ఈదర పాపారావుకు తెలిపారు. దీంతో వీరందరూ కలసి బుధవారం బాలిక ఇంటికి చేరుకున్నారు.
చిన్నవయస్సులో వివాహం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, బంధువులకు వివరించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహాన్ని నిలిపివేస్తామని అధికారులకు లిఖితపూర్వంగా హామీ ఇచ్చారు. బాలిక మేనమామ తల్లి ఇటీవలే మరణించారని, ఏడాదిలోపు పెళ్లి చేస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలిక తల్లిదండ్రులు చెప్పారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల వారి నుంచి వివాహం నిలిపివేస్తున్నట్టుగా వీఆర్‌వో పి. శంకర్రావు లిఖితపూర్వకంగా
రాయించుకున్నారు.