ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
ఆరు రోజుల పాటు ముమ్మరంగా విచారణ జరిపిన తర్వాత.. ట్రిపుల్ తలాఖ్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు గురువారంతో ముగిశాయి. ఈ విషయంపై నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జూలై నెలలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అంతకుముందు షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా తన వాదనలు వినిపించారు. ట్రిపుల్ తలాఖ్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని ఆయన అన్నారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం, ట్రిపుల్ తలాఖ్ అనేది విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఈ వాదనను షయారా బానో న్యాయవాది తిప్పికొట్టారు.
అసలు ట్రిపుల్ తలాఖ్ అనే పదం గానీ, ఆ ఆచారం గానీ పవిత్ర ఖురాన్‌లో ఎక్కడా లేదని, అది ఆమోదయోగ్యం కాని విషయమని స్వయంగా పర్సనల్ లాబోర్డే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని, పాపమని కూడా చాలావరకు ఇస్లాం స్కూళ్లలో చెప్పారని, అయినా దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదనడం సరికాదని ఛద్దా చెప్పారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఆయన వాదించారు. మతం ఏం చెబుతుందో ఆర్టికల్ 25 కూడా అదే చెబుతుందని, ఈ అలవాటు ఇస్లాం ప్రకారం సరైంది కాదని, అందువల్ల ఇందులో మతాచారాలను ఉల్లంఘించినట్లు ఏమీ లేదని కూడా ఛద్దా చెప్పారు. ఈ సమయంలో జస్టిస్ నారిమన్ జోక్యం చేసుకున్నారు. ''మీరు వాదించేదాన్ని బట్టి అసలు ట్రిపుల్ తలాఖ్ అనే అలవాటు మతంలో భాగమే కాదు కదా'' అని ఆయన ప్రశ్నించగా, ఛద్దా అవునని చెప్పారు. దాంతో ఈ కేసులో వాదనలు మొత్తం ముగిసినట్లు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టే ట్రిపుల్ తలాఖ్ ఉంటుందా.. ఉండదా అనే విషయం తేలనుంది.