బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
పరిగి : రెండు రోజుల్లో జరగాల్సిన బాల్యవివాహాన్ని పోలీసులు, ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు ఆదివారం అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన మమత (14) పరిగి నంబర్ 1 ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మూడు రోజుల క్రితం బాలికకు మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండల రుద్రారానికి చెందిన మల్లేశం (40)కి ఇచ్చి వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. మల్లేశంకు ఇది రెండో వివాహం. అయితే ఈ విషయం ఉపాధ్యాయుల ద్వారా ఎంవీఎఫ్ ఆర్గనైజర్లకు తెలిసింది. వారు ఎస్‌ఐ నగేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన శనివారం రాత్రి సిబ్బందితో అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి పనులను నిలిపి వేయించాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆదివారం ఉదయం ఎంవీఎఫ్ సిబ్బందితో కలిసి మరో మారు బాలిక తల్లిదండ్రులకు, పెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం బాలికను కస్తూర్బా గాంధీ పాఠశాలకు పంపించారు. వివాహ వయస్సు వచ్చే వరకు వివాహం చేయరాదని వారి వద్ద రాయించుకున్నారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు రాములు, నరసింహులు, దేవకుమారి తదితరులు పాల్గొన్నారు.