triple talaq case
-
ఏపీ నూతన గవర్నర్‌గా రిటైర్డ్ జడ్జి.. ఎవరీ జస్టిస్ అబ్దుల్ నజీర్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు. కాగా ఏపీకి మూడో గవర్నర్‌గా రానున్న సయ్యద్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి. గత నెల జనవరిలో పదవీ విరమణ చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఫకీర్ సాహెబ్. ముడబిద్రి ప్రాంతంలోని మహవీర కళాశాలలో బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన మంగళూరులోని కొడియాల్‌బైల్‌లోని ఎస్డీఎమ్ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు. చదవండి: ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు హైకోర్టు న్యాయమూర్తిగా 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోషన్ పొందిన మూడో న్యాయమూర్తి నజీర్ కావడం విశేషం. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పలు కీలక తీర్పులను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి. ముస్లిం షరియా చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ అనుమతించబడుతుందని నజీర్‌తోపాటు మరొ న్యాయమూర్తి సమర్థించారు. అయితే బెంచ్‌లో 3:2 మెజారిటీతో ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించడంతో ఈ కేసు వీగిపోయింది. అయోధ్య రామమందిరంపై తీర్పు 2019లో అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ నజీర్ కూడా సభ్యుడు. ధర్మాసనంలోని అయిదుగురు జడ్జీలు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగానే తీర్పునిచ్చారు. అయితే రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు జస్టిస్ నజీర్ రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2016లో రూ.500,1000 నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించింది. జనవరి 4న రిటైర్మెంట్ అవ్వగా.. నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. -
ట్రిపుల్ తలాక్ కేసు నమోదు
నాగోలు: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం మొదటి ట్రిపుల్ తలాక్ కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా, మల్లెపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ సమి రాజేంద్రనగర్ పీహెచ్సీ టీబీ విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. 2017లో అతడికి హస్తినాపురం ఓంకార్ నగర్‌కు చెందిన హసీనాతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. అయితే గత కొద్ది రోజులుగా అబ్దుల్ సమితో పాటు అతడి తల్లి అన్వరి బేగం, ఆడపడుచు పర్వీన్ అదనపు కట్నం కోసం హసీనాను వేధింస్తున్నారు. దీంతో హసీనా 2019 సెప్టెంబర్‌లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారు హస్తినాపురం ప్రాంతానికి మకాం మార్చారు. కాగా గత మార్చి 25న హసీనాతో గొడవ పడిన సమీ భార్యకు తలాక్ చెప్పి ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. దీంతో హసీనా గత జూన్ 26న వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు త్రిపుల్ తలాక్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అబ్దుల్ సమిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
ట్రిపుల్ తలాక్: బెయిల్ నిబంధనలకు క్యాబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ర్టేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి బెయిల్ నిబంధన విపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. తాజా సవరణ ప్రకారం మేజిస్ట్రేట్‌కు బెయిల్ మంజూరు చేసే అధికారాలుంటాయి. ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ర్టేట్‌ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్ నిర్ణయానుసారం మైనర్ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదంకోసం సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. పెద్దల సభలో బిల్లు ఆమోదానికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లును బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెడితే మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహిళా సాధికారత అంటూ మాటలు చెబుతున్న ప్రధాని మహిళా బిల్లుపై ఎందుకు వెనుకాడుతున్నారని రాహుల్ నిలదీశారు. -
కూతురి వైద్యమంటే.. ట్రిపుల్ తలాక్!
లక్నో : ఓవైపు ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ నేరంగా పరిగణించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా షరా మాములుగా ట్రిపుల్ తలాక్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే బిల్లు వార్తల్లో నిలుస్తున్న తరుణంలో అలాంటి కేసులు ఇంకా ఎక్కువ నమోదు అవుతుండటమే ఇక్కడ గమనించదగ్గ అంశం. ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఒక్క రోజే రెండు ట్రిపుల్ తలాక్ వ్యవహారాలు వెలుగుచూశాయి. గోండా ప్రాంతంలో ఓ మహిళకు తన భర్త మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లగొట్టాడని మీడియా ముందు వాపోయింది. వికలాంగురాలైన కూతురి చికిత్స కోసం డబ్బులు అడిగితే.. తన భర్త ఈ చర్యకు పాల్పడ్డాడని ఆమె వాపోయింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె మత పెద్దలను, పోలీసులను కోరుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇక మరో ఘటనలో దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు ఫోన్లో సందేశం ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. సుల్తాన్‌పూర్‌కు చెందిన రుబినా బానోకు, హఫీజ్ ఖాన్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త యూఏఈలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె అత్తవారింట్లో ఉంటోంది. అయితే గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే రుబినా ఫోన్‌కు హఫీజ్ ట్రిపుల్ తలాక్ సందేశం పంపటంతో ఆమె షాక్ తింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు భర్త తనకు విడాకులు ఇచ్చి ఉంటాడని ఆమె భావిస్తోంది. గత రెండు నెలల్లో యూపీలో ట్రిపుల్ తలాక్ కేసులు 30 దాకా నమోదు కావటం గమనార్హం. రుబినా బానో ఫోటో ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అది ఏ రూపకంలో(ఫోన్ సందేశం, సోషల్ మీడియా ద్వారా అయినా) ఉన్నా సరే నేరమే. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. లోక్‌సభలో బిల్లుకు క్లియరెన్స్ లభించగా.. రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. -
ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
-
ట్రిపుల్ తలాఖ్... మరో మలుపు
ఆరు రోజుల పాటు ముమ్మరంగా విచారణ జరిపిన తర్వాత.. ట్రిపుల్ తలాఖ్ కేసుపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు గురువారంతో ముగిశాయి. ఈ విషయంపై నిపుణుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా చర్చించి జూలై నెలలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అంతకుముందు షయారా బానో తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అమిత్ ఛద్దా తన వాదనలు వినిపించారు. ట్రిపుల్ తలాఖ్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పాపంగా ఆమోదించాలని ఆయన అన్నారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం, ట్రిపుల్ తలాఖ్ అనేది విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఈ వాదనను షయారా బానో న్యాయవాది తిప్పికొట్టారు. అసలు ట్రిపుల్ తలాఖ్ అనే పదం గానీ, ఆ ఆచారం గానీ పవిత్ర ఖురాన్లో ఎక్కడా లేదని, అది ఆమోదయోగ్యం కాని విషయమని స్వయంగా పర్సనల్ లాబోర్డే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని, పాపమని కూడా చాలావరకు ఇస్లాం స్కూళ్లలో చెప్పారని, అయినా దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదనడం సరికాదని ఛద్దా చెప్పారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని ఆయన వాదించారు. మతం ఏం చెబుతుందో ఆర్టికల్ 25 కూడా అదే చెబుతుందని, ఈ అలవాటు ఇస్లాం ప్రకారం సరైంది కాదని, అందువల్ల ఇందులో మతాచారాలను ఉల్లంఘించినట్లు ఏమీ లేదని కూడా ఛద్దా చెప్పారు. ఈ సమయంలో జస్టిస్ నారిమన్ జోక్యం చేసుకున్నారు. ''మీరు వాదించేదాన్ని బట్టి అసలు ట్రిపుల్ తలాఖ్ అనే అలవాటు మతంలో భాగమే కాదు కదా'' అని ఆయన ప్రశ్నించగా, ఛద్దా అవునని చెప్పారు. దాంతో ఈ కేసులో వాదనలు మొత్తం ముగిసినట్లు రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టే ట్రిపుల్ తలాఖ్ ఉంటుందా.. ఉండదా అనే విషయం తేలనుంది.