సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కేంద్రం ఆమోదించనంత మాత్రాన సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా నియామకాన్ని నిలిపివేయడం తగదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. సుప్రీం న్యాయమూర్తిగా వచ్చిన సిఫార్సును పునఃసమీక్షించాలని తిప్పి పంపడం కేంద్రం హక్కుల్లో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాదుల ప్రతిపాదన అర్థరహితం, ఊహాతీతమని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రం ఖరారు చేసేవరకూ ఇందూ మల్హోత్రా సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం చేయరాదన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రతిపాదన పట్ల ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్రం ఇందూ మల్హోత్రా, జోసెఫ్‌ల పేర్లను రెండింటినీ సుప్రీం న్యాయమూర్తులుగా ఖరారు చేయడం లేదా తిప్పిపంపడం చేయాలని రెండింటినీ వేర్వేరుగా చూడటం సరైంది కాదన్న ఇందిరా జైసింగ్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. తాము న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రం ఆదేశాలను నిలిపివేయాలని కోరడం లేదని, జడ్జీలను ప్రభుత్వం ఎంచుకునే విధానాన్నే ప్రశ్నిస్తున్నామని ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆందోళన నెలకొందని అన్నారు.సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పునఃసమీక్షించాలని కేంద్రం సుప్రీం కోర్టు కొలీజియంను కోరడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment